వీధి బాలలతో మనోరమ
పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో టీచర్లదే ప్రముఖ పాత్ర. అయితే, తరగతిలో ఉన్న విద్యార్థుల్నే కాదు.. వీధుల్లో చిల్లర డబ్బులు అడుగుతూ (యాచిస్తూ) తిరుగుతున్న వీధి బాలలను కూడా బడిలో చేర్పించి, తానే స్వయంగా పాఠాలు బోధిస్తూ... వారి జీవితాలనే మార్చేస్తున్నారు మనోరమ టీచర్. ఆసరాలేని పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తూ వారిని చేరదీసి, ఆశ్రయమివ్వడమే కాకుండా విద్యాబుద్ధులు సైతం నేర్పించి భవిష్యత్‌ను బంగారు మయం చేస్తుండడంతో మనోరమను అంతా మమ్మీజీ అని పిలుస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ పరివాహక జిల్లా బల్లియాలో పుట్టింది మనోరమ. చిన్నప్పటినుంచి ఆడుతూ పాడుతూ రోజూ గుడికి వెళ్తుండేది. గుళ్లో వచ్చే సాంబ్రాణీ, పూల పరిమళాలను ఆస్వాదిస్తోన్న మనోరమకు.. గుడినుండి బయటకు వచ్చేటప్పుడు మాసిన, చిరిగిపోయిన దుస్తులు ధరించి దీనంగా యాచించే పిల్లలు కనిపించేవారు. వాళ్లు కొన్నిసార్లు మనోరమ దగ్గరకు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగేవారు. చిన్న లడ్డు ముక్క ఇస్తే వాళ్ల సమస్య తీరిపోతుందా? అనిపించేది తనకు. కానీ ఏం చేయాలో అప్పట్లో అర్థం కాలేదు. వాళ్లకెలా సాయం చేయాలి? అన్న ఆలోచనలతోనే ఇంటర్ కాగానే బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసి, తర్వాత పూర్వాంచల్ యూనివర్శిటీలో బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సంపాదించింది.
పాఠాలతోపాటు..
పోస్టింగ్ డెహ్రాడూన్‌లో రావడంతో అక్కడ టీచర్‌గా పనిచేస్తూనే, ఆల్ ఇండియా రేడియోలో అంధ విద్యార్థులకు కథల పుస్తకాలను చదివి వినిపించేది. కథల విన్న విద్యార్థుల వ్యక్తం చేసే సంతోషం ఆమెకు చాలా సంతృప్తినిచ్చేది. ఇంతలోనే మనోరమకు పెళ్లి అవడం, భర్త లక్నోలో ఉండడంతో తను కూడా లక్నో వెళ్లింది. లక్నోలో కూడా గుడికి వెళ్లినప్పుడు యాచించే పిల్లలు కనిపించేవారు. చిన్నప్పటినుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న మనోరమ... యాచించే పిల్లల వద్దకు వెళ్లి ఇలా ‘అడుక్కోవడం తప్పు, మీరు ఈ వయసులో ఇటువంటి పనులు చేయకూడదు. చదువుకోవాలి’ అని హితవు చెప్పేది. ఆమె మాటలు వినడానికి పిల్లలు గుంపుగా పోగయ్యేవారు.
అప్పుడు ఆ పిల్లలకు స్నానాలు చేయించి, కొత్తబట్టలు తొడిగి, తలకు నూనె రాసి, దువ్వి వాళ్లను అద్దంలో చూపిస్తూ ‘చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో’... అడుక్కోవడం అంటే దేవుడిని కించపరచడంతో సమానమని చెప్పి, అడుక్కోవద్దని వారించేవారు. ఈ మాటలు విన్న పిల్లలు, కొంతమంది తల్దిండ్రులు నిజమే కదా! అని అర్థం చేసుకుని తమ పిల్లలను స్కూళ్లలో చేర్చి చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. మనోరమ పనిచేసే స్కూలు, ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించి, వారి పిల్లల యాచకత్వాన్ని మాన్పించారు.
దత్తత సెంటర్..
మనోరమ ప్రారంభంలో డెభ్బై మంది దాకా పిల్లలను స్కూళ్లలో చేర్పించింది. రోజురోజుకి నిరాశ్రయ యాచక పిల్లల సంఖ్య పెరగడం, వాళ్లను ఆదరించే వారు లేకపోవడం వంటి కన్నీటి గాథలకు చలించి పోయిన మనోరమ వారికోసం దత్తత కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. 2004లో ‘జమి అప్ని ఆస్మా మేరా’ పేరుతో దత్తత కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్‌లో ఇల్లువాకిలి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, నా అనేవారు లేని వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది. ఎవరైనా ఈ సెంటర్‌లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే వారికి దత్తత ఇస్తుంది. అలా ఇప్పటిదాకా పదకొండు వందలమంది పిల్లలను యాచన నుంచి మాన్పించగలిగింది.
వీరిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది క్యాటరింగ్, డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు బీఏ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలైతే బ్యూటీపార్లర్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ వర్క్ లు నేర్చుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మనోరమ భర్త కూడా తనకి అన్ని పను ల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేయడం వల్ల ఆమె ఇంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగారు. లక్నోలో యాచకత్వం చేసే పిల్లల సంఖ్య కూడా తగ్గింది. నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లల్ని చేరదీసి బడికి పంపిస్తూ, భవిష్యత్‌ను మారుస్తున్న మనోరమను అంతా ‘మమ్మీజీ’ అని పిలుస్తున్నారు.
అవార్డులు..
టీచర్‌గా పాఠాలు చెప్పి సరిపెట్టుకోకుండా స్కూలు బయట ఉన్న పిల్లల్ని స్కూలుకు వచ్చేలా చేసి వారి జీవితాలనే తీర్చిదిద్దిన మనోరమను గుర్తించిన హిందుస్థాన్ టైమ్స్ ‘ఉమెన్ ఎచీవర్స్ అవార్డుతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘గోమతి గౌరవ్ సమ్మాన్’ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది టీచర్‌గా రిటైర్ అయిన మనోరమ తన సమాజసేవను కొనసాగిస్తున్నారు.
భర్తతో మనోరమ
Comments
Please login to add a commentAdd a comment