ఆస్తిపాస్తులు కనీసం పదివేల కోట్లు ఉన్నవారు.. విడాకుల కోసం వెళ్లాలంటే వందనా షాను కలుస్తారు. దేశంలో హైప్రోఫైల్ డివోర్స్ కేసులు చూసే మహిళా లాయర్‌గా వందనా షా పేరు గడించారు. ఏ.ఆర్.రెహమాన్, సాయిరా బానుల విడాకులతో ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘విడాకులు ఇప్పించడం మీకు సంతోషమా?’ అనడిగితే ‘నేను స్వేచ్ఛను ఇప్పిస్తున్నాను’ అంటారామె. స్వయంగా డివోర్సీ అయిన వందనా ఆ తర్వాతే లా ప్రాక్టీసు మొదలెట్టారు. వందన పరిచయం, రెహమాన్ విడాకుల పూర్వాపరాలు...
1995లో ఏ.ఆర్. రెహమాన్ పెళ్లయ్యింది. అదే సంవత్సరం అతను సంగీతం చేసిన ‘బొంబాయి’ విడుదలైంది. ‘బొంబాయి’లో హీరోయిన్ పేరు సాయిరా బాను. రెహమాన్ జీవిత భాగస్వామి పేరు కూడా అదే. వచ్చే సంవత్సరం ‘బొంబాయి’ సినిమా, రెహమాన్ వైవాహిక జీవితం 30 ఏళ్ల ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రమే జరుగుతుంది. ఒకటి జరగదు. సంగీత మాంత్రికుడి జీవితంలో అపశ్రుతి వస్తుందని ఎవరూ ఊహించలేదు. వీరి విడాకుల వ్యవహారాన్ని అడ్వకేట్ వందనా షా చూశారు. అధికారికంగా ఆమే ప్రకటించారు.
గుజరాత్ మూలాలు
1973లో జన్మించిన సాయిరా బాను మూలాలు కచ్‌లో ఉన్నాయి. వారిది గుజరాతి ముస్లిం కుటుంబం. మదురైలో స్థిరపడ్డ ఈ కుటుంబం నుంచి ఒక కుమార్తెను మలయాళ నటుడు రెహమాన్ (రఘు) వివాహం చేసుకుంటే మరో అమ్మాయిని ఏ.ఆర్.రెహమాన్ చేసుకున్నాడు.
పెళ్లయ్యాక సాయిరా బాను రెహమాన్‌కు పేరు వచ్చేకొద్దీ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి మిత్రురాలైందని అంటారు. సాయిరా, నీతా మధ్య మంచి స్నేహం ఉందని కథనం. ఇటీవల అంబానీ కుమారుడి పెళ్లిలో రెహమాన్ ప్రత్యేకమైన షో కూడా ఇచ్చాడు. ఇప్పుడు విడాకుల కేసును చూసిన వందనా షా కూడా గుజరాత్‌కు చెందిన అడ్వకేటే. అయితే ఆమె ప్రాక్టీసు ముంబై, పూణెలలో ఉంది.
తల్లి తెచ్చిన కోడలు
రెహమాన్ తల్లి నిర్ణయానికి ఎంతో విలువనిచ్చేవాడు. ‘నాకు సమయం లేదు. నేను పెళ్లిచూపులకు తిరగలేను. చదువుకుని, సంగీతం అంటే ఇష్టపడుతూ, వినమ్రతతో ఉండే అమ్మాయిని చూడు’ అని మాత్రమే తల్లిని అతడు కోరాడు. తల్లే ఈ సంబంధం తెచ్చింది. పెళ్లయ్యాక రెహమాన్, సాయిరా పరస్పరం ఎంతో గౌరవించుకునేవారు. ‘నేను అతని స్వరానికి ఫ్యాన్‌ని’ అని సాయిరా రెహమాన్ గురించి వేదికమీద చెప్పింది.
రెహమాన్ కూడా ఆమెను వెంటబెట్టుకునే సంగీత యాత్రలు చేసేవాడు. వీరికి ముగ్గురు పిల్లలు. రెహమాన్ రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియాలో, అబూదాబీలో లైవ్ షోలు చేశాడు. అతని ఫేస్‌బుక్ పేజ్‌లో ఇంకా భార్యతో ఉన్న ఫోటోనే కవర్ ఫొటోగా ఉంది. వందనా షాకు పరస్పర ఆమోదయోగ్యంగా విడుపెయేలా కేసులను గట్టెక్కిస్తుందనే పేరు ఉంది. అందుకే రెహమాన్‌గానీ, సాయిరాగాని మీడియాకు ఎక్కలేదు. వారిద్దరి నడుమా ఎంతో ప్రేమ ఉన్నా వెనక్కు రాలేనంతగా అగాథాలు ఏర్పడటమే’ విడాకులకు కారణం అంటారు వందనా షా.
శ్రీమంతుల విడాకులు
వందనా షా శ్రీమంతుల విడాకుల ఎక్స్‌పర్ట్. ‘ఆమె విడాకులు ఎక్కువగా ఇప్పిస్తోంది. పెళ్ళిళ్లకు పిలవకండి’ అనేవారూ ఉన్నారు. కాని పాలిహిల్స్ (ముంబై)లో ఉండే జంటల విడాకుల కారణాలు అనూహ్యంగా ఉంటాయని అంటారు వందనా షా. ‘బోర్‌డమ్’, ‘బిగ్గర్ బెటర్ డీల్’ వల్ల విడి΄ోయే జంటలు ఎక్కువ అని ఆమె అంటారు. శ్రీమంతుల ఇళ్లలో భార్యాభర్తల మధ్య డబ్బు పంపకం, పిల్లల బాధ్యత ఇవే ప్రధాన సమస్యలనీ, ‘ఇగో’, ‘వివాహేతర సంబంధాలు’ తర్వాతి స్థానం అని అంటారామె.
‘బాగా డబ్బున్న వారు పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ విడిపోతే ఎవరికి ఎంత, పిల్లలకు ఎంత.. ఇవి మాట్లాడుకుంటే అసలు వైవాహిక జీవితంలో గొడవలే రావు’ అంటుందామె. ఇక మధ్యతరగతి విడాకులలో ‘పిల్లలు ఎదిగొచ్చిన స్త్రీకి ఇక తానేమిటి, తన ఉనికి ఏమిటి అనే సమస్య మొదలయ్యి తన జీవితానికి ప్రాధాన్యత లేదా అనే అసంతృప్తి నుంచి విడాకులు అవుతాయి’ అని తెలిపింది వందనా షా.
‘పరస్పరం హింసించుకునే పెళ్లి కంటే విడాకులే నయం’ అంటుందామె. అయితే పెళ్లితో బాధలు పడుతున్న పురుషుల గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. ‘బాగా సంపాదించే భార్య తన భర్తను ఇంటిపట్టున ఉండమని కోరడం, అతనిపై ఆధిపత్యం చెలాయించడం చూస్తున్నాం. మగాళ్లు హౌస్ హజ్బెండ్‌లుగా ఉండటాన్ని ఇష్టపడుతున్నా ఆధిపత్యం, అవమానం భరించలేక విడాకులు కోరుతున్నారు’ అని తెలిపిందామె. మధ్యతరగతి ఇళ్లలో తల్లిని, భార్యను ఎదురుబొదురు కూచోబెట్టి వారి సమస్యను నేరుగా పరిష్కరించక తప్పించుకు తిరిగే మగవాడు అంతిమంగా విడాకుల దగ్గర తేలుతాడని కూడా ఆమె హెచ్చరిస్తోంది. బహుపరాక్.
(చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?! )
Comments
Please login to add a commentAdd a comment