ఫస్ట్‌ ఉమన్‌: అమెరికా యూనివర్శిటీకి మన మహిళే ప్రెసిడెంట్‌ | Indian-origin Neeli Bendapudi Become First Woman President Of Pennsylvania State University | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ ఉమన్‌: అమెరికా యూనివర్శిటీకి మన మహిళే ప్రెసిడెంట్‌

Published Wed, Dec 29 2021 12:37 AM | Last Updated on Wed, Dec 29 2021 12:39 AM

Indian-origin Neeli Bendapudi Become First Woman President Of Pennsylvania State University - Sakshi

పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ తొలి మహిళా ప్రెసిడెంట్‌..నీలి బెండపూడి

ఎల్లలు దాటి ఏ దేశమేగినా మన సాధనే తొలి అడుగు గా ఉంటే విజయం దానంతట అది మనల్ని వరించక తప్పదనే విషయాన్ని తన విజయం ద్వారా రుజువు చేసి చూపుతున్నారు నీలి బెండపూడి. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన ఒక మహిళ ఎన్నిక కావడం గర్వించదగినదిగా సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు నీలి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన నీలి బెండపూడి ఉన్నత చదువుల కోసం ముప్పై ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆమె విజయ సోపానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

ప్రస్తుతం అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఉంటున్న నీలి బెండపూడి విశాఖపట్నం వాసి. ఆంధ్రాయూనివర్శిటీలో ఎంబీఎ చేసిన ఆమె. పీహెచ్‌డి కోసం అమెరికాలో కాన్సస్‌ యూనివర్శిటీకి వెళ్లారు. అలా 1986లో పై చదువుల రీత్యా విశాఖపట్నం నుంచి వెళ్లిన నీలి బెండపూడి 30 ఏళ్లుగా అంచెలంచెలుగా ఎదిగారు.

నాలుగేళ్లుగా యూనివర్శిటీ ఆఫ్‌ లూయిస్‌విల్లేకు 18వ ప్రెసిడెంట్‌గా విధులను నిర్వరిస్తున్నారు. దీనిలో భాగంగా యూనివర్శిటీ పరిధిలోని పన్నెండు విద్యా కళాశాలలు, విద్యా ఆరోగ్య వ్యవస్థలో భాగంగా ఐదు ఆసుపత్రులు, ఒక అథ్లెటిక్‌ ప్రోగ్రామ్, 200 మంది వైద్యులు, నాలుగు వైద్య కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ఆమె తన విధుల్లో కొనసాగుతారు.

గత అనుభవాలే గురువులు
విధి నిర్వహణలో సమర్థత, కార్యదక్షతలో భాగంగా ఆమె ప్రతియేటా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నారు. కాన్సాస్‌ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛాన్సలర్‌గా, స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌ వంటి అడ్మినిస్ట్రేటివ్‌ పదవులను నిర్వహించడంలో ఆమెకు అపార అనుభవం ఉంది. ఓహియో స్టేట్‌ యూనివర్శిటీలో ఇనిషియేటివ్‌ ఫర్‌ మేనేజింగ్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేశారు.

‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు’ అంటూ నడిచొచ్చిన మెట్ల గురించి సవినయంగా వివరిస్తారు నీలి బెండపూడి.

ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్‌
రాబోయే నూతన సంవత్సర ప్రారంభంలో ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ (పీఎస్‌యు) కి 19వ ప్రెసిడెంట్‌గా నీలి బెండపూడి బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్శిటీ అధ్యాపకులు, సిబ్బంది, సభ్యులు, విద్యార్థులు, ట్రస్టీ ప్రతినిధులతో కూడిన 18 మంది సభ్యుల బృందం నీలి బెండపూడిని ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసింది. యూనివర్శిటీకి ప్రెసిడెంట్‌గా ఎంపికైన తర్వాత పీఎస్‌యూలోని ట్రæస్టీకి ధన్యవాదాలు తెలిపిన బెండపూడి ఈ అవకాశాన్ని అందుకోవడానికి తాను పనిచేసిన ప్రతి చోటూ తన ఉన్నతికి సహాయపడిందని గుర్తు చేసుకుంటున్నారు.

అమెరికన్‌ అడకమిక్‌ అడ్మినిస్ట్రేటర్‌ గా, పీఎస్‌యు అధ్యక్షుడిగా పనిచేసిన ప్రెసిడెంట్‌ ఎరిక్‌ జె బారన్‌ తర్వాత ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు.

‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు.
నీలి బెండపూడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement