‘సరోజిని ఇంట్లో పని చేసుకుంటుంటే ఫోన్ మోగింది. చేస్తున్న పని వదిలేసి, ఫోన్ అందుకుంది. గవర్నమెంట్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామనగానే తమ పొదుపు సంఘం గురించే అని, అవతలి వాళ్లు చెప్పేది వినడానికి చెవులు రిక్కించింది. ‘ప్రభుత్వం నుంచి వచ్చే పథకం మొత్తం డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయా’ అని అడిగారు అవతలి నుంచి. ‘ఇంకా రాలేదు సార్! వచ్చాక చెబుతా!’ అంది సరోజిని. ‘అంటే, మీరు వడ్డీ డబ్బులు కట్టలేదు. వడ్డీ వెంటనే కడితే వచ్చే మొత్తం జమ అవుతుంది, లేదంటే లేదు’ అని చెప్పడంతో కంగారు పడింది.
‘మా సంఘం వాళ్లందరినీ అడిగి చెబుతాను’ అంటే ‘అంత టైమ్ లేదు ఇప్పుడే కట్టేయాలి. అనడంతో తన ఖాతా నెంబర్, ఫోన్‌కి వచ్చిన నెంబర్ చెప్పింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. అంతలో అదే బృందంలో ఉండే కమల పరిగెత్తుకుంటూ వచ్చి, ‘బ్యాంక్ వాళ్లు ఫోన్ చేశారు, ఆ తర్వాత వాళ్లేదో ఓటీపీ అని అడిగారు. చెప్పగానే నా ఖాతాలో పన్నెండువేల రూపాయలు కట్ అయ్యాయి. అవి మళ్లీ వస్తాయా?!’ అని అడిగింది. అప్పుడే సరోజిని అకౌంట్ నుంచి పదివేల రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది.
చూశారుగా... సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు ఇవి. అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ఖాతాలో ఉన్నదంతా దోచుకుంటున్న ఈ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు సైబర్ నిపుణులు.
అనుమానం రాకుండా దోపిడీ..
- సైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ కార్యాలయం నుండి మాట్లాడుతున్నామంటారు.
- ప్రభుత్వ పథకాల పేరిట పొదుపు సంఘాల మహిళలకు ఫోన్ చేసి తెలుగు భాషలో మాట్లాడుతుంటారు.
- వెంటనే వడ్డీ చెల్లిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని చెబుతారు.
- మీ ఖాతాలో కొంత నగదు నిల్వ ఉండాలని పొదుపు సంఘాల మహిళలకు ఫోన్లు చేస్తుంటారు.
- ‘తమ ఖాతాలో నగదు నిల్వ లేదు’ అని మహిళలు చెబితే ‘ప్రభుత్వం డబ్బులు ఇస్తామన్నా.. మీ ఖాతాలో డబ్బులు లేకపోవడం ఏంటని, బ్యాంకులో తగినంత నగదు లేకపోతే పథకం డబ్బులు రావని చెబుతుంటారు.
- నేరగాళ్ల మాటలు నమ్మి, మహిళలు తమ స్మార్ట్ ఫోన్‌లోని మనీ యాప్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు.
- ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఏ మాత్రం నమ్మకూడదు. మోసగాళ్ల బారిన పడి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి ఎవరికీ చెప్పకూడదు. ఈ సైబర్ మోసాల పట్ల గ్రామీణ మహిళలు అవగాహన పెంచుకోవాలి. తెలిసిన వారు గ్రామీణ మహిళలను సైబర్ నేరాల పాలిటపడకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయాలను తెలియజేయాలి.
వెబ్‌సైట్ అయితే..
ప్రభుత్వ సైట్‌లు.. అంటే, ఆయుష్మాన్ యోజన, కిసాన్ యోజన, జన్ ధన్ యోజన వంటి పోర్టల్‌లు, అనేక నకిలీ వెబ్‌సైట్‌లు ప్రజలను మోసగించడానికి స్కామర్‌లకు సాధారణ పద్ధతిగా మారాయి. ఈ మోసపూరిత వెబ్‌సైట్‌లు తరచుగా అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల రూపకల్పన, కంటెంట్‌ను అనుకరిస్తాయి. వారు ప్రభుత్వ పథకాలపై ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటారు.
అటువంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండటానికి, మీరు తీసుకోవలసిన కొన్ని చర్యలు:
- అధికారిక ప్రభుత్వ డొమైన్తో సరిపోలుతుందని నిర్ధారించుకోవడానికి వెబ్‌సైట్ యుఆర్‌ఎల్‌ని చెక్ చేయాలి. ప్రభుత్వ వెబ్‌సైట్‌లు సాధారణంగా భారతదేశంలో ‘gov.in‘ వంటి స్థిరమైన డొమైన్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. డొమైన్ లో అక్షరదోషాలు లేదా వైవిధ్యాలు ఉన్న వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
- వినియోగదారుల డేటాను రక్షించడానికి చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లు సురక్షిత కనెక్షన్‌లను (HTTP) ఉపయోగిస్తాయి. సైట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి అడ్రస్ బార్ లో ప్యాడ్‌లాక్ చిహ్నాన్ని తనిఖీ చేయాలి.
- అధికారిక మూలాలు: అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు లేదా అధికారిక కమ్యూనికేషన్ ఛానెల్‌లలో అందించిన సమాచారం, లింక్‌లను మాత్రమే నమ్మాలి. లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుమానాస్పద ఈ–మెయిల్స్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌ల నుండి సమాచారాన్ని షేర్ చేయడం మానుకోవాలి.
- మీకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ పథకాన్ని అధికారిక మూలాల నుండి నేరుగా పరిశోధించాలి. ఇది మీకు అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియపై స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తెలియని వెబ్‌సైట్‌ల సమాచారంపై మాత్రమే ఆధారపడకూడదు.
- పథకం లేదా ఆఫర్ ప్రామాణికత గురించి మీకు ఖచ్చితంగా తెలియకుంటే, వివరాలను ధృవీకరించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారిక హెల్ప్‌లైన్ లేదా కస్టమర్ సేవను సంప్రదించాలి.
- ప్రభుత్వ పథకాలకు సాధారణంగా రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు కోసం ఎలాంటి ముందస్తు చెల్లింపులు అవసరం లేదు. ఏదైనా ప్రయోజనాన్ని అందించే ముందు ఫీజు చెల్లించమని వెబ్‌సైట్ మిమ్మల్ని అడిగితే జాగ్రత్తపడాలి.
- ఆఫర్ నిజం కానంత మంచిగా అనిపిస్తే, అది బహుశా అలానే ఉంటుంది. స్కామర్‌లు బాధితులను తమ ఉచ్చులోకి లాగేందుకు తరచుగా మనోహరమైన వాగ్దానాలను ఉపయోగిస్తారు.
- ఈ మోసాల గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా బాధితులుగా పడకుండా వారికి అవగాహన కల్పించండి.
- మోసపోయామని గ్రహిస్తే బాధితులు వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. 1930కి కాల్ చేయవచ్చు. https://www.cybercrime.gov.in ద్వారా రిపోర్ట్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment