పసిహృదయాల అమాయకపు మాటలు... ఆటలు... పాటలు... ఎవరికైనా ఓ సుందర దృశ్యం. ఆ చిన్నారి దైవాలు కొలువైన బడులు మూతబడి, ఆ అందమైన దృశ్యాలు అరుదైపోయి చాలా కాలమైంది. దేశంలోని ప్రతి చిన్నారీ ఏణ్ణర్ధంగా ఇంటికే పరిమితమైన స్థితి. ఇవాళ్టికీ అందరికీ అందుబాటులో లేని ఆన్‌లైన్ చదువులతో... అవకాశం ఉన్న కొద్దిమంది కుస్తీలు పడుతున్న పరిస్థితి. ప్రత్యక్ష తరగతులు లేక, మాట్లాడుకొనే తోటి వయసు పిల్లలు లేక, శారీరక – మానసిక – పరిశీలనా వికాసానికి దూరమైన దుఃస్థితి. ఇది లేత వయసులో సామాజికంగా జరగాల్సిన సర్వతోముఖ అధ్యయనాన్ని కోల్పోయిన అనూహ్య విషాదం. నిపుణులు అన్నట్టు... ఒక రకంగా ‘విద్యారంగంలో ఎమర్జెన్సీ’. బడుల మూత వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది. అందుకే, ప్రపంచంలో అనేక దేశాలు స్కూళ్ళు తెరుస్తున్నాయి. మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌తో సహా దాదాపు 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా వేళ కొంత సాహసించి, అనేక జాగ్రత్తలతో విద్యాలయాలు తెరవాలని నిర్ణయం తీసుకున్నాయి.
గడచిన 16 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది పిల్లలు విలువైన బడి సమయాన్ని కోల్పోయారు. జీవితంలో ఎంతో విలువైన అనుభూతులకు దూరమయ్యారు. మన దేశంలో 15 లక్షలకు పైగా స్కూళ్ళు మూతబడ్డాయి. ఏకంగా 24.7 కోట్ల పైచిలుకు పిల్లలపై ప్రభావం పడింది. దాని దుష్పరిణామాలు తెలుసు కాబట్టే, ‘కరోనా అనంతర కొత్త జీవితానికి’ తగ్గట్టుగానే, అమెరికా సహా అనేక దేశాలు బడులు తెరిచాయి. మన దేశంలో అయితే, గత ఏణ్ణర్ధకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బడి వయసు ఆడపిల్లల్లో బాల్య వివాహాలు పెరిగాయి. మైనర్లయిన మగపిల్లలను చదువు మాన్పించి, పనుల్లో పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వెల్లడైన తాజా అధ్యయన ఫలితాలు అందుకు ఓ చిన్న ఉదాహరణ. విద్యారంగంపై ఏర్పాటైన మన పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కరోనాతో దీర్ఘకాలం బడులు మూసివేయడం వల్ల విపరిణామాలు తీవ్రంగా ఉన్నాయనీ, వాటినీ విస్మరించలేమనీ ఇటీవలే తేల్చింది. ఇలాంటి మానసిక, సామాజిక దుష్పరిణామాల నేపథ్యంలో... ఆరోగ్య, పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ పాఠశాలలను తెరవడం కీలకమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయం సైతం ఎంతో విలువైనది.
కరోనాతో సహజీవనం తప్పని పరిస్థితుల్లో, అన్ని వ్యాపారాలూ, విద్యాలయాలు తెరవడానికి ఫలానాది సరైన సమయమని ఎప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఏళ్ళ తరబడి విద్యాలయాలు మూసేసి, లక్షల మందిని చదువుకు దూరం చేయడం ఏ రకంగా చూసినా సమంజసం కాదు. ఇటు బడిపిల్లలే కాదు.. అధ్యాపకులూ అవస్థలు పాలయ్యారు. పిల్లలు ఫీజులు కట్టని స్థితిలో, దేశంలో ప్రైవేటు రంగ బడ్జెట్ స్కూళ్ళు వేల కొద్దీ మూతబడ్డాయి. ఎందరో ఉపాధి పోయి, వీధిన పడ్డారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే, ఇది విద్యారంగంలో పెను సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే, స్కూళ్ళు తెరవడం ఇప్పుడు కీలకం. జూలైలోనే హరియాణా, నాగాలాండ్ బడి గంట మోగించాయి. ఈ నెలలో ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లు పిల్లలకు ప్రత్యక్ష తరగతులకు సై అన్నాయి. ఏపీ ప్రభుత్వం పిల్లల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, ఈ ఆగస్టు 16 నుంచి అన్ని రకాల ముందు జాగ్రత్తలతో స్కూళ్ళు తెరుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. తెలంగాణ సర్కార్ సైతం అదే యోచన చేస్తున్నట్టు వార్త.
కరోనా మూడోవేవ్ మాటల నేపథ్యంలో ఆన్‌లైన్ బోధనతోనే సరిపెట్టవచ్చుగా అని వాదిస్తున్నవారూ లేకపోలేదు. కానీ, మన దేశంలో గ్రామీణ, నగర ప్రాంతాల మధ్య తేడాను గుర్తుంచుకోవాలి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వసతి లేని కరవైన కోట్లాది జనం... చెట్లూ, గుట్టలు ఎక్కితే కానీ ఆన్‌లైన్ క్లాసులు చూడలేని గ్రామీణ విద్యార్థులు ఉన్న దేశంలో పూర్తిగా ఆన్‌లైన్ విద్యాబోధన ఆచరణ సాధ్యం కాదు. దాని వల్ల అర్ధంతరంగా చదువు మానేస్తున్నవారి సంఖ్యా లక్షల్లో ఉన్నట్టు గణాంకాలే సాక్ష్యం. అందుకే, మన దగ్గర ప్రత్యక్ష తరగతుల ప్రాధాన్యం మరీ ఎక్కువ. అదే సమయంలో ప్రత్యక్ష తరగతుల కోసం తగు జాగ్రత్తలూ తప్పనిసరి. అమెరికాలో 50 శాతానికి పైగా, బ్రిటన్‌లో 80 శాతానికి పైగా కరోనా టీకాలు వేయడం పూర్తయింది. కానీ, మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 12 శాతమే అని ఓ లెక్క. ఈ పరిస్థితుల్లో ముందుగా మన అధ్యాపకులందరికీ టీకాలు వేయడం పూర్తి చేయాలి. స్కూలు పిల్లలున్న తల్లితండ్రులకూ టీకాలు వేయడం కీలకం.
అతి తొందర చూపకుండా ఒక్కో అడుగు వేస్తూ, ముందుకు పోవాల్సిన సమయమిది. ముందుగా బడిసమయాన్ని కొన్ని గంటలకే పరిమితం చేయవచ్చు. కొన్ని తరగతుల పిల్లలతోనే స్కూళ్ళు తెరిచి, క్రమంగా విస్తరించవచ్చు అని నిపుణుల సూచన. అలాగే, కొంత ఆన్‌లైన్, మరికొంత ప్రత్యక్ష తరగతులతో సమ్మిళిత విద్యాబోధన విధానాన్ని కొంతకాలం అనుసరించవచ్చు. ఇలాంటి ఆచరణాత్మక ప్రణాళికలతో దేశవ్యాప్తంగా బడి చదువులు మళ్ళీ పట్టాలెక్కాలి. బయట వ్యక్తమవుతున్న భయాలతో సంబంధం లేకుండా, పిల్లలు బడి బాట పట్టేందుకు తహతహలాడుతున్నారు. కరోనా కష్టం పేరుతో విద్యారంగాన్ని అనాథలా వదిలేయరాదని పాలకులూ గుర్తించారు. నిర్దిష్ట వ్యూహంతో, చిన్నారుల్లో చిరునవ్వులు వెలిగించవచ్చు. అవును... బడి గంటలు మోగే వేళయింది. చదువుల తల్లి ఒడి చేరే వేళయింది. రండి... అన్ని ఆరోగ్య జాగ్రత్తలతో, బడికెళదాం!
బడికెళదాం... రండి!
Published Sat, Aug 14 2021 1:23 AM | Last Updated on Sat, Aug 14 2021 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment