కొన్ని తరాల వెనక్కి వెళితే...యువతలో దేశభక్తి వ్యక్తీకరణ పద్యం, పాట, కవిత, నినాదాల రూపంలో కనిపించేది. ఇక నేటి యువత విషయానికి వస్తే... సోషల్ మీడియా క్యాంపెయిన్స్, డిజిటల్ ఎంగేజ్‌మెంట్, వర్చువల్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ద్వారా తమలోని దేశభక్తిని చాటుకుంటున్నారు...
దేశభక్తి భావాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది యువత. ఒకప్పుడు మన దేశానికి మాత్రమే పరిమితమైన దేశాభిమాన భావాలు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ వీరోచిత పోరాటగాథలను సోషల్ మీడియా వేదికగా యువత గుర్తు తెచ్చుకుంటుంది. కంటెంట్ క్రియేషన్ ద్వారా కూడా తమలోని దేశభక్తి భావాలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు. ‘జెన్–జెడ్ ఆర్టిస్టులు తమలోని దేశభక్తి భావాలను పాటలు, చిత్రాల రూపంలో ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచ ధోరణులను గమనిస్తూ, విశ్లేషిస్తూనే కంటెంట్ క్రియేషన్‌కు సంబంధించి దేశీయతకు ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటుంది కంటెంట్ క్రియేటర్ జాహ్నవి తివారి.
బెంగళూరుకు చెందిన 23 సంవత్సరాల ప్రణవ్ స్కూల్ రోజుల్లో ‘హిస్టరీ రొస్టు కంటే రెస్టు మేలు’ అన్నట్లుగా ఉండేవాడు. బోర్‌గా ఫీలయ్యేవాడు. అయితే ఇప్పుడు హిస్టరీ అనేది అతడి ఫెవరెట్ సబ్జెక్ట్. హిస్టరీ పుస్తకాలను ఇష్టంగా చదువుతుంటాడు. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్, ది లాస్ట్ మొఘల్, ది వండర్ దట్ వాజ్ ఇండియా...మొదలైనవి అతడి అభిమాన పుస్తకాలు. ‘ఒక దేశ గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే ఆ దేశచరిత్ర తెలుసుకోవాలి అనే మాట విని చరిత్ర పుస్తకాలపై ఆసక్తి పెరిగింది. బుక్‌లెట్‌లాంటి చిన్న పుస్తకాలతో మొదలు పెట్టి ఇప్పుడు వందల పేజీలు ఉన్న పెద్ద పుస్తకాలు కూడా చదువుతున్నాను’ అంటున్నాడు ప్రణవ్.
‘దేశాన్ని ముందుకు నడిపించే ప్రతి మంచిపని దేశభక్తిగానే పరిగణించాలి. పర్యావరణ స్పృహ నుంచి స్టార్టప్‌ల వరకు ఏదైనా కావచ్చు’ అంటున్న ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ తేజస్వీ పర్యావరణ హిత, సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇక సినిమాలకు సంబంధించి ‘యే జో దేశ్ హై తేరా, స్వదేశ్ హై తేరా’ (స్వదేశ్), ఆప్నీ అజాదీ కో (లీడర్–1964), యే మేరా ఇండియా–ఐ లవ్ మై ఇండియా (పర్‌దేశ్)...మొదలైన పాటలను ఎక్కువగా షేర్ చేస్తుంటారు.
జీ మ్యూజిక్ కంపెనీ ‘సలామ్ ఇండియా’ ‘భారత్ సలామ్’ టీ–సీరిస్ ‘ఇండిపెండెన్స్ డే స్పెషల్’ టిప్స్ ‘ఇండిపెండెన్స్ డే సాంగ్స్’ సారేగామా మ్యూజిక్ ‘రిపబ్లిక్ డే స్పెషల్’ నైంటీస్ గానే ‘ఐ లవ్ మై ఇండియా–రిపబ్లిక్ డే సాంగ్స్’ ఆల్బమ్‌లకు యూట్యూబ్‌లో యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సింగర్–సాంగ్ రైటర్ వినీత్ సింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో రికార్డ్‌లు బ్రేక్ చేయడంలో ఘనాపాఠీ.
‘యూరోపియన్ టాప్ 100 రేడియా చార్ట్స్’లో అతడి పాటలు టాప్‌లో నిలిచాయి. కొత్త దేశభక్తి గీతం ‘బార్న్ ఇన్ భారత్, బార్న్ ఫర్ ఇండియా’తో ముందుకు వచ్చాడు వినిత్. డైనమిక్ వోకల్స్, ఎనర్జిటిక్ బేస్‌లైన్‌తో కూడిన ఈ పాట నవభారతాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ‘దేశభక్తి పాటలు స్ఫూర్తిని ఇస్తాయి. దేశానికి నా వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పాన్ని ఇస్తాయి’ అంటున్న దిల్లీకి చెందిన అద్విక్ దేశభక్తి పాటలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘దేశభక్తి గీతాలు కొన్ని రోజులకు మాత్రమే పరిమితమైనవి కావు. అన్ని రోజుల్లో వినాల్సిన విలువైన గీతాలు’ అంటాడు 24 సంవత్సరాల అద్విక్.
(చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!)
Comments
Please login to add a commentAdd a comment