మురికి వాడలో కటిక దారిద్యం మధ్య పెరిగాడు. తండ్రి మరణం, తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన స్థితి. ఏకంగా ఐదుగురు సంతానం. ఒక్కరోజు కూడా కడుపు నిండా తినలేని ధీన స్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి చేసే ఇడ్లీ అమ్మే వ్యాపారంలో చేదోడుగా ఉంటునే ఐఐఏం వంటి ఉన్నత చదువులు చదివాడు. చివరికీ స్వంతంగా ఓ ఫుడ్ కేటరింగ్ సర్వీస్ పెట్టి.. తనలాంటి మురికి వాడ పిల్లల్నే స్టాఫ్‌గా పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతడెవరంటే..
చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్‌బాబు తల్లి, నలుగురు తోబుట్టువులతో కలసి మురికి వాడలో జీవించేవాడు. తండ్రి మరణించడంతో తల్లే కుటుంబ జీవనాధారం. తనపై ఆధారపడిని ఐదుగురు పిల్లల కడుపు నింపేందుకు ఆమె రోజుకు మూడు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఇక శరత్ తన తల్లికి మురికివాడలో ఇడ్లీలు అమ్మే విషయంలో సాయం చేస్తుండేవాడు. తనతల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన శరత్ బాగా చదువుని ఎట్టి పరిస్టితుల్లో నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చేవాడు.
ఎందుకంటే..? తల్లి గ్రాడ్యుయేట్ అయ్యుంటే ఏదో ఉద్యోగం చేసి పోషించగలిగేది ఇన్ని పాట్లు పడేది కాదు కదా అని బాధపడేవాడు. అందుకే అతడు తినడానికి తిండి లేని ఎన్నో రాత్రుళ్లు గడుపుతూ కూడా చదవడం మాత్రం మానలేదు. అలా పదోతరగతిలో క్లాస్ టాపర్‌గా నిలిచి మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఆంగ్లంలో మంచి ప్రావిణ్యం లేకపోవడంతో స్నేహితుల ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా తన చదువును సాగించాడు. అలా బిట్స్ పిలానీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే పోలారీస్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు సరిగ్గా 30 నెలలు పనిచేసి ఇంటి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలనే ఆశ కలిగింది. దీంతో పోలారీస్‌లో ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కి ప్రీపేరయ్యాడు. అలా మొదటి ప్రయత్నంలో విఫలమైన చివరికీ క్యాట్ ఉత్తీర్ణుడై అహ్మదాబాద్ ఐఐఏంలో ఎంబీఏలో చేరాడు. అక్కడ హాస్టల్ మెస్ కార్యదర్శి పదవికి ఎంపికయ్యాడు. ఇదే అతడికి ఆహారాన్ని తయారు చేసే సంస్థను నిర్వహించడం ఎలా అనేదానిపై అవగాహన ఏర్పడేలా చేసింది. ఇక విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే లక్షల ప్యాకేజీలతో ఎన్నో కార్పోరేట్ ఉద్యోగాలు వచ్చినా అటువైపుకి అసలు వెళ్లలేదు.
తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం రూ. 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. తాను పెరిగిన మురికివాడలోనే ఓ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా తనలా మురికివాడలో పెరిగిన వారే.
బాల్యమంతా కటిక దారిద్య్రం మధ్యే గడిచింది. ఆ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు. ఓ పక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో భయాన కష్టాలు, సమస్యలు చవి చూశాడు. అయినప్పటికీ ఎన్నడూ బాబోయ్! నావల కాదని పారిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైన ఈ కష్టం నుంచి గట్టేక్కిస్తే చాలని తప్పన పడ్డాడు. అందుకు చదువొక్కటే మార్గం అని భావించాడు. కటిక దారిద్య్రాన్ని భరిస్తూనే ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పైగా తన మూలలను మర్చిపోకుండా తనలాంటి వారికే జీవనోపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు శరత్ బాబు. ఇతడి కథ సమస్యలతో ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తుంది. పైగా అచంచలంగా కష్టపడితే ఎప్పటికైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చాటి చెబుతోంది కదూ.!
(చదవండి: నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!)
Comments
Please login to add a commentAdd a comment