గుర్లీన్ చావ్లా
2021 సంవత్సరపు మొదటి ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోడీ గుర్లీన్ చావ్లాను ప్రస్తావించారు. ‘ఆమె బుందేల్‌ఖండ్ ఆశాజ్యోతి’ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో వ్యవసాయం దుర్భరంగా ఉంది. ఉష్ణోగ్రత ఎక్కువ. వానలు, నీటివసతి తక్కువ. అలాంటి చోట సంప్రదాయ పంటలే కష్టం. కాని లా చదువుతున్న 23 ఏళ్ల గుర్లిన్ లాక్‌డౌన్‌లో తన ఊరు ఝాన్సీ వచ్చి ఊరికే ఉండకుండా తండ్రి పొలంలో స్ట్రాబెర్రీ వేసింది. విజయవంతంగా పండించింది. ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఇవాళ ఆమె పేరు ఉత్తరప్రదేశ్‌లో మారుమోగుతోంది.
లాక్‌డౌన్ ఎవరికి ఏం హాని చేసినా బుందేల్‌ఖండ్‌కి ఒక మేలు చేసింది. ఒక లా చదివే అమ్మాయి– గుర్లిన్ చావ్లా అక్కడ స్ట్రాబెర్రీ పంటను పండించి ఆదాయం గడించవచ్చని రైతులకు అర్థమయ్యేలా చేసింది. నిజంగా ఇది అనూహ్యమైన విషయమే. ఎందుకంటే స్ట్రాబెర్రీ 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఎండలు కాసే చోట పండదు. నీటి వసతి కూడా ఉండాలి. బుందేల్‌ఖండ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువే అయినా నీరు తక్కువే అయినా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని గుర్లిన్ ఈ ఘనత సాధించింది. అందుకే ఇప్పుడు ఆమె అక్కడ ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఖ్యాతి పొందింది.
ఇంటి పంటతో మొదలు
గుర్లిన్ చావ్లాది బుందేల్‌ఖండ్ (ఉత్తరప్రదేశ్ దక్షిణాది ప్రాంతం)లో ఝాన్సీ. పూనెలో లా చదువుతోంది. లాక్‌డౌన్‌లో కాలేజీ మూతపడటంతో ఇంటికి చేరుకుంది. ఇంట్లో తండ్రి టెర్రస్ మీద ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం గమనించి ఎలాగూ ఖాళీగా ఉంది కనుక తోటపనిలో పడింది. రసాయనాలు లేని తాజా కూరగాయలు ఇంట్లోనే దొరుకుతున్నాయి అని అర్థం చేసుకుంది. ‘ఇలాంటి ఆరోగ్యకరమైన కూరగాయలు ఝాన్సీలో ప్రతి ఒక్కరూ తినే వీలు కల్పించాలి కదా’ అని తండ్రితో అంది. తండ్రి ‘అదంత సులభం కాదు తల్లీ’ అని గుర్లిన్‌తో అనేవాడు.
స్ట్రాబెర్రీలను కోస్తున్న గుర్లీన్ చావ్లా
మార్చిన స్ట్రాబెర్రీ
ఒకరోజు గుర్లిన్ 20 స్ట్రాబెర్రీ మొలకలను తెచ్చి తన ఇంటి డాబా మీద ఉన్న తోటలో నాటింది. కోకోపీట్ ఉన్న మట్టికుండీలలో వాటిని వేసింది. ‘ఇవి బతకవు’ అని అందరూ అన్నారు. ‘కాని ఆ మొక్కలు బతికాయి. ఇంకా ఆశ్చర్యంగా కాయలు కూడా కాశాయి. అవి సైజులు చిన్నగా, జ్యూస్ తక్కువగా ఉన్నా రుచిగా ఉన్నాయి. అరె... వీటిని పొలంలో ఎందుకు పండించకూడదు అనుకుంది గుర్లిన్. తండ్రితో పోరు పెట్టడం మొదలెట్టింది. తండ్రికి ఝాన్సీ దాపునే నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. అందులో సేద్యం ఏమీ చేయడం లేదు. ఝాన్సీ ఉత్సాహం చూసి ‘కావాలంటే అందులో ట్రై చెయ్’ అన్నాడు తండ్రి. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది గుర్లిన్. 2020 అక్టోబర్‌లో సేంద్రియ పద్ధతి ద్వారా ఒకటిన్నర ఎకరాలో స్ట్రాబెర్రీ పంట వేసింది. ఈ విషయం రైతులకు వింత వార్త అయ్యింది. కాని గుర్లిన్‌కు తెలుసు.. తాను ఎలాగైనా విజయం సాధిస్తానని.
పది వేల కిలోల దిగుబడి...
జనవరి నెల వచ్చేనాటికి స్ట్రాబెర్రీని పండించడంలో మెళకువలన్నీ తెలుసుకుంది గుర్లిన్. ‘ఈ సీజన్‌లో పది వేల కిలోల దిగుబడిని ఆశిస్తున్నాను. ఇప్పుడు రోజూ కాయను కోసి మార్కెట్‌లో కిలో 250 రూపాయలకు అమ్ముతున్నాను’ అని చెప్పిందామె. ఆమె పొలంలో స్ట్రాబెర్రీ కాయ పెద్దదిగా కాయడమే కాదు రంగులో, జ్యూస్‌లో మరింత ఫలవంతంగా ఉంది. ‘రైతులు ఒక పంట ఒకే పద్ధతిలో పోకుండా భిన్నంగా ఆలోచిస్తే ఇలాంటి విజయాలు సాధించవచ్చు’ అని కూడా గుర్లిన్ అంది. అంతే కాదు ఒకవైపు స్ట్రాబెర్రీ వేసి మరోవైపు మిగిలిన మూడు ఎకరాల్లో ఆమె సేంద్రియ పద్ధతిలో బెంగళూరు మిర్చి, టొమాటో, కాలిఫ్లవర్ పండిస్తోంది. ‘చదువుకున్న యువత కూడా సేద్యం చేయడానికి ఆసక్తిగా ఉంది. కాకపోతే ప్రభుత్వం నుంచి వారికి సపోర్ట్ కావాలి’ అని గుర్లిన్ అంది.
స్ట్రాబెర్రీ అంబాసిడర్
జనవరి 16 నుంచి ఝాన్సీలో ‘స్ట్రాబెర్రీ ఫెస్టివల్’ జరుగుతోంది. ప్రభుత్వమే దానిని నిర్వహిస్తోంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో స్ట్రాబెర్రీని ప్రోత్సహించడానికి చేస్తున్న ఈ ఉత్సవానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గుర్లిన్‌ను ‘స్ట్రాబెర్రీ అంబాసిడర్’గా ప్రకటించారు. అంతే కాదు ప్రధాని మోడి తన మన్ కీ బాత్‌లో గుర్లిన్‌ను ప్రస్తావించారు. దాంతో గుర్లిన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. భవిష్యత్తులో ఈమె కథా ఒక బయోపిక్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment