ఆక్వాను ఆదుకోండి! | - | Sakshi
Sakshi News home page

ఆక్వాను ఆదుకోండి!

Published Mon, Apr 7 2025 12:40 AM | Last Updated on Mon, Apr 7 2025 12:44 AM

ఆక్వా

ఆక్వాను ఆదుకోండి!

గణపవరం: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వాను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆక్వా రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం గణపవరం కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో గణపవరం, నిడమర్రు, ఉండి, ఆకివీడు, పెంటపాడు, ఉంగుటూరు మండల గ్రామాలకు చెందిన ఆక్వా రైతులు సమావేశమై సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. సమావేశానికి ఆక్వా రైతు అడబాల రంగా అధ్యక్షత వహించారు. సమావేశంలో పలువురు రొయ్య రైతులు సాగులో ఇబ్బందులపై మాట్లాడారు. వ్యాపారుల మాయాజాలం, సీడ్‌లో మోసాలు, షాక్‌ కొడుతున్న విద్యుత్‌ బిల్లులు, పెరిగిపోతున్న మేతల ధరలు, పడిపోతున్న రొయ్య ధరలపై గళమెత్తారు. ప్రస్తుతం రొయ్యల సాగు తీవ్ర నష్టాల బాటలో నడుస్తుందని, 95 శాతం మంది రొయ్యల రైతులు నష్టాల పాలయ్యారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రొయ్య సాగును ఆదుకోవాలని కోరారు. సమావేశంలో పలువురు ఆక్వా రైతులు తమ కష్టనష్టాలను మొరపెట్టుకున్నారు. పులిమీద పుట్రలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెచ్చిన కొత్త సుంకం ఆక్వా రంగాన్ని మరింత కుదేలు చేసింది. ట్రంప్‌ ప్రకటన వెలువడి క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రొయ్య ధరలు అమాంతం పతనమైపోయాయి. అసలు అమెరికాకు 30 కౌంట్‌ లోపు ఉన్న రొయ్యలో ఎగుమతి అవుతాయని, ఇక్కడి వ్యాపారులు 100 కౌంట్‌ రొయ్య ధరను ఒక్కసారిగా రూ.30 నుంచి రూ.40 తగ్గించి వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆక్వా రైతులను ఆదుకోకపోతే సాగు కొనసాగించలేమని ముక్త కంఠంతో చెప్పారు. సమావేశంలో పలువురు రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం రైతులు నినాదాలు చేస్తూ గణపవరం సెంటర్‌లోని మూడు రోడ్ల కూడలిలో కొంతసేపు ఆందోళన నిర్వహించి రొయ్య రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ గణపవరం ప్రధాన రోడ్డు మీద ప్రదర్శన చేశారు.

ఎన్నడూ చూడని సంక్షోభం

మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని సంక్షోభాన్ని ప్రస్తుతం రొయ్య సాగుదారులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మేతల ధరలు పెరిగిపోయి సాగు భారంగా మారిన పరిస్థితులలో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి రొయ్య ధర అమాంతం తగ్గించి వేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రొయ్య రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిందే.

రుద్రరాజు యువరాజు, ఆక్వా రైతు సంఘం, రాష్ట్ర కమిటీ సభ్యుడు

కిలోకు రూ.40 తగ్గించారు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాల వంకతో ఇక్కడి వ్యాపారులు రొయ్య ధర కిలోకు అమాంతం రూ.40 వరకూ తగ్గించి వేశారు. ఈ ధరకు అమ్ముకుంటే రైతులు కోలుకోలేని విధంగా నష్టాల పాలవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా సాగుపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆక్వా సాగు సంక్షోభం నుంచి బయట పడే పరిస్థితులు లేవు.

కాకర్ల వినాయకం, ఆక్వా రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి

రెండెకరాలు అమ్ముకున్నాను

ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పదెకరాల నిబంధన తీసివేసి రైతులందరికి విద్యుత్‌ యూనిట్‌ రూ.1.50కు ఇవ్వాలి. నేను 40 ఎకరాల్లో రొయ్య సాగు చేసి అప్పులు తీర్చడానికి సొంత పొలం రెండెకరాలు ఇటీవల అమ్ముకున్నాను. విద్యుత్‌ సబ్సిడీ లేక బిల్లును లక్షల్లో కడుతున్నారు. ప్రస్తుతం 30 ఎకరాలు వదిలేసి పదెకరాలలో రొయ్య సాగు కొనసాగిస్తున్నాను.

–ఆదిమూలం శ్రీనివాస్‌, ఆక్వా రైతు, వాకపల్లి

ప్రభుత్వ నియంత్రణ ఉండాలి

ట్రంప్‌ అనాలోచిత నిర్ణయం వల్ల ఆక్వా రైతులు రోడ్డున పడే దుస్థితి దాపురించింది. వ్యాపారుల మాయాజాలం వల్ల వారం రోజుల్లోనే రొయ్యల అమ్మకంలో నాలుగు లక్షల నష్టం వచ్చింది. వారం క్రితం అమ్మిన ధరకూ నాలుగు రోజుల అనంతరం అమ్మిన ధరకూ కిలోకు రూ.50 తగ్గిపోవడంవల్ల నాలుగు లక్షలు నష్టపోయాను.

–గరిపాటి సాయిరాం , ఆక్వారైతు, చానమిల్లి

నష్టాల ఊబిలో కూరుకుపోయాం: రొయ్య రైతుల ఆవేదన

ఆక్వాను ఆదుకోండి! 1
1/4

ఆక్వాను ఆదుకోండి!

ఆక్వాను ఆదుకోండి! 2
2/4

ఆక్వాను ఆదుకోండి!

ఆక్వాను ఆదుకోండి! 3
3/4

ఆక్వాను ఆదుకోండి!

ఆక్వాను ఆదుకోండి! 4
4/4

ఆక్వాను ఆదుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement