Amarnath Vasireddy Talk About On Food Habits And Healthy Lifestyle - Sakshi
Sakshi News home page

Amarnath Vasireddy: కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో!

Published Tue, Aug 9 2022 3:29 PM | Last Updated on Tue, Aug 9 2022 6:15 PM

Amarnath Vasireddy On Food Habits And Healthy Lifestyle - Sakshi

"ఇది తిను.. అది తినొద్దు.. అంటూ ఒకటే సోది. మన తాతముత్తాతలు హాయిగా అన్నీ తిన్నారు. ఇప్పుడే పనిలేని వాళ్లు అది తొనొద్దు... ఇది తినొద్దు...  అంటూ ప్రచారం చేస్తున్నారు. హాయిగా అన్నీ తినండి "....  ఇదీ....  వాట్సాప్ లో ఆహార ప్రియులు ఫార్వర్డ్ చేసుకొని తుత్తి పొందే మెసేజ్ !  

ఎంతమంది తాతలేంటి ?
మనిషి పుట్టింది నలభై లక్షల సంవత్సరాల క్రితం. అంటే మనకందరికీ ఒక కోటి ఇరవై లక్షల మంది తాతలున్నారు. వారి జీవన విధానం మనల్ని ప్రభావితం చేస్తుంది. మనకు ఇష్టమున్నా , లేకున్నా తప్పదు.. తప్పించుకోలేము. అదే సూక్ష్మ పరిణామక్రమం ! అదే సైన్స్ !

1. కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే!
మనిషి నాగరికుడయ్యింది అయిదు వేల సంవత్సరాల క్రితం మాత్రమే. నలబై లక్షల్లో అయిదువేల సంవత్సరాలంటే ఎంత ? ఒక శాతం కూడా కాదు. ఒక శాతంలో పదోవంతు. అంటే సముద్రంలో నీటి బొట్టు.

అంటే మనిషి తన మనుగడలో తొంబై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సమయం వేట - ఆహార సేకరణ లో గడిపేశాడు . అంటే పొద్దునే లేస్తే మగాళ్లు వేట. మహిళలు ఇంటిపని, పిల్లల సంరక్షణ, ఆహార సేకరణ. పగటి పూట కూర్చోవడం  అరుదుగానే .ఏదో బాగా అలిసినప్పుడు కాసేపు రాత్రి పూట పడుకోవడం  మానవ శరీరం అందుకు తగ్గట్టుగానే తయారయ్యింది. నడుస్తూ, పరుగెత్తుతూ,  ఎక్కుతూ,  దిగుతూ మన తాతలు పగలు గడిపేశారు  ....

ఇప్పుడేమో తీరిక. ఆఫీస్  పని ఉన్నా కూర్చొని చేయడమే . ఇక ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రొం హోమ్. ఇంటినుంచి బయటకు వెళ్ళేపని లేదు. సోఫాలో, కుర్చీలో,  మంచం లో అరుగు పైన గంటలు గంటలు కూర్చోవడమే. అదిగో అక్కడే సమస్య వచ్చింది .

మన పూర్వీకులు మనకు సాధించి పెట్టింది.. తిరగడానికి అనువైన శరీరం. మనం .. లేదా మన తండ్రులు.. అంటే లింగులిటుకు అంటూ రెండు తరాలు మాత్రం .. కూర్చోవడం.. అదీ  కాసేపు కాదు.. గంటలు గంటలు!  

మన బాడీ అందుకు తగ్గట్టు లేదు.. అందుకే.. బిపి.. షుగర్.. వెన్ను నొప్పి.. మోకాలు నొప్పి.. ఊబ కాయం.. హృద్రోగం .. అబ్బో ఒకటా రెండా ? సమస్యలే సమస్యలు ..

సరే గుప్పెడు మాత్రలు ఉన్నాయి. ..... వేసుకొంటే పరిస్థితి  రోజురోజుకు దిగజారుతుంది . వేసుకోకపోతే ఇంకో సమస్య . మరి పరిష్కారం ? కనీసం రోజుకు గంట నడక .. శరీరం అలసి పోయేలా శారీరిక శ్రమ. నడక ఎంత అవసరమో ఇరవై నాలుగు గంటలు ఎకానమీ క్లాసులో తన సీట్ లో కూర్చొని ఇండియా నుంచి అమెరికా విమానాశ్రయం లో  అప్పుడే దిగిన ప్రయాణికుడిని అడుగు చెబుతాడు .

2. ఒంటరి తనమంటే  మానసిక అనారోగ్యానికి దగ్గరి దారి :
మనిషి సంఘ జీవి . మన పూర్వీకులు వేట ఆహార  సేకరణ దశలో జట్లుగా సమిష్టి  జీవనం గడిపారు . జట్టు అంటే ఆంగ్లం లో బ్యాండ్ . ఒక్కో జట్టు లో సుమారుగా  ముప్పై నలబై మంది ఉండేవారు . ఒక విధంగా చెప్పాలంటే జట్టు ఉమ్మడి కుటుబంకన్నా పెద్దది.

జట్టులోని సభ్యుల మధ్య సహకారం.. సమన్వయం.. శ్రమ విభజన.. పరస్పరత  ఉండేది . మనిషి నాగరీకుడు  అయ్యి వ్యవసాయం వచ్చాక ఉమ్మడి కుటుంబాలొచ్చాయి.

భార్య భర్త పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని కేంద్రక కుటుంబం అంటారు . ఇది కేవలం చివరి రెండు తరాలు మాత్రమే . కేంద్రక కుటుంబాలే మానవ మనుగడకు ముఖ్యంగా పిల్లల పెంపుదలకు అనుకూలం కాదు అనుకొంటుంటే ఇప్పుడు సరి కొత్త కుటుంబాలు . తల్లి లాప్ టాప్ లో లేదా టీవీ ముందు .. తండ్రి సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ముందు . పిల్లలల  తో మాటాడే సమయం ఉండదు . వారి చేతిలో సెల్ ఫోన్ . అక్కడే అన్ని అరిష్టాలు మొదలు .

అంతేనా ? మనిషి ఒంటరిగా  గడిపింది ఎప్పుడు ? ఇప్పుడేమో ఎదిగిన పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో .. కనీసం ఆఫీస్ లాంటి వాటికి పోయినా అదో రకం .. వర్క్ ఫ్రొం హోమ్ .. రిటైర్మెంట్ తరువాత జీవనం .. . మనిషి ఒంటరి  వాడయ్యాడు . పక్కన ఎవరైనా ఉన్నా మాట్లాడరు.

చేతిలో సెల్ ఫోన్ ." ఖాళీ బుర్ర .. దెయ్యాల కొంప "అనే ఆంగ్ల సామెత ఉండనే వుంది . ప్రతి ఇంట్లో ఒక సైకో తయారవుతున్నాడంటే తప్పు .. మన  తాతలదే . కానీ అదే మన ancestry. తప్పదు.. అదే నీ పరిణామ క్రమం.. అదే నీ బతుకు.. మారాలంటే కనీసం లక్ష సంవత్సరాలు కావాలి . 

3. అన్నం ఎక్కువ  తింటే సున్నం దక్కదు సుమీ..
మనిషి తన మనుగడ లో తొంబై తొమ్మిది శాతం సమయం మాంసం , దుంపలు , కాయలు  పళ్ళు తిని బతికేసాడు .  ఈ నాటి బాష లో చెప్పాలంటే మీట్.. సలాడ్స్ .  నవీన శిలా యుగం లో అక్కడక్కడా బార్లీ లాంటి పంటలు .

గోధుమ,  వరి లాంటి ధాన్యాలు పండించింది కేవలం అయిదు వేల సంవత్సరాల క్రితం . దానికే మన బాడీ గా రెడీ గా లేదు . అది చాలదన్నట్టు ఇదిగో గత నలబై యాభై సంవత్సరాల్లో కొత్త వంగడాలు.. రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు  ..  

పీచు సున్నా .. పిండి పదార్థాలు తప్పించి మిగతా పోషకాలు సున్నా .. అదే తెల్లనం .. ఉత్తరాది వారు మరీ దారుణం .. రసాయనాలు కలిసిన మైదా కలుపుకొని గోధుమ పిండి రొట్టెలు .. పుల్కాలు . సకల సమస్త రోగాలకు ఇవే  కారణం . 

ఇది చాలదన్నట్టు  ఆధునిక ప్రపంచంలో  ప్రొసెస్డ్ ఫుడ్స్.. ట్రాన్స్ ఫ్యాట్స్ .. జంక్ ఫుడ్ .. అబ్బో .. రోగాలు మూడు రోగాలు ...  ముప్పై ఆసుపత్రులు .

ఈ మెసేజ్ ఇక్కడి దాక చదివిన వారికి రెండు మార్గాలున్నాయి .
1."అంటే ఏంటట ? మన తాతముత్తాతలు ఆకులూ అలుములు కట్టుకొని,  గుహల్లో అడవుల్లో బతికారు కాబట్టి మనం కూడా బట్టలిప్పేసి అకులు కట్టుకొని అడవిలోకి  వెళ్లిపోవాలా?"  అని జోక్ చేసి .. మీ జోక్ కు మీరే కిచ కిచ అని నవ్వేసుకొని  హ్యాపీ గా బతికెయ్యడం .. అల్ ది బెస్ట్ .

లేదా ..
►రోజుకు ఒక గంట నడక
►పిల్లాపాపలతో సమయం గడపడం
►స్నేహితులు బంధువులు తో తరచూ కలుస్తూ సమయం గడపడం
►ఆఫీస్ లాంటి  చోట్ల అందరితో కలివిడిగా మాట్లాడడం
►తెల్లన్నం బాగా తగ్గించి మైదా పుల్కాలు పూర్తిగా మానేసి  ఆకుకూరలు కాయగూరలు , పళ్ళు లాంటివి ఎక్కువ తినడం .

మనం ఎంచుకొన్న దారే మన భవిత  
రాదారా ?
గోదారా?
ఏది  మీ దారి ??


- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement