
ప్రకృతి ప్రకోపానికి గురికావడం వేరు. పాలకుల అనాలోచిత చర్య, నిర్లక్ష్యానికి బలి కావడం వేరు. నవీ ముంబయ్‌లోని ఖార్‌ఘర్ ప్రాంతంలో ఆదివారం 38 డిగ్రీల మండుటెండలో 306 ఎకరాల్లో ఆరుబయట ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో అసువులు బాసిన 13 మంది అమాయకులు అక్షరాలా పాలనా యంత్రాంగపు నిర్లక్ష్యానికి బలిపశువులే.
మహారాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్’ను సంఘ సంస్కరణవాది అప్పాసాహెబ్ ధర్మాధికారికి ప్రదానం చేసే ఆ బహిరంగ సభకు 10 లక్షల మంది హాజరయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి, సీఎం లాంటి వీవీ ఐపీలకు ఎండ కన్నెరగని రీతిలో ఏర్పాట్లు చేసిన పెద్దలు, సామాన్యులకు నెత్తి మీద నీడ కాదు కదా.. తాగేందుకు గుక్కెడు చల్లటి మంచినీటినైనా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటే ఏమనాలి?
650 మంది దాకా వేసవి ఉష్ణతాపం వల్ల అస్వస్థతకు గురి కాగా, 18 మంది ఆస్పత్రి పాలైన ఆ సభావేదిక దృశ్యాలు చూస్తుంటే, ఎవరికైనా గుండె మండిపోతుంది. ఎండలు ముదిరిన వేసవిలో, మహారాష్ట్రలో ప్రచండ గ్రీష్మపవనాల ప్రభావం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించి సంగతి తెలిసీ... ఇలా మిడసరిలగ్నంలో బహిరంగ సభ పెట్టి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా ఎవరిచ్చారు? పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రత, వేడిగాలులపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అత్యవసరాన్ని ఈ నిర్లక్ష్యం, వ్యవస్థాగత వైఫల్యం గుర్తుచేస్తున్నాయి. ఈ ఘటన అటు పాలకులకూ, ఇటు వేసవి గడిచేకొద్దీ ఎన్నికల రాజకీయ వేడి పెరిగి, భారీ సభలకు దిగే పార్టీలకూ పాఠాలు చెబుతోంది.
మహారాష్ట్ర ఘటనలో మహాపరాధాలు అనేకం. సాయంత్రం 5 గంటలకు అనుకున్న సభను ఎందుకు ఆరు గంటలు ముందుకు జరిపినట్టు? పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది హాజరయ్యేలా ఎర్రటి ఎండలో గంటలకొద్దీ సభ పెట్టినప్పుడు నీడలో కూర్చొనే ఏర్పాటు, సక్రమంగా మంచినీటి వసతి ఎందుకు చేయలేకపోయినట్టు? ఎండ వేడి, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరై, దాహంతో నోరు పిడచగట్టుకుపోయి, కళ్ళు తిరిగి వడదెబ్బకూ, గుండెపోట్లకూ జనం మరణిస్తే, ‘దురదృష్టకరం’ అని ఒక్కమాట అనేస్తే చాలా? మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించినంత మాత్రాన... చేసిన పాపం, ఏర్పాట్లలో చూపిన నిర్లక్ష్యం మాసిపోతాయా? ఉష్ణపవనాలపై వాతా వరణ శాఖ హెచ్చరికలను యంత్రాంగం పెడచెవిన పెట్టిన ఫలితమిది. ఇది దేశంలో అందరికీ ఓ గుణపాఠం.
తాజాగా ఏప్రిల్ 17 నుంచి అయిదురోజులు యూపీ, బెంగాల్, సిక్కిమ్, ఒడిశా, జార్ఖండ్, కోస్తా ఆంధ్రలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ హెచ్చరికలు రావడం గమనార్హం. గడిచిన 2022లో ఏకంగా 280 రోజులు 16 రాష్ట్రాల్లో ఉష్ణ పవనాలు వీచినట్టు ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ నివేదిక. ఇది గత దశాబ్దిలోకెల్లా అత్యధికం. ఒక్క మహా రాష్ట్రలోనే నిరుడు వేసవిలో 2 నెలల్లో, 4 హీట్ వేవ్స్ వచ్చాయి. 31 మంది మరణించారు.
