
చారిత్రక విభాత సంధ్యల మానవకథ వికాసమెట్టిది? చరిత్ర అధ్యయనంలో ఈ కోణం చాలా ముఖ్యం. నాగరికత నడిచి వచ్చిన బాటలో గుర్తుపెట్టుకోదగిన మైలురాళ్లు ఎన్నో ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి. మననం చేసుకోదగిన మలుపులెన్నో ఆ బాటలో ఉంటాయి. వాటిని మదిలో పెట్టుకోవాలి. ఆ మైలురాయిని దాటిన తర్వాత, ఆ మలుపు తిరిగిన తర్వాత జీవన చిత్రం మెరిసిందా? వెలిసిందా? అనేది అంతకంటే ముఖ్యం.
సరిగ్గా ముప్పయ్యేళ్ల కిందట భారతదేశ చరిత్ర ఒక కీలక మలుపును తీసుకున్నది. ప్రగతి గమనంలో గడిచిన వెయ్యేళ్ల ప్రయాణం కంటే ఈ ముప్పయ్యేళ్ల ప్రయాణమే ఎక్కువ. అంతటి ఝంఝామారుతవేగాన్ని ప్రసవించిన మలుపు పేరు ఆర్థిక సంస్కరణలు. ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ల జోడీ ఈ పురుడు పోసింది. 1991 జూలై 24న మొదలుపెట్టి వంద రోజుల్లోనే కీలకమైన అనేక ఆర్థిక నిర్ణయాలను అప్పటి మైనారిటీ ప్రభుత్వం తీసుకున్నది. ‘‘ఈ భూ ప్రపంచంలోని సమస్త శక్తులూ, సైన్యాలకంటే, కాలాను గుణమైన ఒక ఆలోచన (ఐడియా) గొప్పదని’’ మన్మోహన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఉద్ఘాటించారు. ఫ్రెంచి కవి విక్టర్ హ్యూగోను ఉటంకిస్తూ ఈ మంత్ర వాక్యాన్ని పఠించి భారత ఆర్థిక వ్యవస్థ కిటికీ తలుపుల్ని ఆయన తెరిపించారు. ఫలితాలేమి టన్నది అనుభవైకవేద్యమే.
విజేతలే చరిత్రను లిఖిస్తారు. లేదా విజేతల తరఫుననే చరిత్రకారులు రాస్తారు. పీవీ నరసింహారావు – మన్మోహన్‌ల జోడీకి ఐదేళ్లు అధికారంలో ఉండి ఆర్థిక సంస్కరణలు అమలుచేసే అవకాశం దొరికింది. కనుక ఈ ఆలోచన కూడా వారి ఖాతాలోనే పడింది. కానీ, అంతకంటే ఏడాది ముందుగానే అప్పటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ సూచన మేరకు నాటి పీఎమ్‌ఓలో సలహాదారుగా ఉన్న మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా ఎమ్–డాక్యుమెంట్ పేరుతో ఆర్థిక సంస్కరణల ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. 1990లో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ డాక్యుమెంట్ అచ్చయింది కూడా! ఆర్థిక సంస్కరణలతోపాటు సామాజిక సంస్కరణల గురించి కూడా వీపీ సింగ్ ఆలోచించారు. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే మండల్ సిఫారసుల్ని ముందుకు తెచ్చారు. ఇది అప్పటి కులీన మేధావి వర్గానికి నచ్చలేదు. ఫలితంగా ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆర్థిక సంస్కరణలకు మాత్రమే పరిమితమై ఉంటే, బహుశా విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రధాని పదవిలో కొనసాగి ఉండేవారేమో.
సంస్కరణల ఫలితంగా సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. అదే నిష్పత్తిలో అసమానతలు కూడా పెరిగాయి. సంస్క రణల సత్ఫలితాలను ఆదిలోనే అందిపుచ్చుకొని కొత్త సహస్రాబ్ది లోకి ముందడుగు వేసిన వర్గాలు మున్ముందుకు దూసుకొని పోయాయి. వెనుకబడిన వారు అక్కడే ఉండిపోయారు. పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్న మధ్యతరగతి వారిలో కొందరు తొలి రోజుల్లోని షేర్ మార్కెట్ బూమ్‌ను క్యాష్ చేసుకోగలిగారు. పట్టణ శివార్లలో భూములున్నవారికి కోళ్లఫారాల వ్యాపారం కన్నా కాలేజీల వ్యాపారం లాభసాటిగా కన్పించింది. కనిపించ డమే కాదు కాసులు కురిపించింది. ఇలా రకరకాలుగా పోగేసు కున్నవారికి మరో జాక్‌పాట్ తగిలింది. అదే రియల్ ఎస్టేట్ బూమ్. పట్టణీకరణ కార్యక్రమం సిరిగలవాడి పట్టాభిషేకోత్స వంగా మారింది. మిరుమిట్లు గొలిపే నయా సంపన్న వర్గాలతో ఇండియా వెలిగిపోవడం మొదలైంది. కొత్త వ్యాపార సంస్కృ తిలో పాత విలువలు కొట్టుకొని పోయాయి. ఈ క్రమంలోనే విద్య కూడా అంగడి సరుకైంది.
ఈ దేశంలోని అత్యధిక ప్రజానీకానికి సొంతంగా భూములు లేవు. ఏ బూమ్‌లూ వారికి అందలేదు. వీరిలో సహజంగానే దళితులూ, గిరిజనులూ ఉన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజల్లో అత్యధికులు ఉన్నారు. అగ్ర కులాల్లోనూ మెజా రిటీగా ఉండే పేదలందరూ ఉన్నారు. ఈ పేదల కులం బతు కులు బాగుపడకపోగా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గతంలో ఉచితంగా లభించిన విద్య ఇప్పుడు అందని ద్రాక్షగా మారింది. విద్యారంగ మైదానంలో ప్రైవేటీకరణ రేసుగుర్రంలా పరుగులు తీసింది. ఈ గుర్రప్పందేల్లో నంబర్‌వన్ జాకీగా చంద్రబాబు ఘనకీర్తిని సాధించారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసు కోకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఆయన గద్దెనెక్కిన ఎనిమిదేళ్లకు 2003లో తీసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 95.5 శాతం ప్రైవేట్ కాలేజీలే! దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్య ధికం. ఈ సంస్థలను స్థాపించినవారు విద్యావేత్తలూ, వదా న్యులు కాదు. డబ్బు సంపాదనకు చిట్‌ఫండ్ అయితేనేమీ, చింతపండు అయితేనేమీ అనుకునేవాళ్లు! కోళ్లఫారమైతేనేమీ, కాలేజీ అయితేనేమీ అనుకునేవాళ్లు!! వీరి కబంధ హస్తాల్లోకి విద్యా రంగం వెళ్లిపోయింది.
ఉన్నత విద్యను ప్రైవేట్ దోపిడీకి ఎరవేసిన ప్రభుత్వాలు పాఠశాల విద్యను కూడా గాలికొదిలేశాయి. ఫలితంగా అక్కడా ప్రైవేట్ స్కూళ్ల ఆధిపత్యమే ఏర్పడింది. కనీసం మంచినీళ్లు, టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించకుండా ప్రభుత్వ స్కూళ్లను శిథిలం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారికే ఉద్యో గాలు లభించే అవకాశాలున్న మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇంగ్లిష్ మీడియం కోసం ప్రైవేట్ స్కూళ్లలో చదివించడానికే పేద తల్లిదండ్రులు సైతం మొగ్గుచూపారు. పిల్లల భవిష్యత్‌కోసం తల్లిదండ్రులు పడే తపనను అవకాశంగా మలుచుకొని ఎక్కువ భాగం ప్రైవేట్ పాఠశాలలు దోపిడీ కార్యక్రమాన్ని చేపట్టాయి. వడ్డీ మీద చక్రవడ్డీ చందంగా, మోయలేని స్కూలు ఫీజులతో పాటు, పుస్తకాలకూ, నోటు బుక్కులకూ, బ్యాగుకూ, బ్యాడ్జీకీ, బూట్లకూ, బెల్టుకూ, యూనిఫామ్‌కూ ఇష్టారీతిన ధరలు నిర్ణ యించి వసూలు చేయడం మొదలుపెట్టాయి. పిల్లల పాఠశాల చదువులకోసమే తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. అన్నిరకాల ఫీజుల్ని ముక్కు పిండి వసూలుచేసే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యా బోధనలో మాత్రం ప్రమాణాలను పాటించడంలేదు. ఎక్కువ భాగం స్కూళ్లలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే లేరు. సుశిక్షితు లైన, అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ రంగంలోనే ఉన్నారు. కానీ, ఇంగ్లిష్ మీడియం లేని కారణంగా, కనీస వసతులు లేని కారణంగా ఏటేటా ఈ స్కూళ్లలో విద్యార్థుల చేరిక పడిపోతూ వచ్చింది. ఈరకంగా మన ప్రాథమిక విద్య ఉభయ భ్రష్టత్వంగా తయారైంది. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ముఖ్య మంత్రిగా ఉండగా తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గెలిచే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వంద కోట్లు ఇస్తానని ప్రకటించారు. జపాన్‌కు చెందిన ఒక నోబెల్ గ్రహీతతో విద్యార్థుల సమక్షంలో మాట్లాడుతూ ఆ పురస్కారం సాధించటానికి అడ్డదారులు ఏమైనా ఉంటే మా విద్యార్థులకు చెప్పండని అడిగారు. అదీ విద్యారంగంమీద చంద్రబాబు అభిప్రాయం, అవగాహన.
ఇప్పుడు మళ్లీ ఒకసారి విక్టర్ హ్యూగోను తలపునకు తెచ్చుకుందాం. విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన సాకారం దిద్దుకుంటున్నది. ఈ భూమండలం మీది సమస్త శక్తులు ఏకమైనా ఇక దాన్ని అడ్డుకోలేవు. రెండేళ్ల కిందట ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షుభితమైన విద్యారంగంపైన దృష్టి నిలిపింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటైన, కొన్ని విషయాల్లో మెరుగైన వసతులను కల్పించే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పదిహేను వేలకు పైగా స్కూళ్లలో ఈ కార్య క్రమం పూర్తయింది. సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ఆ స్కూళ్లను చూసి విద్యార్థులు మురిసిపోతున్నారు, బడి ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు ఫొటోలు తెప్పించుకొని ‘ఔనా... ఇది మన ఊరి బడేనా’ అంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డను బడికి పంపేలా అమ్మను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రకటించింది. బిడ్డను బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తుంది. బిడ్డను బడికి పంపే మోటి వేటర్ అమ్మే కానుంది. వీటికితోడు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి మరీ ‘జగనన్న విద్యా కానుక’ను ఎంపిక చేస్తున్నారు. ఈ కానుకలో స్కూల్ యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్, బూట్లు, పుస్తకాలు, నోట్ బుక్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ విద్యార్థులకు ఉచితం. ఉన్నత విద్యను చదివే పిల్లలకోసం ‘జగనన్న వసతి దీవెన’, ‘జగనన్న విద్యా దీవెన’ పథకాలను అందరికీ వర్తించేలా అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం ఆరు లక్షల మంది చేరారు. ఆగస్టులో ప్రారంభం కానున్న అడ్మిషన్లతో ఈ సంవత్సరం మరింత ఎక్కువమంది చేరే అవకాశాలున్నాయి.
తల్లిదండ్రులకెటువంటి భారం లేకుండా పిల్లలందర్నీ బడికి చేర్చడం ఒక భాగం. ఈ కర్తవ్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఇక రెండవ భాగం వారికి నాణ్యమైన విద్యను అందజేయడం. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో వారు ఉన్నత ప్రమాణాలతో నిలబడేలా చేయడం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు మేధోమథనం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానాన్ని కవచంగా వాడుకుంటూ మరింత మెరుగైన శాస్త్రీయమైన విద్యావిధానాన్ని ముందుకు తెచ్చింది. ఈ కొత్త ప్రతిపాదనల వెనుక ఒక తాత్విక భూమిక ఉన్నది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల అత్యు న్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను కులమత వర్గ ప్రాంతాలకతీతంగా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచ డమే దాని ఫిలాసఫీ. అసర్, ఎన్‌ఏఎస్ వంటి పరిశోధనల్ని అధ్యయనం చేసి, వాటి సారాంశాన్ని కూడా క్రోడీకరించి పునాది విద్యను (ఫౌండేషన్ కోర్సు) పటిష్ఠం చేయాలన్న నిర్ణయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నది. ఎలిమెంటరీ స్థాయి పిల్లల్లో చతుర్విధ ప్రక్రియల (కూడిక, తీసివేత, గుణకారం, భాగ హారం) ప్రావీణ్యం ఉంటేనే పునాది బలంగా ఉన్నట్టు లెక్క. మన పిల్లల్లో అవి లోపించాయని, అనేక సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫౌండేషన్ కోర్సుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీ కరించినట్టు కనిపిస్తున్నది. కొత్త విధానంలో ఆరు రకాల స్కూల్స్‌ను ప్రతిపాదిస్తున్నారు. అంగన్‌వాడీలను మిళితం చేస్తూ ఫౌండేషన్ కోర్సును ప్రతిపాదించడం గొప్ప నిర్ణయం. మూడు నుంచి ఆరేళ్ల మధ్యవయసు పిల్లల్లో అప్పుడే మేధోవికాసం మొద లవుతుందనీ, ఆ దశలో పడే పునాది బలంగా ఉంటుందనే శాస్త్రీయ అధ్యయనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసు కొని ఉండవచ్చు. ఆగస్టు 16వ తేదీన కొత్త పాలసీని వివరంగా ప్రభుత్వం ప్రకటించబోతున్నది. అదేరోజున పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ముస్తాబైన మూడో వంతు స్కూళ్లను ఆరోజే ప్రజలకు అంకితం చేస్తారు. మరో మూడో వంతు స్కూళ్ల రూపు మార్చే కార్యక్రమాన్ని అప్పుడే ప్రారంభిస్తారు. విద్యార్థు లకు విద్యా కానుకల కిట్లను కూడా అందజేస్తారు. భారతదేశ విద్యారంగ చరిత్రలో ఆగస్టు 16 ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రిజర్వు చేసుకోబోతున్నది. సార్వజనీనమైన, మానవీయమైన, శాస్త్రీయమైన ప్రాథమిక విద్యకు శంఖం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అభ్యుదయవాదులు, మేధావులు, ప్రజ లను ప్రేమించేవాళ్లందరూ సంఘటితమై ఈ యజ్ఞానికి అండగా నిలబడాలి. రాజకీయ మారీచుల కుట్రలను భగ్నం చేయాలి. ఆ రోజున బడిగంటలు మోగేవేళకు... గుడిగంటలు కూడా మోగించి ఆశీర్వదించండి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment