కొంతమంది ఆకలితో అలమటిస్తుంటే, మరోపక్క టన్నులకొద్దీ ఆహారం వివిధ రకాలుగా వ్యర్థాల రూపంలో మట్టిపాలవుతోంది. ఈ మధ్య కాస్త అవగాహన రావడంతో ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని ఆశ్రమాలకు దానంగా ఇస్తున్నారు. అయితే వండిన ఆహారమే కాకుండా, కొన్నిరకాల పదార్థాలు, పానీయాలు తయారయ్యాక ఎన్నో పోషకాలున్న పదార్థాలు చెత్తలోకి వెళ్లి పోతున్నాయి. వీటిని మనం చక్కగా వినియోగించుకుంటే...బిస్కెట్లు, బ్రెడ్, రోటీలు చేసుకోవచ్చని చెబుతోంది ఎలిజబెత్ యార్క్. బీర్ తయారవగా మిగిలి పోయిన వ్యర్థాలతో చిక్కి, లడ్డు, నూడుల్స్ తయారు చేసి మరీ రుచి చూపెడుతోంది ఎలిజబెత్.
బెంగళూరుకు చెందిన ఎలిజబెత్ యార్క్ ఒక చెఫ్. మణిపాల్‌లో డిగ్రీ చేసిన ఎలిజబెత్ తరువాత మైసూర్‌లోని సెంట్రల్‌ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ చేసింది. అందులో భాగంగా దేశంలో ఎన్నో రకాలుగా భారీ ఎత్తున ఆహార వృథా జరుగుతోందని గ్రహించింది. ఆహారం వ్యర్థం కాకుండా ఎలా ఆపాలా... అని ఆలోచించింది. ఈ క్రమంలోనే 2016లో కాలిఫోర్నియాలోని బ్రెడ్ స్పెషలిస్ట్, ఫుడ్ హిస్టోరియన్ విలియం రెబెల్ దగ్గర ఇంటర్న్‌గా చేరింది.
రుబెల్ ద్వారా... ‘‘వందల ఏళ్ల నాడే పానీయాల తయారీ దారు, (బ్రీవర్స్), రొట్టె, బ్రెడ్స్ తయారీదార్లు (బేకర్స్) కలిసి పనిచేసే వారని తెలిసింది. కొన్నిసార్లు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగిలిపోయిన బ్రెడ్‌ను బ్రీవర్స్, గింజలు, ఈస్ట్‌ను బ్రీవర్స్ బేకర్స్ ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. అలా వాళ్లు పదార్థాలు వృథా కాకుండా, తక్కువ ఖర్చులో ఆహారాన్ని తయారు చేసేవారు’’ అని ఎలిజబెత్ తెలుసుకుంది. భారత్‌లో కూడా ఇలా చేసి ఫుడ్ వేస్ట్ కాకుండా చూడవచ్చు అనుకుంది.
సేవింగ్ గ్రెయిన్స్
లాక్‌డౌన్ సమయంలో కాస్త ఎక్కువ సమయం దొరకడంతో ఎలిజబెత్ వ్యర్థాల నుంచి ఫుడ్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. బీర్ తయారైన తరువాత పడేసే వ్యర్థాలను రుచికరమైన ఆహారంగా మార్చాలనుకుని 2021లో ‘సేవింగ్∙గ్రెయిన్స్’ ప్రారంభించింది. బీర్ తయారవగా మిగిలిన పిప్పిని పిండిగా మార్చి, తరువాత ఆ పిండితో బ్రెడ్, రోటీలు, గ్రనోలా, కుకీస్, టీ బిస్కెట్స్, లడ్డులు, చిక్కీలు తయారు చేసి విక్రయిస్తోంది. పిప్పినుంచి తయారు చేసినవే అయినా ఇవి ఎంతో రుచిగా ఉండడం విశేషం. సేవింగ్ గ్రెయిన్స్ ఉత్పత్తులు ఆఫ్‌లైన్‌లోనేగాక, ఆన్‌లైన్‌లోకూడా లభ్యమవుతున్నాయి. స్థానిక బేకరీ భాగస్వామ్యంతో సేవింగ్ గ్రెయిన్స్‌ను విస్తరిస్తోంది ఎలిజబెత్.
రోజుకి పన్నెండు వేల కేజీలు..
‘‘రకరకాలుగా ఫుడ్ వేస్ట్ అవడం చాలా బాధగా అనిపించేది. రుబెల్‌ను కలిసాక ఈ సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది. దాంతోనే ‘సేవింగ్ గ్రెయిన్స్’ను ప్రారంభించాను. బీర్, ఆల్కహాల్‌ను తయారు చేసేందుకు గోధుమలు, ఓట్స్, బార్లీలను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత, చక్కెరతో ఉడికి స్తారు. తరువాత మెత్తగా రుబ్బి రసాన్ని వేరు చేసి బీర్, ఆల్కహాల్స్‌ను తయారు చేస్తారు. పానీయం వేరు చెయ్యగా మిగిలిన పిప్పిని పశువులకు దాణాగా వేస్తుంటారు.
పశువులు తిన్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో వ్యర్థంగా పోతుంది. ఒక్క బెంగళూరులోనే రోజుకి పన్నెండు వేలకేజీల ధాన్యాలను పానీయాల తయారీలో వాడుతున్నారు. రోజుకి ఇంత అంటే ఇక ఏడాదికి చాలా ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రీవరీలు లక్షల కేజీల ధాన్యాలను ఉపయోగిస్తున్నాయి. ఇలా ఉత్పన్నమయ్యే పిప్పిని ఫుడ్‌గా మార్చడం వల్ల ధాన్యాలు వ్యర్థంగా పోవు. సేవింగ్ గ్రెయిన్స్ ద్వారా ఎంతోమంది ఆకలి కూడా తీర్చవచ్చు’’ అని ఎలిజబెత్ చెబుతోంది.
(చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బి)
Comments
Please login to add a commentAdd a comment