ఈ ఏడాదీ మార్చి నుంచి మే వరకు మధ్య, వాయవ్య భారతంలో గ్రీష్మ పవనాలు వచ్చే అవకాశం ఎక్కువని ఐఎండీ ఫిబ్రవరిలోనే పారాహుషార్ చెప్పింది. ఆ అంచనా సాక్ష్యమే ఇటీవలి ఎండలు, వడగాడ్పులు. ఏటేటా పెరుగుతూ, జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్న ఈ వేడిమిపై పాలకులు తక్షణం దృష్టి పెట్టాలంటున్నది అందుకే!
2010లోనే ఉష్ణపవనాల తాకిడికి 800 మందికి పైగా మరణించిన అహ్మదాబాద్‌లో అక్కడి నగరపాలక సంస్థ నిపుణుల సాయంతో దేశంలోనే తొలి ‘గ్రీష్మపవన కట్టడి కార్యాచరణ ప్రణాళిక’ (హెచ్‌ఏపీ)ను రూపొందించింది. 2013 నుంచి అమలులో పెట్టి, ఏటా వెయ్యికి పైగా మరణాలను నివారిస్తోంది. జనం జీవనోపాధినీ, ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ఈ వడగాడ్పులను ఎదుర్కోవడానికి ఇంకా అనేకచోట్ల వివిధ పాలనా యంత్రాంగాలు ప్రణాళికలు రూపొందించక పోలేదు.
పిల్లల బడి వేళల్లో, రోజువారీ కూలీల పని వేళల్లో మార్పులు, ప్రథమ చికిత్స, మంచినీటి వసతుల ఏర్పాటు లాంటి ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీ) ఒడిశా లాంటి రాష్ట్రాలు రూపొందించాయి. అయితే, మన దేశంలో ఈ హెచ్‌ఏపీలను ఎక్కడికక్కడ స్థానిక అవసరాలకు తగ్గట్లు తయారు చేయట్లేదు. అది పెద్ద లోపం. నిధుల కొరత సరేసరి. పదులకొద్దీ ప్రణాళికల్ని అధ్యయనం చేసి ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ ఇది తేల్చింది. ఆ మాట మనకు మరో కనువిప్పు.
అందుకే, ఈ ప్రణాళికలన్నిటినీ జాతీయ స్థాయిలో ఒకచోట సమీకరించడం అవసరం. పారదర్శకంగా, ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచి, తరచూ వాటి పనితీరును మదింపు చేయాలి. సీపీఆర్ ఆ సూచనే చేస్తోంది. అలాగే, రోజువారీ కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్ని కొలిచే సంప్రదాయ విధానాలు సరిపోవు.
ఒక ప్రాంతపు వేడినీ, తేమనూ కలిపి కొలిచే ‘వెట్–బల్బ్’ ఉష్ణోగ్రత; అలాగే గాలి వేడిమి, సాపేక్ష ఆర్ద్రత, వాయువేగాల కలయికైన ఒంటికి అనిపించే ఉష్ణోగ్రత లాంటి కొత్త విధానాల్ని అనుసరించడం మంచిది. దీనివల్ల ఒంటిపై ఉష్ణప్రభావాన్ని గ్రహించి, సునిశిత చర్యలు చేపట్టవచ్చు. ప్రజలకు వాతావరణ అక్షరాస్యత కల్పించి, అవగాహన పెంచి, అవాంఛనీయ మార్పులకు సంసిద్ధం చేయడమూ అవసరం.
అందులోనూ రానున్న కాలంలో... ప్రపంచంలో తొలిసారిగా మానవ ఉనికికే ప్రమాదమయ్యే స్థాయి ఉష్ణపవనాలు ఎదురయ్యే ప్రాంతాల్లో ఒకటి భారత్ కావచ్చని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక. పంచాగ్ని మధ్యంలో పడిపోక ముందే తెలివి తెచ్చుకొని, సత్వర కార్యాచరణకు దిగడమే విజ్ఞత. ఉదాసీనతతో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహారాష్ట్ర లాంటి ఘటనలే మళ్ళీ ఎదురవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment