గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరమన్న సంగతి అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా అన్నిపాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఎముకల ఎదుగుదలకి ఏం చేయాలో తెలుసుకుందాం....
తల్లిదండ్రులు.. పిల్లలు రోజుకు కనీసం 2 గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే మీ పిల్లల ఆహారంలో బచ్చలికూర, బెండకాయ, పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడాలి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అన్నింటికీ మించి నువ్వులలో క్యాల్షియం చాలా అధికమొత్తంలో ఉంటుంది కాబట్టి పిల్లలు రోజూ ఒక స్పూను నువ్వులు తినేలా చూస్తే చాలు...
తప్పకుండా ఉండాలండి
కాల్షియం శోషణ విటమిన్ డి సహాయపడుతుంది. దీనికే విటమిన్ డి 3 అని కూడా పేరు. మన దేశంలో విటమిన్ డికి ఎలాంటి కొదవ లేకున్నా.. చాలా మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్‌ను తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
►నవజాత శిశువులకు కూడా విటమిన్ డి అవసరం. అందుకోసం వారి ఒంటికి నువ్వుల నూనె రాసి, లేలేత సూర్యకిరణాలు తగిలేలా చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత మృదువుగా మర్దనా చేస్తూ స్నానం చేయించాలి.
ఈ విటమిన్లు కూడా
► శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయులు ఎక్కువగా ఉంటే విటమిన్ డి సమృద్ధిగా ఉన్నట్లే. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్యాబేజీ, ఆకుపచ్చ మొలకలు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ కె, మెగ్నీషియం ఉంటాయి.
శీతల పానీయాలు వద్దే వద్దు...
పిల్లలు ఎంత మారాం చేసినా వారిని శీతల పానీయాలు తాగనివ్వకూడదు. ఎప్పుడో ఒకసారి అయితే ఫరవాలేదు కానీ తరచూ ఇవి తాగడం పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది.
ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ డ్రింక్‌లను తాగించండి. దీనివల్ల పిల్లల ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment