గ్రీష్మకాల మార్తాండుడు నిప్పులు చెరుగుతున్నవేళ నీలాకాశం నల్లటి మబ్బు తెరలతో గొడుగు పట్టాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఆ మేఘాలు తమ హృదయ కవాటాలు తెరిచి చినుకు ధారలతో నేలతల్లికి అభిషేకం చేస్తే ఇక చెప్పేదేముంది? అందుకే ‘వానంటే ప్రకృతి వరప్రసాదం. నింగి నేలకు దిగిరావడం’ అంటాడు అమెరికన్ రచయిత, కవి జాన్ అప్‌డైక్. మన దేశంలో జోరుగా వానలు మోసుకొచ్చే నైరుతీ రుతుపవనాల గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏటా విడుదల చేసే అంచనాల గురించి అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అంచనాలు తప్పినప్పుడు ఆసక్తి స్థానంలో నిరాసక్తత ఏర్పడటమూ రివాజే. ఈసారి కూడా ఐఎండీ అంచనాలు కాస్త గురితప్పాయి. చాలా ముందే రుతుపవనాలు ఆగమిస్తాయని చెప్పడంతో మొదలుపెట్టి అవి వచ్చేశాయని కూడా ప్రకటించి నాలిక్కరుచుకోవడంతో ఎప్పటికన్నా ఎక్కువగా ఐఎండీపై విమర్శల జోరు పెరిగింది.
‘కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా’ అన్నట్టు శుక్రవారం నాటికి దాదాపు కేరళ అంతటా వర్షాలు మొదలయ్యాయని తాజా సమాచారం చెబుతోంది. వాతావరణ అంచనాలకు సంబంధిం చిన ఉపకరణాలు, సాంకేతికతలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఐఎండీకి తొట్రుపాటు ఎందుకు తప్పడం లేదు? ‘సాంకేతికతలుంటేనే సరిపోదు, వాటిని సక్రమంగా వినియోగించాలి. పద్ధతులు పాటించాలి’ అంటోంది ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్. ఒక రంగంలో పనిచేసేవారి మధ్య తెలియని పోటీతత్వం ఉండటం, పరస్పరం విమర్శించుకోవడం అసహజమేమీ కాదు. కనుక స్కైమెట్ విమర్శే సర్వస్వం అనుకోనవసరం లేదు.
ఐఎండీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అంచనాలు అందించింది. ఈసారి దేశ వాయవ్య ప్రాంతంలో తప్ప ఇతరచోట్ల 103 శాతం వరకూ వర్షపాతం ఉండొచ్చని చెప్పింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మే నెల 15 కల్లా నైరుతీ రుతుపవనాలు ఆగమిస్తాయన్నది. 19న మరో అంచనా విడుదల చేసింది. అయిదారు రోజులు ముందు... అంటే ఏటా ఇంచుమించు జూన్ 1 ప్రాంతంలో కేరళను పలకరించే రుతుపవనాలు మే 25 నాటికే రావొచ్చని వివరించింది. చివరకు రుతుపవనాలు వచ్చేశాయని 29న కురిసిన వర్షాల ఆధారంగా ఐఎండీ మరో ప్రకటన విడుదల చేసింది కూడా. అయితే ఆ మర్నాడే ఒక వివరణనిచ్చింది. వాతావరణ పరిస్థితుల రీత్యా రుతుపవనాలు ప్రభావం అన్నిచోట్లా సమంగా ఉండకపోవచ్చని తెలిపింది. నిజమే. కేరళలోని 14 వర్షపాత నమోదు కేంద్రాల్లో ఒక్కచోట కూడా వానపడిన దాఖలా లేదు. మరో రెండు కేంద్రాల్లో మాత్రం ఒక మిల్లీమీటరు వర్షపాతం కన్నా తక్కువ నమోదైంది. కేవలం 29న పడిన వర్షం ఆధారంగా అంచనాలు ప్రకటించడం ప్రమాణాలు ఉల్లంఘించడమేనన్నది స్కైమెట్ ఆరోపణ.
‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అన్నది నానుడి. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఈ నానుడికి విలువ లేకుండా పోతున్నది. క్షణంసేపు ఆగిన ప్రాణాన్ని సైతం నిలబెడుతున్న మాదిరే వాతావరణ అంచనాలు కూడా దాదాపు సరిగానే ఉంటున్నాయి. అలాగని ప్రమాణాలను పక్కన బెట్టి ఇష్టానుసారం అంచనాలివ్వడం సరికాదు. ఒకటి రెండు రోజులు వేచిచూసి, అన్నివిధాలా అధ్యయనం చేస్తే వచ్చే నష్టం లేదు. ఇంకా చెప్పలేదేమని నిలదీసేవారెవరూ ఉండరు. కానీ అశాస్త్రీయ అంచనాలు వెలువరిస్తే పరిశోధనా సంస్థలకుండే ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మార్కెట్‌లు మెరిసిపోవడానికీ, మదుపరులు హుషారెత్తడానికీ ‘మంచి అంచనాలు’ ఇవ్వాలని వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఐఎండీ అడ్డతోవలో అంచనాలు వేసిందన్న ఆరోపణలున్నాయి. అందులోని నిజానిజాల మాటెలా ఉన్నా అంచనాలు తప్పినప్పుడు శాస్త్రవేత్తలను నిలదీసిన దాఖలాలు మన దేశంలో లేవు. 2009 ఏప్రిల్‌లో ఒక నగరానికి భారీ నష్టం తీసుకొచ్చి, 306 మందిని బలిగొన్న భూకంపంపై సరైన అంచనాలు ఇవ్వలేకపోయారన్న కారణంగా ఆరుగురు ఇటలీ శాస్త్రవేత్తలకు ఆరేళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. అదృష్టవశాత్తూ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు.
ఈపాటికి శాంతించాల్సిన భానుడు ఇంకా తన ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఈ ఉష్ణోగ్రతలుంటాయని దాని అంచనా. అందుకు తగ్గట్టే వాతావరణం భగ్గుమంటున్నది. ఈ పరిస్థితుల్లో ఐఎండీ అంచనా లకు విలువేముంటుంది? మన దేశంలో సాగుయోగ్యమైన భూముల్లో 60 శాతం వర్షాధారం. మనకు కురిసే వర్షాల్లో 80 శాతం నైరుతీ రుతుపవనాల ద్వారానే వస్తాయి. మన జీడీపీలో సాగు రంగం వాటా క్రమేపీ చిక్కిపోతున్నా ఇప్పటికీ అది గణనీయంగానే ఉంది. అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతంమందికి సాగురంగమే ఉపాధి కల్పిస్తున్నది. ఉపాధి, ద్రవ్యోల్బణం, పారిశ్రామికరంగ కదలిక, గ్రామీణ ఆదాయాలు వగైరాలన్నీ నైరుతీ రుతుపవన గమనంపైనే ఆధారపడి ఉంటాయి. చినుకు కోసం ఆకాశంకేసి చూసే రైతును నిరాశపరిస్తే... అతని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే దాని ప్రభావం సాగు ఉత్పాదకతపై ఎంతగానో ఉంటుంది. ఫలానా తేదీకి రుతుపవనాలు వస్తాయని చెప్పడం వల్ల రైతులు డబ్బు ఖర్చుచేసి అవసరమైనవన్నీ సమకూర్చు కుంటారు. తీరా అనుకున్నట్టు జరగకపోతే నష్టపోతారు. కనుక అంచనాల విషయంలో శాస్త్రవేత్తలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. విమర్శలకు తావీయని రీతిలో వ్యవహరించాలి.
Comments
Please login to add a commentAdd a comment