Sagubadi: ప్రకృతి ఆహారం.. పక్కా లోకల్‌! | Container Rythu Bazars At Five Places Preparations To Set Up Thirty Three More Soon | Sakshi
Sakshi News home page

Sagubadi: ప్రకృతి ఆహారం.. పక్కా లోకల్‌!

Published Tue, Jun 4 2024 8:54 AM | Last Updated on Tue, Jun 4 2024 8:55 AM

Container Rythu Bazars At Five Places Preparations To Set Up Thirty Three More Soon

ఏపీలో ప్రకృతి వ్యవసాయదారుల పంటలకు స్థానిక మార్కెట్లు, రైతుబజార్లలో మంచి గిరాకీ

ప్రతి సోమవారం జిల్లా, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో నేరుగా ప్రజలకు విక్రయిస్తున్న రైతులు

ప్రయోగాత్మకంగా 5 చోట్ల ‘కంటెయినర్‌ రైతుబజార్లు’... త్వరలో మరో 33 ఏర్పాటుకు సన్నాహాలు

తొలకరితో పాటే వచ్చే అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (జూన్‌ 5) ఈ ఏడాది లక్ష్యం: ’భూముల పునరుద్ధరణ, ఎడారీకరణను, కరువును తట్టుకునే దిశగా పనిచేయటం’. మట్టిలో సేంద్రియ కర్బనం 0.3%కి పడిపోయింది. దీన్ని పెం΄÷ందించుకోవటానికి, పనిలో పనిగా భూతాపాన్ని తగ్గించడానికి సేద్యం మొత్తాన్నీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటం తప్ప మరో మేలైన దారి లేదన్నది నిపుణుల మాట.

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు భూమిని శాశ్వతంగా బాగుచేసుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వారు పండించిన అమృతాహారాన్ని స్థానిక మార్కెట్లలోనే నేరుగా ప్రజలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్రకృతి/సేంద్రియ రైతులతో పాటు ఈ ఆహారాన్ని కొనుగోలు చేస్తున్న వినియోగదారులు కూడా పర్యావరణ పరిరక్షణకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆహార రంగంలో చోటు చేసుకుంటున్న గుణాత్మక మార్పుల గురించి ప్రత్యేక కథనం..!

ప్రకృతి వ్యవసాయంలో మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్‌) విస్తారంగా సాగవుతోంది. రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకంగా పండించిన ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్థానిక మార్కెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటుతో ఏపీ రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది.

ప్రకృతి వ్యవసాయంలో స్థానిక రైతులు పండించిన ఆహారోత్పత్తులను స్థానిక ప్రజలకే తొలుత అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. స్థానిక మార్కెట్లలో, రైతుబజార్లలో, వైఎస్సార్‌ చేయూత మహిళా రూరల్‌ మార్ట్‌లలో రైతుల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఈ కార్యక్రమం ్రపారంభమైంది. విజయవాడ కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నారు.

ప్రతి సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజలు తరలి వస్తారు కాబట్టి అదే రోజు నమ్మకమైన ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, సాధారణ మార్కెట్‌తో పోల్చినప్పుడు ఇక్కడ 10–15% అదనపు ధర రైతులకు లభిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ సీనియర్‌ మార్కెటింగ్‌ లీడ్‌ బి. ప్రభాకర్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

జిల్లా, మండల కేంద్రాల్లో ఉత్పత్తులు విక్రయిస్తున్న ప్రకృతి వ్యవసాయదారులు

427 మండల కేంద్రాల్లో అమ్మకాలు..
ఏపీలోని 26 జిల్లా కేంద్రాలకు గాను 22 చోట్ల, 663 మండలాలకు గాను 427 మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను రైతులు అమ్ముతున్నారని ప్రభాకర్‌ వివరించారు. అదేవిధంగా, 113 మునిసిపాలిటీలకు గాను 24 మునిసిపాలిటీలలోనూ తాము పండించే ఉత్పత్తులను గత 2–3 నెలలుగా ప్రకృతి వ్యవసాయదారులు విక్రయిస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత మహిళా గ్రామీణ మార్ట్‌లు 47 ఉండగా ఇప్పటికి 32 మార్ట్‌లలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను అందుబాటులోకి తెచ్చారు.

ఆకర్షిస్తున్న ‘కంటెయినర్‌ రైతుబజార్లు’..
ఏపీలో 96 రైతుబజార్లు పట్టణ ్రపాంత వినియోగదారులకు నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో ఇప్పటికే 47 రైతుబజార్లలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో 5 రైతుబజార్లలో మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటుతో అవని ఆర్గానిక్స్‌ప్రొడ్యూసర్‌ కంపెనీ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రత్యేక కంటెయినర్లు ఏర్పాటు చేసింది. వీటిలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలను విక్రయించటం ఇటీవలే ్రపారంభించారు. పట్టణ ్రపాంతీయులను ఈ కంటెయినర్‌ రైతుబజార్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయని, మరో 33 రైతుబజార్లలో జూన్‌ రెండోవారంలో కంటెయినర్‌ దుకాణాలను ్రపారంభించనున్నామని ప్రభాకర్‌ వివరించారు. మున్ముందు దశలవారీగా ప్రతి రైతుబజారులోనూ కంటెయినర్‌ దుకాణాలు తెరుస్తామన్నారు.

లోకల్‌ మార్కెటింగే మా వ్యూహం!
రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తులతో పోల్చితే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. ఈ ఆహారోత్పత్తులను స్థానిక మార్కెట్ల ద్వారా సాధారణ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటమే మా మార్కెటింగ్‌ వ్యూహం. మార్కెటింగ్‌ శాఖ, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

– టి. విజయకుమార్, ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ఏపీఆర్‌వైఎస్‌ఎస్‌.

గ్రామాల్లో ‘ఫుడ్‌ బాస్కెట్లు’!
ఏపీలో ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక బృందాలు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందాల సభ్యుల కుటుంబాలలోని వారందరికీ అవసరమయ్యే అన్ని రకాల ఆహారోత్పత్తులను ప్రకృతి వ్యవసాయంలో పండించినవే అందించాలన్న లక్ష్యంతో ఫుడ్‌ బాస్కెట్స్‌ కార్యక్రమానికి రైతుసాధికార సంస్థ 7 నెలల క్రితం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి 76 గ్రామాల్లో ఈ ఫుడ్‌ బాస్కెట్‌ స్కీమ్‌ ్రపారంభమైందని, త్వరలో 129 గ్రామాలకు విస్తరించనున్నామన్నారు.  వీరికి ఆయా గ్రామాల్లో పండించేవి చాలకపోతే, పక్క గ్రామాలు, మండలాల నుంచి సేకరించి అందిస్తున్నారు.

గ్రామీణులకు తొలి ్రపాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ఫుడ్‌ బాస్కెట్స్‌ అందిస్తుండటం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తున్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సిబ్బంది, సందర్శకులకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులన్నిటినీ విక్రయించేందుకు  జూన్‌ రెండో వారం నుంచి ప్రత్యేక స్టాల్‌ను ్రపారంభించనున్నామని ప్రభాకర్‌ (97714 63539) చెప్పారు. స్థానిక మార్కెట్ల ద్వారా స్థానిక ప్రజలకు ప్రకృతి ఆహారాన్ని విస్తృతంగా అందుబాటులోకి తేవటం సంతోషదాయకం.


– బి.ప్రభాకర్‌, సీనియర్‌ మార్కెటింగ్‌ లీడ్‌, ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement