పూర్వం చర్మం అందంగా కనిపించాలంటే ఒంటికి సగ్గుపిండి, పసుపు .. వంటివి రాసుకుని నలుగుపెట్టుకుని స్నానం చేసేవారు. కానీ నేడు పరిస్థితి అలా లేదు. బ్యూటీపార్లర్లు, స్పాలకు వెళ్తున్నారు. అక్కడ రకరకాల సౌందర్యం చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఈ సౌందర్య చికిత్సలు వింతగా తయారయ్యాయి. ఎంతలా అంటే ..మన ఊహకు అందనంత. జలగలు రక్తాన్ని పీల్చుతాయని తెలుసు. అలాంటిది శరీరంపై పాకించుకుంటే.. ! అమ్మో! అనకుండా ఉండగలమా? కానీ వివిధ దేశాల్లో కొన్ని బ్యూటీ స్పాలలో ఈ తరహా థెరపీ ఉంది. దీనిని లీచ్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో పదుల సంఖ్యలో ముఖంపై జలగల్ని వదులుతారట. జలగలు చర్మం పై పొరల్లో ఉండే చెడు రక్తాన్ని పీల్చేస్తాయిట.
ఇవి కొన్ని మాత్రమే.. తేనెటీగలతో కుట్టించుకోవడం, మనిషి రక్తాన్ని ముఖానికి రాసుకోవడం, పాములు, తేళ్ల నుంచి తీసే విషంతో ఫేషియల్స్, బీరు, వైనూ, కాఫీ, టీ .. స్నానాలు ఇలా ఎన్నో రకాల సౌందర్య చికిత్సలు పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.
జపాన్‌లో నైటింగేల్ పక్షి వేసే రెట్టలు ఎండాక, ఆ పొడిని బియ్యం కడిగిన నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటారు. చర్మ సమస్యలని దూరం చేసుకొనేందుకు ఈ రకం ఫేషియల్ వేసుకుంటారట.
జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో స్నెయిల్ ఫేషియల్స్ అనే కొత్త రకం చికిత్స చేస్తున్నారు. అంటే నత్తను ముఖంపై పాకించుకోవడం. నత్త పాకేటప్పుడు జిగట పదార్థాన్ని విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ద్రవంలో చర్మంపై ముడుతలు పడకుండా చెయ్యగల ఔషధ గుణాలు ఉన్నాయట.
ఫిలిప్పీన్స్, ఇతర దేశాల్లో కోరలు పీకిన పాములు, కొండ చిలువల్ని శరీరంపై పాకించి మసాజ్ చేస్తున్నాయి కొన్ని స్పాలు. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. శరీరానికి విశ్రాంతి కూడా అందుతుందట.
Comments
Please login to add a commentAdd a comment