‘నాసా’ ఇంటెర్న్‌గా శిక్షణ పొందుతున్న భారత సంతతి అమెరికన్ ప్రతిమా రాయ్ నాసా లోగో ఉన్న షర్ట్ వేసుకుని, తన డెస్క్‌టాప్ వెనుక హైందవ దేవతల విగ్రహాలు కనిపించేలా తీయించుకున్న ఫొటో ఇంటర్నెట్‌ను ఇప్పుడు మంత్రముగ్ధం చేస్తోంది. నిజానికి ఆ ఫొటోను ఆమె షేర్ చేయలేదు. కొత్త అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే ప్రకటనకు నాసా ఉపయోగించిన నలుగురు ఇంటెర్న్ ఫొటోలలో ఈ ఫొటో కూడా ఉంది. ‘మా దగ్గర శిక్షణ పొందదలచిన ఔత్సాహిక వ్యోమగాములకు గడువు తేదీ దగ్గర పడింది’ అని గుర్తు చేస్తూ ఈ నెల 10 న నాసా ఆ ఫొటోలను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసింది.
వాటిల్లో ఒకటైన ప్రతిమ ఫొటో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఉంది. అదే సమయంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు సంకేతంగా ఆమె వేసుకున్న షర్ట్ ప్రతిఫలిస్తోంది. ఈ వైరుధ్యంపై నెటిజన్‌లు మొదట ప్రతికూలంగా స్పందించినప్పటికీ.. మెల్లిమెల్లిగా ప్రతిమకు మద్దతు లభించడం ఆరంభమైంది. సైన్స్‌కు, విశ్వాసాలకు పొంతన ఏమిటి అనే ప్రశ్న కన్నా.. ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రతిమ ఫొటో చక్కగా ఉన్నదన్న సమర్థింపులే ఎక్కువగా పోస్ట్ అవుతున్నాయి. అలా ఫొటో తీయించుకున్న ప్రతిమకు, ఆ ఫొటోనే ఏరి కోరి షేర్ చేసిన నాసాకు ప్రశంసలు లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment