బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ప్రియాంకచోప్రా ఇష్టపడే పుస్తకాలలో ఒకటి హోమ్‌గోయింగ్. ‘ఎన్నో తరాలను మనకు పరిచయం చేసే పుస్తకం ఇది’ అంటుంది ఆమె. చరిత్రకు కాల్పనికతను జోడించి రాసిన ఈ పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ఇరవై ఆరేళ్ల వయసులో ఘనీయన్–అమెరికన్ రచయిత్రి యా గ్యాసి రాసిన పుస్తకం ఇది. ‘హోమ్‌గోయింగ్’ సంక్షిప్త పరిచయం...
బానిస జీవితం, బానిస తిరుగుబాట్ల మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. పాఠకులను విశేషంగా కదిలించాయి. ఆ కోవకు చెందిన పుస్తకమే...హోమ్‌గోయింగ్. 18వ శతాబ్దానికి చెందిన కథతో ప్రారంభమయ్యే నవల ఇది. యూరోపియన్ వ్యాపారులు నిర్మించిన నలభై బానిస కోటల్లో గోల్డ్ కోస్ట్ (ప్రస్తుతం ఘనా)లోని కేప్ కోస్ట్ కాజిల్ ఒకటి. ప్రపంచానికి పట్టని ఈ ప్రాంతం బంగారు నిల్వలతో యూరప్ దృష్టిలో పడుతుంది. స్థానికులకు బట్టలు, సుగంధద్రవ్యాలు ఇచ్చి బంగారాన్ని దోచుకుపోతుంటారు. ఆ కాలంలో అమెరికాతో పాటు చాలా దేశాల్లో బానిసలకు బాగా డిమాండ్ ఉండేది. కేప్ కోస్ట్ కాజిల్ బానిసలను అమ్మే వ్యాపారకేంద్రంగా ప్రసిద్ధి. అండర్‌గ్రౌండ్ గదుల్లో, చీకట్లో అమానవీయంగా బానిసలను పెట్టేవారు.
అలాంటి గోల్డ్ కోస్ట్ (ఘనా)లో.... మామికి ఇద్దరు కూతుళ్లు. మొదటి కూతురు ఎఫియ. తండ్రి ఈ అమ్మాయిని జేమ్స్ కాలిన్స్ అనే బ్రిటీష్ గవర్నర్‌కు అమ్ముతాడు. బానిసగా కాదు వధువుగా! భర్తతో కలిసి ఆమె లగ్జరీగా బతుకుతుంది. ఇందుకు పూర్తి విరుద్ధం రెండో అమ్మాయి. పేరు ఇసి. బ్రిటీష్ వారి కోసం పనిచేసే ‘బాంబోయ్స్’ అనే గ్యాంగ్ ఊరి మీద విరుచుకుపడి ఇసిని అమెరికన్లకు అమ్మేస్తుంది. ఈ ఇద్దరి జీవితాలు, ఎన్నో తరాలతో అమెరికా. ఘనా చరిత్రను తడుముతూ నవల కొనసాగుతుంది. ఇంత జటిలమైన సబ్జెక్ట్‌ను డీల్ చేయడం కొత్త రచయితలకు కష్టమే.
కానీ గ్యాసి తడబాటు లేకుండా అలవోకగా పుస్తకం రాసింది. ఇందుకు ఆమె నేపథ్యం ఒక కారణం కావచ్చు. ఘనాలో పుట్టిన గ్యాసి అలబమ (యూఎస్)లో పెరిగింది. నవరసాలను పండించడంలో తనదైన ముద్ర వేసుకుంది. ఉదా:ఊరి నుంచి ఓడలో ఇసిని తీసుకెళుతున్నప్పుడు ఆమెపై జరిగిన భయానక హింస, పెళ్లయిన కొత్తలో ఇఫీ, ఆమె భర్తల మధ్య శృంగారఘట్టం.
ప్రతి చాప్టర్‌లో ఎఫియ, ఇసి వారసుల దృష్టికోణం నుంచి సాగే నవల ఇంటర్‌లింక్‌లతో ఆకట్టుకుంటుంది. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డల (తండ్రులు వేరు) వేరు వేరు ప్రపంచాల మధ్య వైరుధ్యాలకు అద్దం పట్టే నవల ఇది. స్థూలంగా చెప్పాలంటే మూడు దశాబ్దాల కాలంలో ఆఫ్రికా, అమెరికా తీరాల మధ్య తిరుగాడే నవల. ఘనా సముద్ర తీరంలో ఇంకిపోని బానిస కన్నీటి చుక్క ఈ నవల. ఆ కాలంలో ఆఫ్రికన్, అమెరికన్‌లకు ఒక గట్టి నమ్మకం ఉండేది....చనిపోయిన బానిస ఆత్మ తిరిగి ఆఫ్రికాను వెదుక్కుంటూ వస్తుందని.
ఈ నమ్మకం ఆధారంగానే నవలకు ‘హోమ్‌గోయింగ్’ అని పేరు పెట్టారు. ఈ నవల రాయడానికి ముందు ఘనాకు వెళ్లింది రచయిత్రి. ‘ఈ దేశం పూర్తిగా నాది. ఈ దేశం పూర్తిగా నాది కాదు’ అనే విచిత్రమైన భావనకు లోనైంది. కేప్‌కోస్ట్ కాజిల్ చీకటి గదుల్లో వందలాది బానిసలను దాచిన భయానక గదులను చూసింది. ఆ గదుల్లో అదృశ్య ఆర్తనాదాలు విన్నది....ఇవేవీ వృథా పోలేదు. తన నవలకు సజీవాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment