ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది క్వార్టర్స్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది క్వార్టర్స్‌లో చోరీ

Published Mon, Apr 7 2025 12:40 AM | Last Updated on Mon, Apr 7 2025 12:44 AM

ట్రిప

ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది క్వార్టర్స్‌లో చోరీ

నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఎన్‌1 బ్లాక్‌లోని 103, 303 ఫ్లాట్‌లకు తాళాలు వేసి ఉండటంతో వాటిలో చోరీకి పాల్పడ్డారు. 103 ఫ్లాట్‌లో ఉండే డీన్‌ అకడమిక్‌ సాదు చిరంజీవి ఊరు వెళ్లారు. ఆయన భార్య రాత్రి 10 గంటల వరకు ఫ్లాట్‌లోనే ఉండి, ఆ తర్వాత పక్కన ఉండే స్నేహితుల వద్దకు వెళ్లి పడుకుంది. 303లో ఉండే సీఎస్‌సీ ఫ్యాకల్టీ తన ఫ్లాట్‌కు తాళం వేసి సొంతూరు వెళ్లాడు. దీంతో ఈ రెండు ఫ్లాట్‌లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. చప్పుడవుతుండటంతో పక్క ఫ్లాట్‌ వాళ్లు సెక్యురిటీకి ఫోన్‌ చేసి చెప్పారు. సెక్యురిటీ సిబ్బంది వచ్చేలోగా దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 103 ఫ్లాట్‌లో బెడ్‌రూమ్‌లోని వస్తువులను, బీరువాలోని దుస్తులను చిందరవందరగా పడేశారు. దాదాపు రూ.6 వేల నగదు చోరికి గురైంది. 303 ఫ్లాట్‌లో ఏమీ పోలేదని సంబంధిత యజమానులు పేర్కొన్నారు. చోరీ సంగతి తెలిసిన వెంటనే ఎస్‌ఐ జ్యోతిబసు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సమాచారాన్ని ఏలూరులోని క్లూస్‌ టీంకు తెలపగా వారు వచ్చి పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.

ట్రిపుల్‌ ఐటీలో భద్రత డొల్లే

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో రెండోసారి దొంగతనం జరగడం సంచలనంగా మారింది. గతేడాది ఆగస్టు 20న చోరీ జరిగింది. ప్రతి షిఫ్ట్‌లో 56 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ దొంగలు దర్జాగా చొరబడుతున్నారు. గత నెలలో ఏఆర్‌ డీఎస్పీ ట్రిపుల్‌ ఐటీని సందర్శించి సెక్యురిటీ ఆడిట్‌ నిర్వహించారు. ఈ ఆడిట్‌లో సెక్యురిటీ లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. సెక్యురిటీ పాయింట్‌లు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు సరిహద్దుల వద్ద లేకుండా ఎక్కడో అవసరం లేనిచోట ఏర్పాటు చేయడం గమనర్హం. ఏ ఇళ్లకు తాళాలు వేశారనేది దొంగలకు ఎలా తెలుస్తుందనేది అంతుబట్టడం లేదు. గతేడాది చోరికి సంబంధించి దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. గొడుగువారిగూడెం వైపు నుంచి గోడకున్న ఫెన్సింగ్‌ తీగలు కత్తిరించి లోపలికి ప్రవేశించి ఉంటారని, దొంగతనం చేసిన తరువాత మళ్లీ అదే దారిలో వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.

ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది క్వార్టర్స్‌లో చోరీ 1
1/1

ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది క్వార్టర్స్‌లో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement