
శ్రీరామ నవమికి చిన భద్రాద్రి ముస్తాబు
చింతలపూడి: చింతలపూడి మండలం యర్రగుంటపల్లి సమీపంలోని శ్రీ రామ రామలింగేశ్వర స్వామి దేవాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 6న కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. రాముడి గట్టుగా ప్రసిద్ధికెక్కిన సీతా రామాంజనేయ ఆలయాన్ని ఈ ప్రాంత భక్తులు చిన్న భద్రాచలంగా పిలుచుకుంటారు. ఇక్కడి ఆలయంలో భద్రాద్రిలో వెలసిన విగ్రహాలను పోలిన విగ్రహాలు ఉండటం విశేషం. భద్రాచలంలో సీతాదేవి రాముల వారి తొడపై ఆసీనులైనట్లు ఇక్కడ కూడా కూర్చుని ఉండటం విశేషం. వందల ఏళ్ళ క్రితం రామ చంద్రుడు సీతా లక్ష్మణ సహేతుడై శంఖు చక్రాలతో ఈ ప్రాంతంలో వెలిసినట్లు చెబుతుంటారు.
ఇక్కడ స్వామి వారి కల్యాణం జరిపితే పెళ్ల కాని అమ్మాయిలకు పెళ్లవుతుందని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయానికి చేరువలో కై లాసపతి పరమేశ్వరుడు నందీ సమేతంగా వేంచేసి ఉన్నాడు. పరమశివుడిని శ్రీరాముడు ముళ్ళ గోరింట పూలతో, బొంత పూలతోను పూజించినట్లు, వెలగ, నేరేడు పళ్లను నివేదించినట్లు చరిత్ర చెబుతోంది. ఏటా చైత్రశుద్ధ నవమికి స్వామి కల్యాణాన్ని వైభవంగా జరుపుతారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి కల్యాణాన్ని వీక్షిస్తారు. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు.
శ్రీరామనవమి ప్రత్యేకం యడవల్లి
కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని ద్వారకాతిరుమల దేవస్థానం దత్తత తీసుకుని ఉప దేవాలయంగా స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సీతారాముల కల్యాణానికి తరలి వస్తారు. ఇక్కడ కూడా భద్రాచలంలో ఉన్నట్లే శ్రీరాముడి తొడ భాగాన సీతాదేవి కూర్చుని ఉండటంతో ఈ ఆలయాన్ని కూడ భక్తులు చిన భద్రాద్రి అని పిలుచుకుంటారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణానికి ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
రాముని గట్టుగా ప్రసిద్ధి చెందిన యర్రగుంటపల్లి రామాలయం
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
యర్రగుంటపల్లి రాముని గట్టు(ఆలయాన్ని) మరింత అభివృద్ధి చేయడానికి ట్రస్టు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడ ఆలయ అభివద్ధికి నిధులు మంజూరు చేయాలి. ఆలయని భూములను ట్రస్ట్‌కు అప్పగించి ప్రభుత్వం రక్షణ కల్పించాలి.
– వి సత్యన్నారాయణ శాస్త్రి, ఆలయ కమిటీ అధ్యక్షుడు, యర్రగుంటపల్లి

శ్రీరామ నవమికి చిన భద్రాద్రి ముస్తాబు

శ్రీరామ నవమికి చిన భద్రాద్రి ముస్తాబు