మంచి మాట
ఉరుకులు పరుగులతో ఉరవడిగా వచ్చి తనని చేరిన నదిని సముద్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ‘‘నీ ప్రవాహ వేగానికి మహావృక్షాలు విరిగి పడిపోతూ ఉంటాయి. ప్రబ్బలి మొక్కలు అలాగే ఉంటాయి. వాటిని నువ్వు ఏమీ చేయవా?’’ అని. నది ఈవిధంగా సమాధానం చెపుతుంది. ‘‘ప్రబ్బలి మొక్కలు వేగంగా ప్రవాహం వస్తుంటే ఎదురు నిలవక తలవంచి ఉంటాయి. ప్రవాహ వేగం తగ్గగానే యథాప్రకారం తలెత్తుతాయి. మహావృక్షాలు తలవంచవు’’ అని!
నది చెప్పినది వృక్షాలకి సంబంధించినదే అయినా మనకి కూడా వర్తిస్తుంది. ఎగిరెగిరి పడినా, ఎదిరించి నిలిచినా, ఎదురొడ్డి నిలిచినా విరిగి పడటం జరుగుతుంది. పొగరు బోతు గొర్రె పొటేలు కొండని గెలవగలనని కుమ్మి తల చిట్లి నశించినట్టు అవుతుంది. తమకి శక్తి లేక పోయినా అహంకారంతో ఎదుటివారి శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేసి దెబ్బతింటూ ఉంటారు మహావృక్షాల వంటి వారు.
పైగా తమ నీడలో మరి ఏ మొక్కకి కూడా పెరిగే అవకాశం ఇవ్వరు. దానితో ఆపదలో ఆదుకునే వారు, తోడ్పడేవారు ఉండక కూలిపోక తప్పదు. తల ఎగరేసి, తల పొగరుతో ఉండక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలవంచటం, పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు తలెత్తటం చేస్తారు తెలివిగలవారు గడ్డిపోచల లాగా. పెరుగుతున్న మొక్కకి ఏదైనా అడ్డు వస్తే, కొన్ని పక్కకి వంగి వెలుగు వచ్చే దారి చూసుకుని ఎదుగుతాయి. నిటారుగా మాత్రమే ఎదుగుతాము, వంగము అనుకున్న మొక్కలు గిడసబారతాయి.
సముద్రంలో స్నానం చేయటానికి గాని, ఈత కొట్టటానికి గాని వెళ్ళేవారు అలకి అనుకూలంగా వెడతారు. అలతో పాటు లేచి పడతారు. అలకి వ్యతిరేక దిశగా ఈత కొడితే జరిగే అనర్థాలు అందరికీ తెలుసు. నదుల్లోనూ, కాలవల్లోనూ ఈతకి వెళ్ళేవారు ప్రవాహం ఎటువైపు ఉంటే అటే వెడతారు. వ్యతిరేక దిశలో వెడితే అది ఎదురీత. పడవలు కూడా ప్రవాహం వెళ్ళే దిశలో వేగంగా వెడతాయి. వ్యతిరేక దిశలో ప్రయాణం శ్రమతో కూడుకొని ఉంటుంది.
పరిస్థితులని గమనించకుండా ఉండే ఈ ప్రవర్తనకి మనిషిలో ఉండే అహంకారమే కారణం. నా అంతటి వారు లేరు అనే గుణం. నన్ను ఎదిరించగల వారు లేరు అనే పొగరు. ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తించలేని గుడ్డితనం. ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అదిరిపాటుకి అంతూ దరీ ఉండవు. దీనినే ‘మదం’ అని కూడా అంటారు. విరగబాటుతనం ఉంటే ప్రవాహానికి ఎదురొడ్డిన మహావృక్షాల లాగా విరిగి పడటం తప్పదు.
అంటే ఎప్పుడూ పరిస్థితులకి, అవతలి వారి ఇష్టానిష్టాలకి తల ఒగ్గి, వ్యక్తిత్వం అన్నది లేకుండా బతక వలసిందేనా? అన్న సందేహం రావటం సహజం. పరిస్థితులని మార్చగల శక్తిసామర్థ్యాలు ఉంటే మంచిదే. ఎప్పుడూ అట్లా ఉండటం అసంభవం. ప్రతికూలంగా ఉన్న సందర్భాలలో ఎట్లా ఉండాలి అన్నది కూడా తెలియాలి కదా! రోగాన్ని తగ్గించే అవకాశం లేకపోతే ఉపశమనం కలిగించాలి. అనుకూల వాతావరణం వచ్చేదాకా ఊరుకోవటం ఉత్తమం. ‘‘కొంచెముండు టెల్ల కొలది కాదు’’ అన్న వేమనని అనుసరించటం శ్రేయస్కరం.
ఎదురీత నదిలోనే కాదు ఎక్కడైనా శ్రమతో కూడుకున్నదే. జీవితమనే ప్రవాహంలో కదిలే మనిషి అనుకూలమైన దిశలో సాగితే ప్రయాణం సుకరంగా ఉంటుంది. వ్యతిరేక దిశలో వెళ్ళటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. జీవితం సంఘర్షణ అవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రవాహం ముందుకి తోస్తుంటే, తాను వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అంగుళం కూడా కదలక ఉన్న చోటనే నిలిచి పోవలసి రావచ్చు, నిలదొక్కుకోలేక కూలబడవచ్చు. అప్పుడు ప్రవాహంలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. వీలు, వాలు చూసుకోవాలని పెద్దలు చెప్పేది అందుకే!
Comments
Please login to add a commentAdd a comment