Bhuj Travel Guide In Telugu - Sakshi
Sakshi News home page

పడిలేచిన పట్టణం.. ఇక్కడికి వెళ్తే యూరప్‌ చూసినట్లే!

Published Sat, Nov 6 2021 11:55 AM | Last Updated on Sat, Nov 6 2021 3:15 PM

Bhuj Travel Guide In Telugu - Sakshi

భుజ్‌

భూకంపం... భవనాన్ని కూల్చగలుగుతుంది తప్ప... నిర్మాణ స్ఫూర్తిని కాదు. భుజ్‌ పట్టణంలో పర్యటించిన వాళ్లు ఈ మాటను ఒకటికి వందసార్లు గుర్తు చేసుకుంటారు. రెండు దశాబ్దాల నాటి భూకంపం గుర్తుకు వస్తే నాటి శిథిలాలు కళ్ల ముందు మెదులుతాయి. వెన్నులో వణుకు మొదలవుతుంది. ఇప్పుడు భుజ్‌ని చూస్తే... అప్పుడు చూసిన ఆ పట్టణం ఇదేనా! అని ఆశ్చర్యం కలుగుతుంది. 

గంటపై వీక్షణం!
భుజ్‌లో దిగి చుట్టూ చూస్తే మొదటగా దృష్టిని ఆకర్షించేది బెల్‌టవర్‌. ఆ టవర్‌తో కలగలిసి ఉన్న ప్రగ్‌ మహల్‌. బెల్‌ టవర్‌ మీద నుంచి భుజ్‌ పట్టణం మొత్తం కనిపిస్తుంది. ఈ మహల్‌ ఇండో– యూరోపియన్‌ నిర్మాణ శైలిలో ఉంటుంది. రెండవ ప్రగ్‌మాజీ నిర్మించిన ఈ మహల్‌కి యూరోప్‌ ఆర్కిటెక్ట్‌ కలొనెల్‌ హెన్రీ సెయింట క్లెయిర్‌ వికిన్స్‌ డిజైన్‌ చేశాడు. స్థానిక మిస్త్రీలు పనిచేశారు. ఈ మహల్‌లో అడుగుపెడితే కాళ్ల కింద ఇటాలియన్‌ మార్బుల్‌ నునుపుదనం, కళ్ల ముందు పాలరాతి గోడకు చెక్కిన జాలీ వర్క్‌ సౌందర్యం ఆకట్టుకుంటాయి. ప్రగ్‌ మహల్‌ తర్వాత తప్పక చూడాల్సిన నిర్మాణం ఆయినా మహల్, అందులోని హాల్‌ ఆఫ్‌ మిర్రర్స్‌ గది.


                                                         హాల్‌ ఆఫ్‌ మిర్రర్స్‌

దీనిని డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ రామ్‌సిన్హ్‌ది ఇరవై ఏళ్ల పాటు యూరోప్‌లో పని చేసిన అనుభవం. అందుకే భుజ్‌ పర్యటనలో యూరప్‌ గుర్తు వస్తుంటుంది. అందులో అద్దాల అమరిక ఒక అద్భుతం, అలాగే బంగారు కోళ్ల మంచం కూడా. దానిని చూడగానే బంగారు కోళ్ల మంచం మీద శయనించిన జమీందారు ఎవరు? అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి సమాధానంగా ఆ గదిలోనే ఆ సంస్థానాధీశుడు లఖ్‌పత్‌జీది చిత్రపటం ఉంటుంది. దర్బార్‌ హాల్‌లో ఆడియెన్స్‌ హాల్, ప్లెజర్‌ హాల్, యాంటీ చాంబర్, మ్యారేజ్‌ హాల్‌ ఉన్నాయి. మ్యారేజ్‌ హాల్‌నే ఇప్పుడు... భుజ్‌ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వస్తువుల మ్యూజియంగా మార్చారు. ఈ మ్యూజియంలో ప్రాచీన కచ్‌ రాత ప్రతులు, నాణేలు, కోరి కచ్‌ కరెన్సీ. ప్రాచీన కళాకృతులు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌లు, సంగీత వాయిద్యాలు, లోహపు పాత్రలను చూడవచ్చు.


                                                 స్వామి నారాయణ్‌ ఆలయం

మార్కెట్‌ టూర్‌!
ఇక భుజ్‌ టూర్‌లో మరో నిర్మాణ అద్భుత స్వామినారాయణ్‌ టెంపుల్‌. భూకంపం తర్వాతి పునర్నిర్మితాల్లో ఇదీ ఒకటి. కచ్‌ డెజర్ట్‌ సఫారీ వంటివన్నీ పూర్తయన తర్వాత భుజ్‌ పర్యటనలో ఆ పట్టణంలోని మార్కెట్‌లన్నింటినీ ఓ చుట్టు చుట్టి రాకపోతే చాలా మిస్సయినట్లే. విండో షాపింగ్‌ చేసినా ఫర్వాలేదు. చూసి తీరాల్సిన ప్రదేశాలు. సరఫ్‌ బజార్‌కెళ్తే కనీసం ఒక్క చనియా చోళీనైనా కొనకుండా బయటకు రాలేరు. చనయా చోళీ అంటే... అద్దాలను అందంగా అమర్చి కచ్‌ వర్క్‌ ఎంబ్రాయిడరీ చేసిన గుజరాతీ స్టైల్‌ బ్లవుజ్‌.  


                                                        రిసెప్షన్‌ హాల్‌

 
                                                       బెల్‌టవర్‌

చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్‌ అరెస్ట్‌.. ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement