పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ముంబైకి చెందిన హేమ తన బిడ్డలు దియా, ఓజస్వీ శర్మలతో కలిసి ‘చిల్జో’ పుడ్‌బ్రాండ్ ద్వారా మన పొరుగుదేశాలతో పాటు ఇటలీ, ఆఫ్రికా, అమెరికా, చైనా... మొదలైన దేశాల వంటకాలను రుచి చూపిస్తూ ‘వావ్’ అనిపిస్తోంది...
చైనా వంటకాలు చైనాకు వెళ్లే తిననక్కర్లేదు. ఇటలీ వంటకాలకు అక్కడికే వెళ్లనక్కర్లేదు. ముంబైలోని ‘చిల్జో’లోకి అడుగుపెడితే చాలు ఎన్నో దేశాలకు సంబంధించిన నోరూరించే వంటకాలు స్వాగతం పలుకుతాయి.
గత సంవత్సరం హేమ తన కూతుళ్లు దియా, ఓజస్వీలతో కలిసి ఈ ఫుడ్‌రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముంబైవాసులు మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడకు రావడం మొదలైంది.
‘ఇతర దేశాల ఆహార సంస్కృతిని అందిపుచ్చుకొని ఆస్వాదించడం మనకేమీ కొత్త కాదు. అయితే అక్కడి రుచిని ఇక్కడికి తీసుకు వచ్చినప్పుడే విజయవంతం అవుతాం’ అంటుంది దియా.
చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేసింది దియా. ఉద్యోగ కాలంలో ఎన్నో ప్రాంతాలు తిరిగింది. ఆ సమయంలో రకరకాల రుచులతో పరిచయం అయింది. వంటల రుచికి మాత్రమే పరిమితమై పోకుండా ఎందరో చెఫ్‌లు, ఫుడ్ ఇండస్ట్రీలోని ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది.
కోవిడ్ కల్లోల కాలంలో స్వదేశానికి తిరిగివచ్చిన దియా ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించింది. లాక్‌డౌన్ సమయంలో బయటికి వెళ్లి తినే పరిస్థితి లేదు. దాల్, రోటీ తినడం తప్ప మరోదారి లేదు. మరోవైపు రకరకాల వంటకాల రుచులు గుర్తుకొచ్చి నోరూరించేవి. ఆ సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటకాల గురించి తెలుసుకునే పనిలో పడింది దియా.
‘ఎన్నో సంవత్సరాలు హాస్టల్ ఫుడ్ తిన్న నాకు కొత్త రుచి కావాలనిపించేది. నేను పాస్తాకు వీరాభిమానిని. దీంతో ఇంట్లో వంటల ప్రయోగాలు మొదలు పెట్టాం. చాలాసార్లు విఫలం అయిన తరువాతగానీ సక్సెస్ కాలేకపోయేవాళ్లం. మేము ప్రొఫెషనల్స్ కాకపోయినా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ నేర్చుకున్నాం. ఇప్పుడు ‘చాలాబావుంది... అని మాకు అనిపించే వరకు వెనక్కి తగ్గలేదు’ అంటోంది బీటెక్ చదివిన ఓజస్వీ.
ప్రయోగాల్లో భాగంగా తాము తయారుచేసిన రెండు వందల సాస్‌లను బంధువులు, స్నేహితులకు పంపిణీ చేశారు. వారి నుంచి మంచి స్పందన లభించింది.
ఆ సమయంలోనే ఈ తల్లీకూతుళ్ల మదిలో ‘చిల్జో’ ఐడియా వచ్చింది.
ఒక సంవత్సరం రీసెర్చ్, డెవలప్‌మెంట్ తరువాత ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. తమ పొదుపు మొత్తాల నుంచి 40 లక్షల రూపాయలు తీశారు. 30 మందికి ఉపాధి కల్పించారు.
‘ఇంట్లో వంటలతో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. డబ్బులతో చేయవద్దు. ఫుడ్ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి అనుభవం లేదు. రిస్క్ తీసుకుంటున్నారు’ అన్నవారే ఎక్కువ మంది ఉన్నారు.
‘యూనిట్ మొదలైన తరువాత నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను.
ఎన్నో సంవత్సరాలు చేసిన ఉద్యోగానికి దూరం కావడం బాధగా అనిపించినా, సొంత వ్యాపారం మొదలుపెట్టాం అనేది ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉత్సాహం అయితే ఉంది కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి నేపథ్యం లేని మాకు మార్జిన్స్, రిటైల్, ఎలాంటి డిస్ట్రిబ్యూటర్‌లను సంప్రదించాలి అనే విషయాలు తెలియదు. జీటీ–జనరల్ ట్రేడ్, ఎంటీ–మార్కెట్ ట్రేడ్‌లాంటి పదాలు తెలియవు. సక్సెస్ అవుతామా, లేదా అనేది తెలియదు. అయినా ఉత్సాహంతో ముందుకు వెళ్లాం. మంచి ఫలితాన్ని సాధించాం’ అంటుంది దియా.
అయినా సరే...
‘ఏమవుతుందో ఏమో!’ అనే సంశయం ఎక్కువైతే ఉన్నచోటే ఉండిపోతాం. కంఫర్ట్ జోన్‌కు అలవాటు పడిపోతాం. దీంతో విజయానికి దూరం అవుతాం. ‘పెద్ద రిస్క్ ఏమిటంటే ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే’ అనే ప్రసిద్ధ మాటను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగాను. ఫుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేకపోయినా మా మీద మేము నమ్మకం కోల్పోలేదు. ఆశావాదంతో ముందుకు వెళ్లాం. అద్భుత ఫలితాన్ని సాధించాం.
– హేమ, ఫౌండర్, చిల్జో
Comments
Please login to add a commentAdd a comment