దుర్గప్రియ గొట్టాపు
చీర ధరించడం సంప్రదాయం, పాత కాలం వాళ్లలా చీరలేమిటి అనుకుంటున్నారా. చీరతో ఆ తరం వారికి ఎన్నో అనుభూతులు, అనుబంధాలు, అనుభవాలు ఉన్నాయి. పెళ్లి చీర, మధుపర్కాల చీర, మొట్టమొదటిసారి చంటి పిల్లను ఎత్తుకున్న చీర, పసిపాపకు ఉయ్యాల వేసిన పాత చీర... మొట్టమొదటగా కట్టుకున్న అమ్మ చీర, మొదటి జీతంతో కొనుక్కున్న మొదటి చీర, అత్తవారింట్లో కొన్న చీర... ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకుంటాయి చీరతో.
ఎన్ని తరాలు మారినా, తెలుగు ఆడపిల్లలు చీరను ఎన్నటికీ విడిచిపెట్టలేరు. ఇప్పుడు పెళ్లికి ఆడ పిల్లలు చీరలు కొనుక్కోవటానికి ఎంత హడావుడి చేస్తున్నారో తెలుసు కదా. చీర ఎప్పటికీ చీరే. చీరను స్మరించని ఆడవారు ఎక్కడా ఉండరేమో. ఏదో ఒక సందర్భంలో చీరను ధరించి మధురానుభూతి పొందకుండా ఉండలేరు. ఒక్కో చీరకు ఒక్కో అనుభూతి ఉంటుంది. ఎంతో ఇష్టంతో కొనుక్కున్న చీరకు సంబంధించి ఏదో ఒక కథ ఉంటుంది. చిరస్మరణీయం చీరస్మరణీయం. చీరలను స్మరించుకోవటానికి వేదికను ఏర్పాటుచేశారు కజగిస్థాన్‌లో ఉంటున్న దుర్గప్రియ గొట్టాపు. ఈ పేజీ ప్రారంభించటం గురించి సాక్షితో ఆమె పంచుకున్న మాటలు...
చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ, చిన్నప్పటి నుంచి తెలుగు పురాణాల మీద చాలా ఆసక్తి. ఇప్పటివరకు సుమారు రెండు వేల మందికి తెలుగు నేర్పాను. తెలుగు టీచర్‌గా పదహారు సంవత్సరాల క్రితం మలేసియా వచ్చాను. తెలుగు పాఠాలు చెబుతున్నాను. మలేసియా తెలుగు అకాడెమీలో ఇప్పటికీ కొనసాగుతున్నాను. తెలుగు నేర్పటం నా లక్ష్యం. మయన్మార్‌లో కొంతకాలం వర్క్‌షాప్స్ నిర్వహించాను. 2016లో కజగిస్థాన్ వెళ్లిపోయాను. ఇప్పటికీ మలేసియా వస్తూనే ఉంటాను. చాలా సంవత్సరాలుగా మన దేశానికి దూరంగా ఉండటం వలన నాలో ఏదో ఒక వెలితి ఏర్పడింది. ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తోంది.
ఆనందం కోసం..
సాధారణంగా ఆడపిల్లలకు 18 సంవత్సరాల నుంచి చివరి దాకా చీరతోనే అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. విద్యార్థులకు చీరలో పాఠం చెప్పే గురువును అందరూ గౌరవిస్తారు. చీర కట్టుకున్న నాయనమ్మ, అమ్మమ్మల మీద మనవలకు అపారమైన ప్రేమ ఉంటుంది. ఇలా చీరతో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. అందుకే ఆడవారందరికీ ఆనందం కలిగేలా ఏదో ఒక పని చేయాలనుకున్నాను. ఆడవాళ్లకి చీరల మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ‘చీరలలో ఏముంటుందిలే?’ అనుకుంటారు.
కానీ అందరికీ చీరలతో ఏదో ఒక అనుబంధం, అనుభూతి పెనవేసుకుని ఉంటాయి. చంటి బిడ్డను మొట్టమొదటి సారి ఎత్తుకున్న చీర, ఉయ్యాల వేసిన చీర, బొంత కుట్టిన చీర... ఇలా ప్రతి చీర ఒక జ్ఞాపకంగా అనుభూతి చెందిన సంఘటనలు చాలా ఉంటాయి. చీరజ్ఞాపకాలు, అనుభవాలతో పెనవేసుకున్న చీర పాడైపోయినా... ఎవ్వరికీ ఇవ్వలేకపోతారు. ఒక తియ్యని అనుబంధంగా దాచుకుంటారు.
శారీ స్పీక్స్...
చీర కట్టుకోవడం, కట్టుకున్న వాళ్లను గౌరవంగా చూడటం.. ఇటువంటి ఎన్నో అంశాలు చీరతో కొంగుముడి వేసుకుని ఉంటాయి. ‘శారీ స్పీక్స్’ అనే ఇంగ్లీషు పేజీ చూశాక, అటువంటిదే ఒక ఫేస్ బుక్ పేజీ పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఇది నా బ్రెయిన్ చైల్డ్. పేజీ పెట్టగానే పెద్దపెద్ద వాళ్లు ఇందులో చేరారు. పేజీలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి వీలుగా కొత్త కొత్త కాన్సెప్ట్స్ పెడుతుంటాను. ‘శారీస్ – స్టోరీస్’ అంశం గురించి రాయమనగానే. అందరూ ఎంతో మంచి మంచి అనుభవాలు రాశారు.
90 సంవత్సరాల పెద్దావిడ కూడా తన అనుభవాలు వివరించారు. ఆవిడ అమ్మమ్మ పెళ్లి చీరను నాలుగు తరాలుగా పెళ్లి కట్టుకున్నామని చెప్పారు. ఆరోజు నాకు గర్వం అనిపించింది. అందరినీ గుర్తు చేసుకుంటూ, వారి అభిప్రాయాలను పంచుకుంటూంటే, చీర మన జీవితంలో ఒక బంధం అయిపోయిందనిపించింది. చీర నిత్మ స్మరణీయంగా అంటే చిరస్మరణీయంగా మిగిలిపోతుందనే ఉద్దేశంతోనే ఈ పేజీకి చీర స్మరణీయం అని పేరు పెట్టాను. చీరే కదా అని తోసి పారేయకూడదు, ‘అది చీర’ అనుకోవాలి.
వారానికో థీమ్
చీరకు సంబంధించి ఎన్నో రకాలుగా వారి అనుభవాలను పంచుకునేలా చేయాలనే తలంపుతో వారానికో థీమ్ పెడుతుంటాం. కలర్ థీమ్, తలంబ్రాలు లేదా మధు పర్కాల చీర, పెళ్లి చీర, అక్కయ్యలతో కలిసి తీయించుకున్న చీర ఫొటో, అమ్మతో ఫొటో, ఒంటరిగా ఒక రంగుచీరతో ఫొటో... ఇలా రకరకాలుగా థీమ్ అనౌన్స్ చేస్తుంటాం. గిరిజారాణి అనే ఆవిడ ఫన్నీగా అనౌన్స్‌మెంట్స్ అన్ని మాండలికాల్లో ఇస్తుంటారు. పేజీ సభ్యులందరూ అప్పటికప్పుడు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని, ఎంతో ఇష్టంగా పోస్టు చేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఎన్నో విషయాలు వివరిస్తున్నారు.
హడావుడి మొదలైంది అంటూ కామెంట్స్
80 సంవత్సరాల వయసు వారు కూడా సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో అందరూ బాధలో ఉంటున్నారు. ఇలా చీర గురించి పోస్టు చేస్తూండటం వల్ల, బాధలన్నీ మరచిపోగలుగుతున్నామని అందరూ కామెంట్స్ పెడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటోంది నాకు. మన చీరలో మనలను చూసుకుంటూ, మనలను గుర్తు చేసుకుంటూ హడావుడి మొదలైంది అంటూ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇందులో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ద్వారం లక్ష్మి, రచయిత్రి మన్నెం శారద, నాట్యకళాకారిణి కోకా విజయలక్ష్మి వంటి ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు.
– దుర్గప్రియ గొట్టాపు, మలేసియా తెలుగు ఉపాధ్యాయిని.
అమ్మ ఉంటే చీర ఇచ్చేది
ఈ గ్రూపు ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా అమ్మ ఇచ్చిన చీర, అమ్మమ్మలతో ఫొటోలు లాంటి పోస్టులు బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా అమ్మనాన్నలను ఫొటోలో మాత్రమే చూశాను. నాకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇరువురూ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. నేను ‘మా అమ్మ ఉంటే ఎలాంటి చీర ఇచ్చేది... ఇలానే ఉండేదేమో’ అని ఊహిస్తాను. అమ్మ ఉన్నవారు ఎంత అదృష్టవంతులండీ. మీ పేరెంట్స్‌తో పోస్టు చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అండీ.
– శ్రీలక్ష్మి, ఒక సభ్యురాలు.
ఇక ఈ చీర గురించి..
2004 లో పుట్టపర్తిలో పరిచయం అయిన సుధాసుందర్ తన పెళ్లికి, నన్ను ఒక మంచి కంచి పట్టు చీర కొనుక్కోమన్నారు. నేను వద్దన్నా వినకుండా కొన్నారు. చీర ధర చూసి నా కళ్ళు తిరిగాయి. అక్షరాల 14,500 రూపాయలు. స్వచ్ఛమైన ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.
– శ్రీదేవి లేళ్లపల్లి, చెన్నై
అప్పుడు కట్టుకున్నాను
యామినీ కృష్ణమూర్తి గారి బయోపిక్ మూవీకి పనిచేసినప్పుడు.ఆ లెజెండ్ ని ప్రసాద్ లాబ్స్‌లో కలిసే అదృష్టం లభించింది. ఈ బయోపిక్ ఎప్పటికి సినిమాగా పూర్తి అవుతుందో తెలీదు కానీ అంత నృత్యం చెయ్యగల తార దొరకాలిగా, అప్పుడు నేను కట్టుకున్న చీర అది. అది మా అన్నయ్య తన కొడుకు పెళ్లికి పెట్టాడు,
-బలభద్రపాత్రుని రమణి, రచయిత
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment