పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నిష్కారణంగా అమాయకులను రకరకాలుగా వేధిస్తూ ఆనందించేవాడు. కొన్నాళ్లకు వాడికో దుర్బుద్ధి పుట్టింది. ‘బలహీనులైన మనుషులను, చిన్నా చితకా దేవతలను ఏడిపిస్తే ఏముంది? ఏడిపిస్తే మహాదేవుడని పిలిపించుకుంటున్న శివుణ్ణే ఏడిపించాలి. అప్పుడు కదా నా ఘనత ఏమిటో ముల్లోకాలకూ తెలిసి వస్తుంది’ అనుకున్నాడు. శివుణ్ణి ఏడిపించాలంటే, ముందు అతను తనకు ప్రత్యక్షమవ్వాలి కదా! వృకాసురుడు ఈ ఆలోచనలో ఉండగానే నారద మహర్షి అటువైపుగా వస్తూ కనిపించాడు.వృకాసురుడు ఎదురేగి నారదుడికి నమస్కరించాడు.
‘స్వామీ! పరమశివుడు ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాలి?’ అని అడిగాడు. ‘భగవంతుణ్ణి వశం చేసుకోవాలంటే ఒకటే మార్గం. అందుకు తపస్సు చెయ్యాలి. శుచివై, దీక్షతో తపస్సు చెయ్యి నీకు తప్పక పరమశివుడు కనిపిస్తాడు’ బదులిచ్చాడు నారదుడు. నారదుడి సలహాతో వృకాసురుడు శుచిగా నదీ స్నానం చేశాడు. ఒక చెట్టు కింద కూర్చుని శివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. ఎన్నాళ్లు గడిచినా శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కుమూసుకుని చేసే ఉత్తుత్తి తపస్సుకు శివుడు ప్రత్యక్షం కాడేమో! రాక్షసోచితంగా ఉగ్రతపస్సు చేస్తే ప్రత్యక్షమవుతాడేమోనని తలచి, ఎదుట హోమగుండం వెలిగించి ఉగ్రతపస్సు ప్రారంభించాడు.
తన శరీరం నుంచి మాంసఖండాలను కోసి హోమగుండంలో వేయసాగాడు. శరీరంలోని మాంసమంతా కోసి హోమగుండంలో వేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడికి పట్టుదల పెరిగింది. ఏకంగా తన తలను తెగనరుక్కుని హోమగుండంలో వేసేందుకు సిద్ధపడ్డాడు. అంతా కనిపెడుతున్న పరమశివుడు ఇక క్షణమైనా ఆలస్యం చేయలేదు. వెంటనే వృకాసురుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వృకాసురా! నీ సాహసానికి మెచ్చాను. అయ్యో! శరీరంలోని మాంసమంతా కోసేసుకున్నావే! నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయినా ఇప్పుడు వచ్చాను కదా! నీకు ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.
‘స్వామీ! నువ్వు నాకు దర్శనం ఇవ్వడమే పదివేలు. ఇక నాకు వరాలెందుకు? అయినా, నువ్వు కోరుకొమ్మని అంటున్నావు గనుక కోరుకుంటున్నాను. నా చెయ్యి ఎవరి నెత్తిన పెడితే వారి తల వెయ్యి వక్కలై చచ్చేటట్లు వరం ఇవ్వు చాలు’ అన్నాడు వృకాసురుడు. శివుడు అవాక్కయ్యాడు. ‘వీడు ఉత్త వెర్రివాడిలా ఉన్నాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడిగితే ఇలాంటి వరం కోరుకున్నాడేమిటి?’ అనుకున్నాడు. ‘ఇదేమిటి? ఇలాంటి వరం కోరుకున్నావు? నీకు ఉపయోగపడేది ఏదైనా కోరుకోరాదా?’ అన్నాడు శివుడు. ‘స్వామీ! నువ్వు కోరుకొమ్మంటేనే నేను కోరుకున్నాను. వరం ఇవ్వడం ఇష్టం లేకపోతే, ఆ ముక్క చెప్పి పోరాదా!’ అన్నాడు దెప్పిపొడుపుగా.
శివుడికి అహం దెబ్బతింది. ‘నేను వరం ఇవ్వలేకపోవడం ఏమిటి? ఇచ్చాను. పుచ్చుకుని పో! నీ కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’ అని చెప్పి వెళ్లిపోబోయాడు. వృకాసురుడు వెకిలిగా నవ్వుతూ ‘మహాదేవా! ఆగాగు. నీ కర్మకాలే నాకీ వరం ఇచ్చావు. మొట్టమొదట నీ నెత్తి మీద చెయ్యిపెట్టి, వర ప్రభావాన్ని పరీక్షించుకుంటాను’ అంటూ చెయ్యి పైకెత్తి ముందుకొచ్చాడు. శివుడు హడలి పోయాడు. వృకాసురుడి చెయ్యి నెత్తిన పడకుండా చటుక్కున తప్పించుకుని, దిక్కు తోచక పరుగు లంకించుకున్నాడు. వృకాసురుడు కూడా శివుడిని వెంబడిస్తూ పరుగు తీయసాగాడు.
ముందు శివుడు, వెనుక వృకాసురుడు– ఒకరి వెనుక ఒకరు పరుగు తీస్తున్న దృశ్యాన్ని ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు తిలకించాడు. దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. వెంటనే వైకుంఠానికి బయలుదేరి వెళ్లి, విష్ణువుకు వృకాసురుడు పరమశివుడిని తరుముతున్న సంగతి చెప్పాడు. పరమశివుడిని ఎలాగైనా రక్షించాలని కోరాడు. శివుడిని కాపాడటం కోసం విష్ణువు తక్షణమే బయలుదేరాడు. బాల బ్రహ్మచారి వేషం ధరించి వృకాసురుడు వస్తున్న దారిలో నిలిచాడు. పరుగుతో ఆయాసపడుతున్న వృకాసురుడు బాల బ్రహ్మచారిని ‘ఏమయ్యా! శివుడు ఇటుగా వెళ్లడం చూశావా?’ అని అడిగాడు. ‘పరుగున వెళుతుంటే చూశాను. ఆ కొండల మాటుగా పరుగు తీస్తూ పోయాడు. అప్పటికీ ఎందుకు పరుగు తీస్తున్నావని నేను అడిగాను కూడా’ అన్నాడు.‘ఏం చెప్పాడేమిటి?’ అడిగాడు వృకాసురుడు.
‘నా భక్తుడు వృకుడు నన్ను తాకుతానంటూ వెంబడిస్తున్నాడు. తాకితే ఇబ్బందేమీ లేదుగాని, ఒళ్లంతా కండలు కోసేసుకుని, దుర్గంధమోడుతున్న శరీరంతో ఉన్నాడు. కనీసం శుచిగా స్నానమైనా చేసి ఉంటే, తాకనివచ్చేవాణ్ణే అని చెప్పాడు’ అన్నాడు బాల బ్రహ్మచారి రూపంలోని విష్ణువు. ‘ఇదీ సమంజసంగానే ఉంది. పరమశివుడు ఎంతైనా దేవుడు. అతణ్ణి తాకేటప్పుడు శుచిగా ఉండటం ధర్మం’ అనుకుని పక్కనే ఉన్న నదిలో స్నానానికి దిగాడు. మెడ లోతు వరకు దిగాక, శిఖ ముడి విప్పుకోవడానికి నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. అంతే! తల వెయ్యి వక్కలై చచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment