Chhattisgarh Sub Engineer Ajay Roshan Lakra Abducted By Maoists Released Credit Goes To His Wife: అడవి భయపెడుతుంది. క్రూరమృగాలు ఉంటాయి. అడవి భయపెడుతుంది. దారులు తెలియకుంటాయి. అడవి భయపెడుతుంది. తుపాకులు పేలుతాయి. కాని ఆమె భయపడలేదు.ప్రాణాలు లెక్క చేయలేదు. వెనక్కు మరలలేదు. కిడ్నాప్ అయ్యి అడవిలో ఉన్న భర్త కోసం చంకలో మూడేళ్ల బిడ్డను పెట్టుకుని ముందుకు సాగింది. భర్త విడుదలకు మంకుపట్టు పట్టింది. అడవికి కూడా మనసు ఉండే ఉంటుంది. అందుకే ఆమెకు తల వంచింది. తాను ఓడి ఆమెను గెలిపించింది.ఈ ఏడాది నవంబర్‌లో చత్తిస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను ‘సాక్షి’కి వివరించింది.
నవంబర్ 11.
35 ఏళ్ల అజయ్ రోషన్ లక్రా బిజాపూర్‌లో సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ కింద పల్లెల్లో రోడ్లు వేయించడం అతడి పని. ఆ పనిలో భాగంగానే ప్యూన్ లక్ష్మణ్‌ను తీసుకుని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్నా అనే గ్రామానికి వెళ్లాడు. వెంటనే మావోయిస్టులు అతణ్ణి, లక్ష్మణ్‌ను కిడ్నాప్ చేశారు. రోషన్ లక్రాను మావోయిస్టులు కాంట్రాక్టర్ అనుకున్నారు.
కాని రోషన్ లక్రా కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతణ్ణి ఎలా విడుదల చేయాలి. ప్యూన్‌ని వదిలిపెట్టిన మావోయిస్టులు రోషన్ ను తమ వద్దనే ఉంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే భర్త కోసం అర్పిత బయలుదేరింది. 20 కిలోమీటర్లు... చంకన మూడేళ్ల కొడుకుతో అడవిలో నడుస్తూనే ఉంది. అడవి జంతువులు ఎదురైతే చెట్లు, బండ రాళ్ల మధ్య దాక్కుంటూ ముందుకెళ్లింది. అడుగు తీసి అడుగు వేస్తే విషసర్పాలు.. అయినా ఆమె బెదరలేదు. భర్తను విడిపించుకోవాలనుకున్న ఆమె పట్టుదలను చూసిన మీడియా, గ్రామస్తులు తోడుగా నిలిచారు. చివరకు మావోయిస్టులను ఒప్పించి భర్తను తిరిగి అప్పగించేలా చూశారు. బీజాపూర్‌లో అర్పితను ‘సాక్షి’ కలవగా ఆమె భర్త కోసం చేసిన పోరాటాన్ని ఇలా వివరించింది.
మొదటి రోజు..
నా పేరు అర్పిత. మాది చత్తిస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా. బీజాపూర్ నుంచి700 కిలోమీటర్లు. 2018లో మా ఆయనకు బీజాపూర్‌కు బదిలీ అయింది. నేను మాత్రం ఏడాది క్రితమే బీజాపూర్‌కు వచ్చాను. నాకు హిందీ తప్ప మరాఠీ, గోండి భాషలు రావు. రోజంతా ఇంట్లోనే బాబుతో గడుపుతున్న. మా ఆయన మధ్యాహ్నం భోజనం ఇంట్లోనే తినేవారు. ఎట్టి పరిస్థితిల్లోనూ చీకటి పడక ముందే ఇంటికి చేరుకునేవారు. గత నెల 11వ తేదీన కూడా డ్యూటికీ వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పారు కానీ రాలేదు. మధ్యాహ్నం 2, 3 గంటల ప్రాంతంలో ఆయన ఫోన్‌కు ట్రై చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఆఫీస్ పని మీద బయటికి వెళ్లారని అనుకున్నా.
సార్ ఇంటికి వచ్చారా?
సాయంత్రం 6 గంటలకు ఆయన ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చారు... అజయ్ సార్ వచ్చారా? అని. నేను ఎందుకు.. ఏమైందని అడిగా. వాళ్లు ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. అప్పటికే ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారోననే టెన్షన్ పట్టుకుంది. రాత్రి 10 అయింది. ఆయన ఆఫీస్ నుంచి నలుగురు వచ్చారు. మీ ఆయన గోర్నా అటవీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనుల పర్యవేక్షణ కోసం వెళ్లారు. బహుశా దారి తప్పి ఉంటారు. రేపు ఉదయం వచ్చేస్తారు.. కంగారు పడకండి అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అవసరమైతే మీకు తోడుగా మా ఇంటి మహిళలు ఉంటారు అన్నారు. నేను మళ్లీ అడిగాఏఉ అసలేం జరిగిందో చెప్పండి.. నాకు మూడేళ్ల బాబు (కియాన్ రోషన్) ఉన్నాడు... ఇక్కడ నాకు నా అనే వాళ్లు ఎవరూ లేరని వాళ్లతో అన్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన వారు మళ్లీ అదే చెప్పి నిశ్చింతగా ఉండమన్నారు.
రెండో రోజు...
నవంబర్ 12. ఉదయం 8. ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చారు. అజయ్‌ని మావోయిస్టులు బందీ చేశారనే పిడుగు లాంటి వార్త చెప్పారు. వారి మాటలు వినగానే నేను నా భర్తను ఎలా రక్షించుకోవాలో చెప్పండి... అడవికి వెళ్తాను అన్నాను. దానికి వారు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వదిలిపెడతారని తెలిసింది... అప్పటి వరకు ఓపిక పట్టండి అన్నారు. మా ఆయనకు సంబంధించిన గుర్తింపు కార్డులు అడిగితే ఇచ్చా. వాటిని తీసుకెళ్లారు. రాత్రి 10 దాటింది. మా ఆయన గురించి ఏ సమాచారం తెలియదు. ఉదయం 8 గంటల నుంచి ఇంటి గుమ్మం ముందే బాబుతో కూర్చున్న. మావారు ఎప్పుడొస్తారా? అని ఎదురుచూసిన. అయినా అజయ్ రాలేదు. అప్పుడే నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది... మా ఆయనతో వెళ్లిన ప్యూన్ లక్ష్మణ్ ను మావోయిస్టులు వదిలిపెట్టారని. యి ఆయనను దండకారణ్యంలోకి తీసుకెళ్లారని. అది విని రాత్రంతా ఏడుస్తూనే గడిపా.
మూడో రోజు..
మరుసటి రోజు నవంబర్ 13వ తేదీ ఉదయం. మా ఆయన ఆఫీస్ సిబ్బందితో కలిసి లక్ష్మణ్‌ను కలిసి మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్లా. ‘మావోయిస్టులు నన్ను, సార్‌ను వేర్వేరుగా ఉంచారు మేడమ్. రెండ్రోజుల్లో ఆయన్ను ఒక్కసారి మాత్రమే చూశా.’ అని లక్ష్మణ్ అన్నాడు. మీడియా, ఆఫీస్ సిబ్బందితో కలిసి లక్ష్మణ్‌ను వదిలిపెట్టిన ఊరికి వెళ్లిన. అక్కడి గ్రామస్తుల ముందు నా బాధ చెప్పుకున్న. ‘మేం వాళ్లతో మాట్లాడతాం. మీ ఆయన ఇంటికి వచ్చేస్తాడు వెళ్లండి’ అని గ్రామస్తులు చెప్పారు. సాయంత్రం ఇంటికి వచ్చేశా. ఆ రాత్రి కూడా అజయ్ రాలేదు.
నాలుగో రోజు
నవంబర్ 14న ఉదయమే లేచి బాబుతో మళ్లీ అడవికి బయలుదేరిన. మధ్యలో మమ్మల్ని చూసిన ఆఫీస్ సిబ్బంది ఒంటరిగా వెళ్లొద్దు... ప్రమాదముందని వెళ్లకుండా ఒత్తిడి తెచ్చి ఇంటికి పంపించేశారు. ఆ రోజూ మా ఆయన గురించి ఎలాంటి సమాచారం రాలేదు.
ఐదో రోజు
ఐదో రోజు నవంబర్ 15న మీడియాతో కలిసి మరో ఊరికి వెళ్లిన. మా ఆయన్ను అక్కడికి తీసుకెళ్లారని తెలిసింది. ఆ గ్రామస్తులు అజయ్ ఈరోజు వచ్చేస్తారు అని కచ్చితమైన హామీ ఇవ్వడంతో ఇంటికి వచ్చేశా. ఆరోజూ మావారు ఇంటికి రాలేదు. అజయ్‌ను ఏదైనా చేసి ఉంటారా..? ఆయన బతికే ఉన్నాడా..? అనే ఏవేవో ఆలోచనలు రాసాగాయి. ఆ ఆలోచనలు రావద్దనుకున్నా పరిస్థితుల్ని చూస్తే అలానే అనిపించింది.
ఆరో రోజు..!
మా ఆయనను కిడ్నాప్ చేసిన ఆరో రోజైన నవంబర్ 16న మళ్లీ అడవి బాట పట్టా. ఇంటికి వస్తే మా ఆయనతోనే.. లేకపోతే రావొద్దని నిర్ణయించుకున్నా. నలుగురు మీడియా సభ్యులు నాకు తోడుగా అడవిలోకి వచ్చారు. ముందురోజు మేం వెళ్లిన ఊరికి వెళ్లి అడిగితే ఇంకో గ్రామం పేరు చెప్పారు. అయినా అధైర్యపడలే. వారు చెప్పిన ఊరికి వెళ్లాం. ఎవర్ని ఎంత అడిగినా తెలియదన్నారు. చీకటి పడుతోంది. నేను, మీడియా అక్కడ ఓ చిన్న స్కూల్లో బస చేశాం. మీడియాలో ఓ మహిళ కూడా ఉండడం నాకు ధైర్యానిచ్చింది. ఆ సమయంలో బిస్కట్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లే మా కడుపు నింపాయి.
ఏడో రోజు
మరుసటి రోజు నవంబర్ 17న ఉదయం లేచి గ్రామస్తులను మరోసారి వేడుకున్నాం. ఐదోరోజు వెళ్లిన ఊరికి వెళ్లాలని, అక్కడ ప్రజా కోర్టు ఉందని వారు సూచించారు. హుటాహుటిన ఆ ఊరికి వెళ్లాం. మేం అక్కడికి చేరుకోగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. ఏం జరుగుతుందోననే భయం పట్టుకుంది. బాబును గట్టిగా గుండెకు హత్తుకుని ముందుకు వెళ్లా. అప్పటికే ప్రజాకోర్టు ముగియడంతో ముందు నలుగురు, వెనక పది మందికి పైగా తుపాకులతో వస్తున్నారు. మధ్యలో నా అజయ్ కనిపించారు. ఆయన్ను చూడగానే ఏడ్చుకుంటూ పరుగెత్తుకుని వెళ్లి కౌగిలించుకున్న. మా ఆయన్ను క్షేమంగా వదిలిపెట్టినందుకు మావోయిస్టులతో పాటు సహకరించిన గ్రామస్తులు, మీడియాకు మేం రుణపడి ఉన్నాం.
అర్పితే నన్ను తీసుకొచ్చింది : అజయ్ రోషన్
గత నెల 11న నేను, నా ఫ్యూన్ లక్ష్మణ్‌తో కలిసి రోడ్డు పని పర్యవేక్షణకు గోర్నాకు వెళ్లా. తిరుగు పయనంలో పది మంది మావోయిస్టులు నన్ను, లక్ష్మణ్‌ను అడ్డగించారు. స్థానికుడొకరి పేరు చెప్పి ఆయనతో చెప్పి వచ్చారా..? అని అడిగారు. మేం అవునన్నాం. మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి అడవి లోపలికి తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్లు తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత కళ్లకు గంతలు కట్టారు. పేరు, ఉద్యోగం, కుటుంబ వివరాలు, అడ్రస్ అడిగారు.
నన్ను లక్ష్మణ్‌ను అప్పుడే వేరు చేశారు. మరుసటి రోజు గుట్టపైకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 17వ తేదీ వరకు ఎనిమిది స్థావరాలు తిప్పారు. వెళ్లిన ప్రతిచోటా పేరు, ఉద్యోగం, కుటుంబ వివరాలు, అడ్రస్ ఇవే అడిగారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన. వాళ్లు ఎంక్వైరీ చేసుకున్నారనుకుంటా. ఏడో రోజు నన్ను ప్రజాకోర్టుకు తీసుకెళ్తున్నామని, నన్ను వదిలిపెట్టాలో.. లేదో.. వారే నిర్ణయిస్తారని చెప్పారు.
అప్పుడు నేను టెన్షన్ పడ్డ. అర్పిత ఎప్పుడూ ఇంటి గుమ్మం దాటలేదు. నాకేదైన అయితే ఎంతో దూరంలో ఉన్న వాళ్ల ఊరికి ఒంటరిగా ఎలా వెళ్తుందో అని ఆందోళన చెందా. చివరకు నన్ను వారు చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి వద్దని పెద్ద గొంతుతో అరిచారు. అంతలోనే నా కళ్ల గంతలు విప్పారు. దూరం నుంచి అర్పిత పరుగెత్తుకుని వచ్చి.. ఏడుస్తూ నన్ను కౌగిలించుకుంది. తర్వాత మమ్మల్ని వెళ్లిపొమ్మన్నారు. కియాన్‌ను చంకలో ఎత్తుకుని అడవిలో నా అర్పిత పడ్డ బాధల్ని చూసే మావోయిస్టులు నన్ను వదిలిపెట్టారని అనుకుంటున్న.
– ముహమ్మద్ ముజాహిద్ బాబా సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment