రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్రం ఎలా ఉండనుంది? దానికి ట్రైలర్ లాంటి ఈ ఏటి తొలి భారీ ఎన్నికల పోరు కర్ణాటక చూస్తే సరి. అందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. కీలక దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో రానున్న మే 10న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించేసరికి వేడి మరింత పెరిగింది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వివిధ కారణాల రీత్యా ప్రతి పార్టీకీ కీలకమే. దక్షిణాదికి ముఖద్వారం లాంటి కన్నడ కోటపై పట్టు బిగించడం బీజేపీకి ముఖ్యం.
జీఎస్డీపీలో 8వ ర్యాంక్‌లో ఉన్న ఈ పెద్ద ధనిక రాష్ట్రంలో గెలవడం ద్వారా పుంజుకోవడం కాంగ్రెస్‌కు కీలకం. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా కాంగ్రెస్‌తో జట్టు కట్టి, ఏడాది పాటు సీఎం పీఠంపై తమవాణ్ణి కూర్చోబెట్టుకున్న జేడీ–ఎస్ తన ప్రాసంగికతను నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలు ప్రధానం. వెరసి, ఈసారి మతం, కులం, అవినీతి ప్రధానాంశాలు కానున్న కర్ణాటక ఎన్నికల సమరం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
కాంగ్రెస్, జనతాదళ్– సెక్యులర్ (జేడీ–ఎస్) పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే, బీజేపీ ఏప్రిల్ మొదటి వారానికి జాబితాతో సిద్ధమవు తుందట. నిజానికి కర్ణాటకలో బీజేపీ తొలి విజయం ఈనాటిది కాదు. 2008లోనే స్వతంత్ర ఎమ్మెల్యే లతో కలసి, ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ పీఠంపై కూర్చుంది. దక్షిణాదిన అదే తొలి బీజేపీ సర్కార్. అప్పట్లో ఒకరికి ముగ్గురు ముఖ్యమంత్రులు (యెడియూరప్ప, సదానంద్ గౌడ, జగదీశ్ షెట్టర్) మారారు.
ఇక, 2018లో ప్రజాతీర్పు విస్పష్టంగా లేక, హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో ఎన్నికల అనంతర విన్యాసాలు మరింత రంజుగా సాగాయి. ఆ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దేవెగౌడ సారథ్యంలోని జేడీ(ఎస్)– కాంగ్రెస్ పార్టీల ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకున్నాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ పక్షాన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన యెడియూరప్ప గద్దెనెక్కారు కానీ, తగినంత మెజారిటీ లేక విశ్వాస పరీక్షకు పది నిమిషాల ముందు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.
ఆపైన దేవెగౌడ కుమారుడు కుమారస్వామి సీఎంగా జేడీ (ఎస్)– కాంగ్రెస్‌ల ప్రభుత్వం ఏర్పా టైంది. తీరా ‘ఆపరేషన్ కమలం–2’ ద్వారా 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు తిప్పుకుంది. అలా ఆ సంకీర్ణ సర్కార్ 14 నెలలకే కుప్పకూలింది. మళ్ళీ యెడియూరప్ప అధికారంలోకి వచ్చారు. తీరా రెండేళ్ళకే ఊహించని పరిణామాలతో యెడియూరప్ప ఆ పీఠం బసవరాజ్ బొమ్మైకి కట్టబె ట్టారు. అలా 2018 నుంచి అయిదేళ్ళలో నాలుగు విడతల్లో ముగ్గురు సీఎంలుగా వచ్చారు.
అసమర్థ పాలన, 40 శాతం కమిషన్ అవినీతి ముద్ర పడేసరికి కాషాయపార్టీ సతమతమవుతోంది. కర్ణాటకలో 7 శాతం ఎస్టీలు, 17 శాతం ఎస్సీలు, 14 శాతం లింగాయత్‌లు, 11 శాతం ఒక్కళిగలని లెక్క. అందుకే, కాంగ్రెస్ ‘అహింద’ (మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితుల) ఓటుబ్యాంక్‌పై ఆధారపడు తుంటే, దాన్ని ఢీ కొనడానికి బీజేపీ సోషల్ ఇంజనీరింగ్‌కు దిగింది. ఓబీసీ కింద ముస్లిమ్‌లకిస్తున్న 4 శాతం కోటాను తొలగించి, రాష్ట్రంలో బలమైన ఓటుబ్యాంకైన లింగాయత్‌లు, ఒక్కళిగలకు పంచింది. ఎస్సీలకు 15 నుంచి 17 శాతానికీ, ఎస్టీలకు 3 నుంచి 7 శాతానికీ రిజర్వేషన్‌ను పెంచింది.
రిజర్వేషన్లలో తాజా మార్పు తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తుంటే, కోటా తొలగింపుపై ముస్లిముల్లో, ఎస్సీల్లో అంతర్గత కోటాపై బంజారాల్లో వెల్లువెత్తుతున్న నిరసన ఆ పార్టీకి తలనొప్పే. తాజా ఎన్నికల సర్వేల్లో సీ–ఓటర్ లాంటివి కాంగ్రెస్ ఘనవిజయం ఖరారంటే, ‘జీ’ లాంటివి కాంగ్రెస్, బీజీపీల మధ్య పోరు నువ్వా, నేనా అన్నట్టు ఉంటుందంటున్నాయి.
అంచనాలెలా ఉన్నా బీజేపీ ఈ ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోవట్లేదు. గత 3 నెలల్లో 7సార్లు మోదీ కన్నడసీమలో పర్యటించడమే అందుకు ఉదాహరణ. మోదీతో పాటు అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, గత ఎన్నికల్లో ‘టిప్పు సుల్తాన్ వర్సెస్ హనుమాన్’ అంటూ భావోద్వేగాలు రెచ్చగొట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు దిగ్గజాలు తాజా ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు.
మొత్తం 5.24 కోట్ల ఓటర్లున్న కర్ణాటకలో తొలిసారి ఓటుహక్కు వచ్చినవారు నిరుటితో పోలిస్తే 9.17 లక్షలు పెరిగారు. అలాగే, 80 ఏళ్ళు పైబడిన దాదాపు 1.5 లక్షల మందికీ, దివ్యాంగులు 5.6 లక్షల మందికీ తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకొనే వీలు కల్పిస్తున్నారు.
ఓటింగ్ శాతం పెంచడానికీ, పట్టణ ఓటర్లలో నిరాసక్తతను తగ్గించడానికీ ఇలాంటి చర్యలని అధి కారిక కథనం. అయితే, ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలు తొలగని అనేక పార్టీలు... ఇక ఇంటి నుంచే ఓటింగ్ అనేది అధికారిక యంత్రాంగ దుర్వినియోగానికి దారి తీస్తుందని ఆందోళన చెందుతున్నాయి. ఆ భయాందోళనల్ని బాపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.
ఎవరి బలాబలాలు ఎలా ఉన్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి చాలా ముందు నుంచే ప్రతి పార్టీ యాత్రలు, ప్రచారం మొదలెట్టేసింది. ఓటర్లకు డిజిటల్ వాచీలు, రైస్ కుక్కర్ల లాంటి కానుకల పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడానికి ముందే రూ. 80 కోట్ల పైగా నగదు చిక్కింది. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు ప్రజలు తిరుగులేని తీర్పు ఇస్తే తప్ప ఎన్నికల అనంతరం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
ఓట్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు... ఎన్నికలయ్యాక ఎమ్మెల్యేల బేరసారాలకూ అదే పంథా అనుసరిస్తే ఆశ్చర్యం లేదు. అలా జరిగితే మరోసారి ప్రజాస్వామ్యం పరిహాసం పాలవుతుంది. ఇటీవలి అనేక ఎన్నికల లాగే కర్ణాటకలోనూ ఫలితాల అనంతరమే అసలు నాటకం మొదలుకావచ్చు. దాని కోసం మే 13 దాకా ఆగాల్సిందే!
ఎన్నికల కర్ణాటకం
Published Fri, Mar 31 2023 2:28 AM | Last Updated on Thu, Apr 20 2023 5:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment