
ఇటలీకి చెందిన పిజ్జా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఖండఖండాంతరాల్లో చాలామంది అభిమానించే పిజ్జా వంటకం పద్దెనిమిదో శతాబ్దిలో ఇటలీలోని నేపుల్స్ ప్రాంతంలో పుట్టిందని చెబుతారు. పిజ్జా గురించి ఇప్పటి వరకు తెలిసిన చరిత్ర ఇదే! అయితే, పిజ్జా అంతకంటే పురాతనమైనదేననేందుకు తాజా ఆధారం లభించింది. నేపుల్స్‌కు చేరువలోని పోంపే నగరంలో రోమన్ కాలానికి చెందిన పురాతన శిథిల భవనంలో గోడలపై ఉన్న కుడ్యచిత్రాల్లో పిజ్జా చిత్రం కూడా ఉంది. ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు.
సహజమైన రంగులతో చిత్రించిన ఈ కుడ్యచిత్రంలో వెండిపళ్లెంలో పిజ్జాను తలపించే రొట్టె, పండ్లు, మధుపాత్ర ఉన్నాయి. ఈ చిత్రంలోని రొట్టె పిజ్జాకు తొలిరూపం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోమన్ నాగరికత కాలానికి చెందిన ఈ భవంతి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందినదని వారు చెబుతున్నారు. ఇక్కడకు చేరువలోని మౌంట్ వెసూవియస్ అనే అగ్నిపర్వతం క్రీస్తుశకం 79లో బద్దలైనప్పుడు పాంపే, ఆప్లాంటిస్ నగరాలు లావాలోను, బూడిదలోను కూరుకుపోయాయి. ఇటీవల అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన భవంతి, అందులోని పిజ్జా కుడ్యచిత్రం బయటపడటం విశేషం.
చదవండి America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్‌కే షాక్!
Comments
Please login to add a commentAdd a comment