సూర్యచంద్రులు భూమి మీద కాకుండా ఆకాశంలో ఎందుకు ఉంటారో తెలుసా? బెడ్‌బగ్(నల్లి) బాధ భరించలేకే’ అంటాడు కవి చమత్కారంగా.‘బెడ్ బగ్’ సంగతి సరే, మరి ‘కంప్యూటర్ బగ్’ మాటేమిటి? అది బగ్ కాదు దెయ్యం అంటే కాదనేదేముంది!ఈ దెయ్యాన్ని చూసి పారిపోవాల్సిన పనిలేదు...పట్టుకుంటే చాలు డబ్బులే డబ్బులు!
మనం ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాం. ‘ఏ లోపం లేకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నాం’ అని మురిసిపోతాం. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్నట్లుగా మన ఇల్లు మనకు ముద్దుగానే కనిపించి ఏ లోపాన్ని కనిపించనివ్వదు. ‘మా ఇంటి నిర్మాణంలో లోపం కనిపెడితే డబ్బులు ఇస్తాం’ అని ఆ ఇంటియజమాని ప్రకటించాడు. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ‘ఇదిగో ఫలాన చోట లోపం ఉంది’ అని చూపించారనుకోండి, సదరు యజమాని ఆ వ్యక్తికి నజరానా ఇస్తాడు. ఇలాగే...
సైబర్ క్రిమినల్స్ చొరబడకుండా ఉండేందుకు ప్రముఖ టెక్‌కంపెనీలు సెక్యూరిటీ ప్రోగ్రామ్స్‌ను అప్‌డేట్ చేస్తుంటాయి. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాలను కనిపెట్టిన వారికి కంపెనీలు నగదు బహుమతిని ఇస్తుంటాయి. ‘బగ్ బౌంటి’పై యూత్ ఆసక్తి చూపుతుంది. బహుమతుల గెలుపులో ‘యువతరం’ ముందుంటుంది. మైక్రోసాఫ్ట్,ఫేస్‌బుక్, యాహూ, మోజిల్లా కార్పోరేషన్, స్క్వైర్... మొదలైన దిగ్గజ సంస్థలు ‘బగ్‌బౌంటీ’లో భాగంగా కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నాయి. మరోవైపు ‘యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్’లాంటి ఏజెన్సీలు కూడా ‘బగ్ బౌంటీ’లు ప్రకటిస్తున్నాయి. సింగపూర్ గవర్నమెంట్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటి)కి సంబంధించిన 13 విభాగాలలో ‘బగ్ బౌంటీ’ పథకం క్రింద ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‘బగ్‌బౌంటీ’ ప్రోగ్రాం క్రింద వందకోట్లకు పైగా కేటాయించింది. 58 దేశాల్లో 340 మంది రివార్డ్‌లను గెలుచుకున్నారు. గూగుల్ బగ్‌బౌంటీ రివార్డ్స్ కోసం 50 కోట్లకు పైగా కేటాయించింది. 62 దేశాల్లో 662 మంది రివార్డ్‌లు గెలుచుకున్నారు. బగ్ హంటర్స్ కోసం గూగుల్ ఇటీవలే బగ్‌హంటర్స్.గూగుల్.కామ్ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. మన దేశం విషయానికి వస్తే...మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మయూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బగ్’ కనిపెట్టి 22 లక్షలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. ఇరవై సంవత్సరాల సెల్ఫ్–టాట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఆదిత్‌సింగ్ (దిల్లీ) మైక్రోసాఫ్ట్ అజ్యూర్స్ క్లౌడ్‌ప్లాట్‌ఫామ్‌లో ఆర్‌సీయి (రిమోట్‌కోడ్ ఎగ్జిక్యూషన్) బగ్‌ను కనిపెట్టి 22 లక్షల పైచిలుకు బహుమతిని గెలుచుకుంది. చెన్నైకి చెందిన లక్ష్మణ్ ముత్తయ్య మైక్రోసాప్ట్ ‘ఐడెంటిటీ బౌంటీ ప్రోగ్రాం’లో సుమారు 22 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. మధురైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి టీకే కిశోర్ ఫేస్‌బుక్‌లో ప్రైవసీకి భంగం కలిగించే బగ్‌ను కనిపెట్టి లక్ష రూపాయల వరకు గెలుచుకున్నాడు.
22 లక్షలు ఎక్కడా? లక్ష రూపాయలు ఎక్కడా? అని ఆశ్చర్యపోతున్నారా!
విషయమేమిటంటే ‘బగ్’ను కనిపెట్టగానే లక్షలకు లక్షలు ఇస్తారని కాదు. ‘బగ్’ వల్ల ఎంత ఎక్కువ ముప్పు ఉంది? అనేదాన్ని బట్టే బహుమతి మొత్తం ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీలో కొమ్ములు తిరిగిన వారు మాత్రమే బౌంటీలో బహుమతులు గెలుచుకోవడం లేదు. ఆసక్తి ఉండి, అది అధ్యయనంగా మారి, విశ్లేషణ సామర్థ్యం, సృజనతో సెల్ఫ్–టాట్ సైబర్ ఎక్స్‌పర్ట్‌లుగా తమను తాము మలుచుకున్న అదితిలాంటి వారు ఎందరో ఉన్నారు. ‘మాకు కాస్తో కూస్తో తెలుసు. ఇంకా తెలుసుకోవాలని ఉంది’ అని ఆశించేవారి కోసం ఆన్‌లైన్ బగ్‌బౌంటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక మీదే ఆలస్యం.
Comments
Please login to add a commentAdd a comment