రెండేళ్లకుపైగా ఉత్తరప్రదేశ్ జైల్లో మగ్గిన కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్ బెయిల్ మంజూరై ఎట్టకేలకు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2020 అక్టోబర్‌లో దుండగుల అమానుషత్వానికి బలైపోయిన పందొమ్మిదేళ్ల దళిత యువతి భౌతికకాయాన్ని పోలీసులు ఆమె తల్లిదండ్రుల అభీష్టానికి విరుద్ధంగా తరలించుకుపోయి, తామే అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ప్రయత్ని స్తున్నారన్న సంగతి తెలిసి వెళ్తున్న కప్పన్‌ను యూపీ పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేశారు. పాత్రికేయ వృత్తిలో ఉండేవారికి ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. ఉద్యమకారులకూ, పోలీసు లకూ మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడైనా...అవినీతి, మాఫియా సామ్రాజ్యాల గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడైనా వారికి సమస్యలు ఎదురవుతుంటాయి. సిద్దిఖీ కప్పన్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు అంత్యక్రియల ప్రాంతానికి వెళ్లకుండా ఆయన్ను అడ్డుకోవడానికేనని అందరూ అనుకున్నారు. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. ఒక సాధారణ పాత్రికేయుడని అందరూ అనుకుంటున్న కప్పన్‌ను పోలీసులు ఉగ్రవాద సమర్థకుడిగా చిత్రిస్తూ వరస కేసులు పెట్టారు. అప్పటికింకా నిషేధానికి గురికాని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)కు సలహాదారుగా చిత్రించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)కింద కేసు పెట్టారు. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) స్వీకరించింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా రంగంలోకొచ్చి నేరారోపణలు చేసింది. ఆయనతోపాటు మరో అయిదుగురు కూడా ఈ కేసులన్నిటా సహ నిందితులుగా ఉన్నారు. ఈ ఆరోపణలు ఏమేరకు నిలబడతాయో, కప్పన్, ఆయన సహచరులు నిర్దోషులుగా బయటికొస్తారో లేదో మున్ముందు తేలుతుంది.
అయితే నిరుడు సెప్టెంబర్‌లో కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ లేవనెత్తిన ప్రశ్న కీలకమైనది. ‘ప్రతి పౌరుడికీ తన అభిప్రాయాలు వ్యక్తంచేసే స్వేచ్ఛ ఉంది. హథ్రాస్ బాధితురాలికి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటే అది చట్టం దృష్టిలో నేరమెలా అవుతుంది?’ అని ఆయన నిలదీశారు. అదుపులోనికి తీసుకున్న సమయంలో కప్పన్ వాహనం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్న కొన్ని కాగితాలు జస్టిస్ లలిత్‌కు అభ్యంతరకరమైనవిగా కనబడలేదు. అప్పటికే దీర్ఘకాలం జైల్లో ఉన్నందువల్ల, అరెస్టు చేసినప్పుడున్న పరిస్థితులను, ఈ కేసులోని ప్రత్యేకతలనూ పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించడానికి మరో నాలుగు నెలలు పట్టింది. ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ కేసు చిత్రమైనది. తన బ్యాంకు ఖాతా నుంచి సహ నిందితుడి ఖాతాకు కప్పన్ రూ. 5,000 బదిలీ చేయటం దీని సారాంశం.
యూఏపీఏ కేసులో బెయిల్ లభించినవారు సమర్పించే పూచీకత్తులు సరిచూడటానికి 90 రోజులు తీసుకోవచ్చు గనుక కప్పన్ బయటికొచ్చేందుకు ఇంత సమయం పట్టింది. కప్పన్ ఒక్కరే కాదు... దేశంలో ఇదే మాదిరి యూఏపీఏ కేసుల్లో ఇరుక్కొని జైలుపాలైనవారు మరో అయిదుగురున్నారని నిరుడు డిసెంబర్‌లో పాత్రికేయుల పరిరక్షణ సంఘం(సీపీజే) తెలిపింది. మణిపూర్ పాత్రికేయుడు కిషోర్‌చంద్ర వాంఖెమ్‌ను 2019లో జాతీయ భద్రతా చట్టం(నాసా) కింద అరెస్టు చేశారు. నిజానికి కప్పన్ యూపీ నివాసి కాదు. ఆయన ఢిల్లీ కేంద్రంగా ఒక మలయాళ మీడియా సంస్థకు పనిచేస్తున్నారు. అందువల్ల కప్పన్‌పై యూపీ పోలీసులకైనా, అక్కడి రాజకీయ నాయకత్వానికైనా వ్యక్తిగత కక్ష ఉండే అవకాశం లేదు. మరైతే ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఎవరు కప్పన్‌పై కేసులు పెట్టడానికి పూనుకున్నట్టు? హథ్రాస్ అమానుషం చుట్టూ అలుముకున్న పరిస్థితులనూ, ఈ ఉదంతంవల్ల ప్రభుత్వానికి కలగబోయే అప్రదిష్టనూ పరిగణనలోకి తీసుకుని మీడియా కథనాలను నియంత్రించాలన్న లక్ష్యంతో, పాత్రికేయులను భయభ్రాంతుల్ని చేసే ఉద్దేశంతో యూపీ సర్కారు ఈ చర్యకు దిగిందని పాత్రికేయ సంఘాలు అప్పట్లో ఆరోపించాయి.
ఈమాదిరి కేసులు విచారణకు రావాలంటే కింది స్థాయి కోర్టుల్లోనే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. ఈలోగా బెయిల్ కోసం ఉన్నత స్థాయి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సివస్తుంది. అక్కడ వెంటనే ఉపశమనం లభించటం సులభం కాదు. అప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షల కేసుల్లో ఇదొకటవుతుంది గనుక సహజంగానే జాప్యం చోటుచేసుకుంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ ప్రక్రియంతా నిందితులకూ, వారి కుటుంబాలకూ ఒక శిక్షలాంటిదే. ప్రస్తుత కేసుల్లో కప్పన్‌కు బెయిల్ రావటానికే 28 నెలలు పట్టింది. ఇక కేసు విచారణ పూర్తయి, తీర్పు వెలువడటానికి మరెన్నేళ్లు పడుతుందో? తీర్పు ప్రతికూలంగా వెలువడితే మళ్లీ జైలుకూ, ఆ తర్వాత అప్పీల్‌కూ పోవాలి. ఆ తర్వాత మళ్లీ బెయిల్, విచారణకు హాజరుకావడం షరా మామూలు. అడపా దడపా జరిగే ఉగ్రవాద ఘటనలను సాకుగా చూపి ప్రభుత్వాలు ఈ కఠినమైన చట్టాలు తీసుకొచ్చాయి. ఉన్న చట్టాలకు సవరణలద్వారా పదునుపెట్టాయి. చట్టసభల్లో చర్చ జరిగినప్పుడల్లా తమ చర్యలను గట్టిగా సమర్థించుకున్నాయి. దుర్వినియోగానికి ఆస్కారం లేనివిధంగా పకడ్బందీ నిబంధనలు చేర్చామని స్వోత్కర్షకు పోయాయి. సాధారణ పౌరులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేనేలేదని చెప్పాయి. ఆచరణలో మాత్రం జనం తరఫున ప్రశ్నిస్తున్న ఉద్యమకారులు, నిజాలను ధైర్యంగా వెలికితీసేందుకు ప్రయత్నించే పాత్రికేయులు ఈ చట్టాలకు బలైపోతున్నారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కనుక దీన్ని అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం తగిన ఆదేశాలివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment