జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ ఎస్తేరు రాణి
సృష్టికి మూలం స్త్రీ. ప్రతి మగాడి గెలుపు వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ ఈ వనితల విజయం వెనుక వారి స్వయంకృషి ఉంది. అచెంచల ఆత్మవిశ్వాసం.. మొక్కవోని దీక్ష.. కఠోర సాధనతో వీరు తాము అనుకున్న లక్ష్యం సాధించారు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టారు. ఉరిమే ఉత్సాహంతో ముందుకురికారు. జయభేరి మోగించి విజయతీరాలు చేరారు. తమ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రతిభ కనబరిచారు. మహిళా లోకం సగర్వంగా తలెత్తుకునేలా.. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు.
చదవండి: ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం
తెనాలి(గుంటూరు జిల్లా): రావూరి ఎస్తేరు రాణి.. ఈమె జీవితం వడ్డించిన విస్తరి కాదు.. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యారు. పేదరికం శాపంలా వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. జిమ్ ట్రైనర్‌గా ఉపాధి పొందుతూనే బాడీబిల్డర్‌గానూ రాణించారు. రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఈనెల 11న సిక్కింలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేరురాణి సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను, ఆమె తమ్ముడినీ నాయనమ్మ చేరదీసింది. ఇద్దరినీ చదివించింది.
గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరు రాణి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసేవారు. కొద్దినెలల్లోనే అక్కడ జిమ్ ట్రైనర్‌గా మారారు. ఆ తర్వాత శరీర సౌష్టవ పోటీలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో ఏడాదిన్నరలోపే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తాచాటారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు.
ప్రముఖుల ప్రోత్సాహం
ఎస్తేరురాణికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ రూ.లక్ష, అడిషనల్ డీజీపీ శ్రీధర్, సునీల్ కలిసి రూ.50 వేలు చొప్పున సాయాన్ని సమకూర్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు.
నిత్యం ఆరు గంటల కఠోర సాధన
ఎస్తేరురాణి రోజూ ఆరు గంటలు కఠోర సాధన చేస్తారు. ఈ సాధన ఫలించాలంటే రోజూ కిలో చికెన్, ఇరవై గుడ్లు మెనూలో ఉండాలి. వచ్చే జీతం సరిపోకపోయినా.. కొందరి సాయంతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. నేషనల్స్‌లో పతకం సాధించి ఉద్యోగం పొందాలనేదే లక్ష్యమని ఎస్తేరు రాణి చెబుతున్నారు.
ప్రతిభా ‘మాధవీ’యం
తెనాలి: చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గాలి మాధవీలతకు ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల జాబితాను ప్రకటించింది. అందులో మాధవీలతకు స్థానం లభించింది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఈ నెల 3న ఈ జాబితాను ప్రకటించారు.
వీరి స్ఫూర్తిదాయక సేవలను ‘షి ఈజ్ 75 విమెన్ ఇన్ స్టీమ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురానున్నారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు వీరి వీడియోలను ప్రదర్శిస్తారు. సదస్సులో వీరిని పరిచయం చేస్తారు. ఆ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్‌లు, కళాకారులు, సమాజ సేవకులు, మానవతావాద డాక్టర్ల సరసన చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కనకారెడ్డి, శివలీల కోడలు మాధవీలతకు స్థానం లభించింది.
సాధారణ రైతు కుటుంబం నుంచి..
ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం మాధవీలత స్వస్థలం. 1971లో సాధారణ రైతు కుటుంబంలో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జని్మంచారు. జేఎన్‌టీయూ, కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, స్వగ్రామంలో తొలి ఇంజినీరుగా గుర్తింపును పొందారు. ఎన్‌ఐటీ, వరంగల్‌లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సర్వోత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్‌సీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్‌పర్సన్‌గా మాధవీలత సైన్స్‌ని, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువచేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో జమ్ములో గల చీనాబ్ నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో మాధవీలత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే గృహిణిగా, అమ్మగా తన పాత్రపోషిస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న మాధవీలత అభిరుచిలోనూ తనదైన శైలి కబరుస్తుంటారు. కవితలనూ రాస్తుంటారు.
‘ఆశా’వహ దృక్పథంతో..
గుంటూరు వెస్ట్: ఆశావహ దృక్పథమే ఆమెను ముందుకు నడిపింది. పరిస్థితులకు ఎదురీదుతూనే ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. రూ.200తో వ్యాపారం మొదలు పెట్టి రూ.40లక్షల టర్నోవర్‌కు చేర్చారు. ఆమె పేరు ఆశా సేకూరు. ఊరు గుంటూరు. సహజసిద్ధ ఉత్పత్తుల తయారీతో సమున్నత ప్రగతి సాధించారు. ఇప్పుడు విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆశా విజయగాథ ఆమె మాటల్లోనే..
ఆలోచనాత్మకంగా ముందడుగు..
2008లో విజయ్ ప్రసాద్‌తో పెళ్లయింది. నేను గర్భిణిగా ఉండగా ఆయన నడిపే యానిమేషన్ స్టుడియో ఆర్థిక ఇబ్బందులతో మూతపడింది. ఎనిమిదో నెలలోనే కూతురు తన్వీ పుట్టింది. సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా బెదిరి పోలేదు. ఆ సమయంలో పాప రంగు రావాలని కొన్ని లోషన్స్ వాడాను. అవి వికటించి ర్యాషెస్ వచ్చాయి. అమ్మమ్మకు చెబితే వంటగదిలో లభించే కొన్ని వస్తువులతో సున్నిపిండి చేసి ఇచ్చింది. ఇది పాపకు బాగా పనిచేసింది. అప్పుడే సహజసిద్ధ ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సున్నిపిండి తయారీకి కేవలం రూ.200 ఖర్చయింది.
ఆచరణ ఇలా..
ఆ తర్వాత పాప శరీరానికి బాదం ఆయిల్ మంచిదని రూ.5.000 వెచ్చించి చత్తీస్‌గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్‌్రస్టేట్ మిషన్ కొన్నాను. కేజీ బాదం పప్పును పిండితే కేవలం 150 గ్రాములే వచ్చింది. దానిలో మరికొన్ని వస్తువులు కలిపి పాపకు వాడాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత సహజసిద్ధ ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదిక్ కాస్మొటాలజీ, ఆర్గానిక్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు చేశా. సొంతంగా సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి మొదట నా బిడ్డకు వాడేదాన్ని. వాటి ఫలితాల ఆధారంగా తన్వీ నేచురల్స్ పేరిట సంస్థ స్థాపించి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టా. ప్రస్తుతం 25 రకాల వస్తువులు తయారు చేస్తున్నా. సంస్థ టర్నోవర్ ఇప్పుడు రూ.40లక్షలు. విదేశాలకూ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నా. ప్రస్తుతం 600 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. యువతకూ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలు వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment