‘అబ్బ...ఖాళీ సమయం దొరికింది. ఎంజాయ్ చేయాలి’ అనుకునేవారు కొందరు. ‘ఖాళీ సమయం దొరి కింది... ఏదైనా నేర్చుకోవాలి’ అనుకునేవారు మరికొందరు. అద్రిత్‌రావు రెండో కోవకు చెందిన కుర్రాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో దొరికిన విరామంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎన్నో సాంకేతిక విషయాలను స్వయంగా నేర్చుకున్నాడు. కోడింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు...
‘కోడింగ్ మేధావి’గా పేరుగాంచిన ఇండియన్–అమెరికన్ అద్రిత్‌రావు యాప్ డెవలప్‌మెంట్ వరల్డ్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన పదహారు సంవత్సరాల అద్రిత్ ఎన్నో యాప్‌లను రూపొందించి టెక్ దిగ్గజం యాపిల్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్‌కేర్‌కు సంబంధించిన కట్టింగ్–ఎడ్జ్ రిసెర్చ్‌లో భాగం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో కోడింగ్‌తో ప్రయాణం ప్రారంభించాడు అద్రిత్. ‘బ్లాక్ ప్రోగ్రామింగ్’తో కంప్యూటర్ సైన్స్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ఇష్టం అయింది. ఆ ఇష్టం శోధనకు మూలం అయింది.
కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అద్రిత్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించి ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అద్రిత్‌కు బోలెడు ఖాళీ సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్, ఇతర ఆన్‌లైన్ వనరుల ద్వారా యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల వయసులో ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ సిఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌లో అద్రిత్‌రావు విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలిసే అరుదైన అవకాశం లభించింది.
‘అదొక ఉత్తేజకరమైన అనుభవం. యాప్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరణ ఇచ్చింది’ కుక్‌తో జరిగిన మీటింగ్ గురించి చెబుతాడు అద్రిత్. సినిమాలు, టీవీ షోలను చూడడానికి ప్రేక్షకులకు సహాయపడే యాప్‌ల నుంచి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడే యాప్‌ల వరకు...అద్రిత్ ఖాతాలో వినూత్న యాప్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బధిరులు ఉన్నారు, కమ్యూనికేషన్ విషయంలో ఇతరులతో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అధ్యయనం చేసిన అద్రిత్‌కు వారి హావభావాలను ఐఫోన్ కెమెరా ద్వారా స్పీచ్‌గా మార్చాలనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ‘సిగ్నర్’ అనే యాప్ ద్వారా తన ఆలోచనను నిజం చేసుకున్నాడు.
పదమూడు సంవత్సరాల వయసులో చదివిన ఒక వ్యాసం ద్వారా అద్రిత్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉయోగించాలనే ప్రయత్నంలో స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీలో రిసెర్చ్ ఇంటెర్న్‌షిప్ ప్రారంభించాడు అద్రిత్. వ్యాధులను గుర్తించే, స్టాండ్‌ఔట్ ఇన్నోవేషన్‌గా చెప్పబడుతున్న ‘ఆటోఏబీఐ’లాంటి ఐఫోన్ యాప్‌లు క్లినికల్ ట్రయల్స్, పేటెంట్‌ప్రాసెస్‌లో ఉన్నాయి. పది సైంటిఫిక్ రిసెర్చ్ పేపర్‌లను ప్రచురించిన అద్రిత్ డిజిటల్ హెల్త్ సోల్యూషన్స్‌కు సంబంధించి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లపై పని చేయడానికి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సమయం గడిపినప్పటికీ ‘సాంకేతిక సహాయంతో ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అద్రిత్. ‘వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే అది వైద్యులకు సహాయపడుతుంది’ అంటున్నాడు. ఈ కోడింగ్ మాంత్రికుడిలోని మరో కోణం...లాభాపేక్ష లేకుండా యంగ్ ఇన్నోవేటర్స్ కోసం ΄ాఠాలు బోధిస్తున్నాడు. ఎంతోమందికి విలువైన సలహాలు ఇస్తున్నాడు.వయసు అడ్డంకి కాదు...
కొత్త ఆవిష్కరణలకు వయసు అనేది అడ్డు కాదు. అభిరుచి అనేది ఆవిష్కరణకు ప్రమాణం. మనం ఇష్ట పడుతున్న సబ్జెక్ట్‌పై ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత విజయం సాధించగలం. కాలం అనేది విలువైనది. విలువైన కాలాన్ని వృథా చేయకుండా విలువైన విషయాలపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించగలం. మార్పును తీసుకురాగలం. – అద్రిత్
Comments
Please login to add a commentAdd a comment