Onion skin: ఉల్లిపాయ పొట్టుతో ఇలా ఎపుడైనా ట్రై చేశారా? | Amazing and Surprising Health And Other Benefits Of Onion skin | Sakshi
Sakshi News home page

ఉల్లిపాయ పొట్టుతో ఇలా ఎపుడైనా ట్రై చేశారా?

Published Wed, Jan 24 2024 10:32 AM | Last Updated on Wed, Jan 24 2024 10:47 AM

Amazing and Surprising Health And Other Benefits Of Onion skin - Sakshi

సాధారణంగా వంటల్లో ఉల్లిపాయలను అందరమూ వాడుతుంటాం. కొంతమంది వాసన పడక, మరికొంతమంది ఉపవాసాల సమయంలోనూ  ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. అయితే  ఉల్లిపాయలు మాత్రమేకాదు ఉల్లిపాయ తొక్కలు లేదా పొట్టు వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలున్నాయి.  ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు ఉల్లిపాయ తొక్కల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి.

ఉల్లిపాయల్లో యాంటీ బయోటిక్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు ఉండి వీటిని తినడం ద్వారా ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా మనల్ని కాపాడుతాయి. వీటిలో సల్ఫర్‌, ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌ బీ, సీ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్‌, సోడియం చాలా తక్కువగా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి.  క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలను ఉల్లిపాయ తొక్కల్లో ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఉల్లి తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.  ఇవి చర్మం, జుట్టుకు మేలు చేకూరుస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి. అంతేకాదు ఉల్లి పొట్టు మంచి కంపోస్ట్‌గా  ఉపయోపడుతుంది. టీ, హెయిర్ డై, టోనర్‌గా, ఫ్లేవర్ ఏజెంట్‌గా, కంపోస్ట్‌గా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు

టీ
ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందట వీటిని నీటిలో 10 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టి వడపోసి తరువాత ఈ టీని తాగొచ్చు. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మసాలా 
ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా శుభ్రంగా కడిగి రెండు సార్లు కడగాలి. వీటిని ఎండలో ఆరబెట్టి పొడిచేయాలి. ఆరునెలలపాటు నిల్వ ఉండే ఈ  పొడి మసాలాలో కలుపుకుని కూరల్లో వేసుకుంటే..కూర మంచి రుచిగా ఉంటుంది.

రుచి, సువాసన
స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ తొక్కలను జోడించడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు.

చర్మం రోగాలకు
ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు.

హెయిర్‌ డై
సల్ఫర్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగు మార్చుకోవచ్చు. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా బూడిద జుట్టును బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. అలాగే, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలింత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా నూరాలి. దీనికి కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలపాలి. ఇలా చేసుకున్న జెల్‌ను నేరుగా హెయిర్ డైలా అప్లై చేసి గ్రే హెయిర్‌ను కవర్ చేసుకోవచ్చు.

మంచి నిద్రకు
ఉల్లిపాయ తొక్కలలో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

హెయిర్ టోనర్
పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి.

మంచి కంపోస్ట్‌గా
మిద్దె తోటల్లో,  బాల్కనీ గార్డెన్‌  ఉల్లి తొక్కల కంపోస్ట్‌ బాగా ఉపయోపడుతుంది. మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. గులాబీ, మల్లి లాంటి ఇతర పూల మొక్కలకు ఈ కంపోస్ట్  మంచి టానిక్‌లా ఉపయోపడుతుంది.  ఉల్లిపాయ తొక్కల్లో మొక్కలకు బలాన్నిచ్చే  ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది.

సహజరంగుగా 
ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆ రంగును సహజ రంగులుగా వాడతారు. ఉల్లి రకాన్ని బట్టి బంగారు-పసుపు , డార్క్‌ ఆరెంజ్‌ రంగు వస్తుంది. హస్తకళాకారులు, చేతివృత్తులవారు ఈ సహజ రంగును వివిధ ఫాబ్రిక్ ,పేపర్ కోసం ఉపయోగిస్తారు.

జాగ్రత్త: ఉల్లిపాయ తొక్కను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తులలో అలెర్జీ   రావచ్చు. అలాగే  కొన్ని   రకాల ఉల్లిపాయలపై అప్పుడప్పుడు నల్లటి ఫంగస్‌ లాంటిది ఉంటుంది.   సో శుభ్రమైన హెల్దీగా ఉన్నవాటిని తీసుకొని, నీటిలో బాగా కడిగి వాడుకోవడం ఉత్తమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement