దృశ్యం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్‌కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్‌కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి.
మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది.
సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది.
ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్‌తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి.
బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది.
సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు
కట్టింది.
‘నా ప్రాజెక్ట్‌లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి.
స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్‌లోని మిధాపూర్‌లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు.
కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి.
‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి.
భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది.
లక్ష్యంతో కూడిన ప్రయాణం
భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్‌స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది.
– దీప్తి అస్థాన
వారి జీవితంలో భాగం అవుతాను
కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది.
ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం.
– దీప్తి అస్థాన
Comments
Please login to add a commentAdd a comment