తల్లిదండ్రులు లేరు. అండ దండలు లేవు. నానమ్మ నేటికీ పల్లెలో ఆకుకూరలు అమ్ముతుంది. కాని 24 ఏళ్ల ఎస్తేర్ రాణి గుంటూరు జిల్లా వేమూరు నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా బాడీబిల్డర్ అయ్యింది. ఇటీవల చెన్నైలో జరిగిన‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్’ పోటీలో గోల్డ్‌మెడల్ సాధించింది. హైదరాబాద్‌లో జిమ్ ట్రయినర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎస్తేర్ ఏ సాయం అందక గుండె మండుతోందని అంటున్నది.
ఎస్తేర్ 2021లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి హైదరాబాద్ వచ్చింది. కేవలం ఇంటర్ వరకూ చదువుకుంది. ఏదో ఒక పని చేయాలనుకుంటే ఏం చేయాలో తెలియలేదు. ఆమెకు సిటీలో ఎవరూ తెలియదు. స్కూల్లో కాలేజీలో అథ్లెటిక్స్‌లో మంచి ్రపావీణ్యం ఉంది. హామర్ త్రోలో నేషనల్స్ వరకూ వెళ్లింది.
ఆ ఫిట్‌నెస్ వల్ల జిమ్‌లో పనికి కుదిరి ట్రయినర్‌గా మారింది. ‘‘కొద్దిపాటి జీతం. గుర్తింపు లేని పని. ‘ఏదైనా సాధించాలనే నా తపనకు ఆ పని సరిపోలేదు. ఆ సమయంలోనే మహిళా బాడీ బిల్డర్ల మీదకు నా దృష్టి వెళ్లింది. జాతీయస్థాయి కాంపిటీషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా లేకపోవడాన్ని గమనించాను. ఇదే ఎందుకు నేను సాధించకూడదు అని భావించి ఎవరికీ చెప్పకనే ఎవరి అంగీకారం లేకనే నాకై నేనుగా కృషి చేసి ఎదిగాను’ అంటుంది ఎస్తేర్.
అన్నీ ఆటంకాలే
మహిళా బాడీగార్డ్ కావాలంటే పర్సనల్ ట్రయినర్ ఉండాలి. అందుకు నెలకు పది వేల నుంచి భారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదీగాక నిర్దిష్ట డైట్ తీసుకోవాలి. రోజుకు కనీసం 7 గంటలు వర్కవుట్స్ చేయాలి. అవన్నీగాక మహిళలు బాడీ బిల్డింగ్ చేసే సమస్యలు అనేకం ఉంటాయి. ‘అయినా సరే అప్పుచేసి కండలు పెంచాను. రెండేళ్లలోనే తగినట్టుగా తయారయ్యి మొన్నటి సెప్టెంబర్‌లో వరల్డ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్ (డబ్లు్య.ఎఫ్.ఎఫ్) నిర్వహించిన నేషనల్స్ బాడీబిల్డింగ్ పోటీల్లో ‘స్పోర్ట్స్ మోడల్’ కేటగిరీలో ద్వితీయస్థానంలో రజత పతకం సాధించాను.
ఆ ఉత్సాహంతోనే ఈనెల 9,10 తేదీల్లో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డబ్లు్య.ఎఫ్.ఎఫ్ నిర్వహించిన ‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్ ’ బాడీబిల్డింగ్ ఫిట్‌నెస్ చాంపియన్ షిప్ అండ్ మోడల్స్’ పోటీల్లో ‘మిస్ ఫిగర్’ కేటగిరీలో ప్రథమ స్థానంలో బంగారు పతకం గెలుచుకున్నాను. నా కేటగిరిలో దేశవ్యాప్తంగా పోటీ ఉన్నా నాకు స్వర్ణం రావడం మర్చిపోలేను’ అంటుంది ఎస్తేర్.
దొరకని సాయం
బాడీ బిల్డింగ్‌లో నిరంతర సాధన ఉండాలి. రోజుకు తీసుకునే ఆహారానికే 1500 నుంచి రెండు వేలు ఖర్చు అవుతుంది. ‘ఉద్యోగం చేస్తే సాధన మిస్ అవుతుందని ఫ్రీలాన్స్ జిమ్ ట్రయినర్‌గా పని చేస్తున్నాను. ఆసియా స్థాయి, ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ వరకూ వెళ్లాలని నా కల. ఊళ్లో మా నానమ్మ నేటికీ ఆకుకూరలు అమ్ముతుంది. మాకు సరైన తిండి లేదు. నా తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదు. మహిళా బాడీ బిల్డింగ్ అంటే ఎన్నో సవాళ్లు.
బంధువులు అందరూ నన్ను నిరోధించారు. అబ్బాయిగా మారిపోయానని సందేహించారు. ఇలా అయితే ఎవరు పెళ్లి చేసుకుంటారన్నారు. కాని నా గెలుపులను చూసి వారు ఇప్పుడు సంతోషిస్తున్నారు. మన సమాజంలో స్త్రీ తన శరీరాన్ని సరైన వస్త్రధారణలో ఉంచుకోవాలి. అందుకే ఎక్కువమంది స్త్రీలు ఆ రంగంలోకి రారు. ఏదైనా సాధించాలని వచ్చిన నావంటి వారిని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వ బాధ్యత. అందరికీ అదే నా విన్నపం’ అంది ఎస్తేర్. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
‘మహిళా బాడీబిల్డింగ్‌లో ఉత్తర భారతదేశం వారు ముందంజలో ఉన్నారు. మనకు ప్రతిభ ఉన్నా పైస్థాయిలో మనల్ని ముందుకు తీసుకెళ్లేవారు లేరు. మçహారాష్ట్ర, హర్యాణ మహిళా బాడీబిల్డర్లు ఎంతో సౌకర్యంగా కెరీర్‌లో రాణిస్తున్నారు’ – ఎస్తేర్
Comments
Please login to add a commentAdd a comment