రోడ్డు మీద 500లకు బిర్యానీ మొమోలను అమ్ముతూ.. అంచెలంచెలుగా ఎదిగి! | Jharkhand: Aruna Tirkey Food Entrepreneur Successful Journey | Sakshi
Sakshi News home page

Aruna Tirkey: రోడ్డు మీద 500లకు బిర్యానీ మొమోలను విక్రయిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగి! ఇప్పుడు..

Published Thu, Jul 14 2022 2:02 PM | Last Updated on Thu, Jul 14 2022 2:12 PM

Jharkhand: Aruna Tirkey Food Entrepreneur Successful Journey - Sakshi

చిన్నప్పుడు అమ్మ అమ్మమ్మ, బామ్మల దగ్గర నేర్చుకున్న ఎన్నో విషయాలను జ్ఞాపకాలుగా ఉంచుకుంటారు చాలామంది. వారి దగ్గర నేర్చుకున్న విషయం ఎంత చిన్నదైనా, దానికి ఎంతో విలువనిస్తారు.

ఇలా చిన్ననాటి బామ్మల వంటకాలను దగ్గర నుంచి చూసిన అరుణా టిర్కీ.. ఆ వంటకాలతో ఏకంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. కనీస అవగాహన లేని వ్యాపారంలో అడుగుపెట్టినా అందులో చక్కగా రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.

జార్ఖండ్‌లో పన్నెండు మంది సంతానం ఉన్న అతిపెద్ద గిరిజన కుటుంబంలో పుట్టింది అరుణా టిర్కీ. తల్లిదండ్రులతో పద్నాలుగు మంది ఉన్న కుటుంబం. తల్లిదండ్రులు టీచర్లుగా పనిచేసేవారు. ఉన్నత విద్య వరకు బాగానే చదివించారు.

వారి ప్రోత్సాహంతోనే నెట్‌ రాసిన తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ చదివిన ఆరుణ ఆదివాసీల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులో ఉద్యోగిగా చేరి కొన్నేళ్లపాటు గిరిజనలు అభివృద్ధికోసం పాటుపడింది. 

కొడుకు కోసం ఉద్యోగం వదిలి...
ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కులాంతర వివాహం చేసుకుంది అరుణ. ఈ పెళ్లి ఇష్టంలేని తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తరువాత చేరదీశారు.పెళ్లైన ఏడాదికే అరుణకు బాబు పుట్టాడు. దీంతో బాబుని చూసుకునేందుకు తన ఉద్యోగం వదిలేసి పూర్తిసమయాన్ని కొడుకుకి కేటాయించింది.

రెండేళ్లు వచ్చిన పిల్లలందరిలా కొడుకు ప్రవర్తించేవాడు కాదు. ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌’ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ బాధనంతటినీ కడుపులో దాచుకుని తన కొడుకు సమస్యను తగ్గించేందుకు ఆదివాసీ ఆహార పదార్థాలను మాత్రమే తినిపించేది. దీంతో ఆరు నెలల్లోనే అతని ప్రవర్తన సాధారణ స్థితికి చేరింది. 

ఆర్థిక ఇబ్బందులతో..
కొడుకు ఆరోగ్యంగా బావున్నాడు అనుకున్న కొద్దిరోజులకే అరుణకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అరుణ ఉద్యోగం మానేయడం, భర్త ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడంతో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. కుటుంబాన్ని పోషించేందుకు ఏం చేయాలా... అని ఆలోచిస్తోన్న సమయంలో... బిర్యానీ, మొమోలు విక్రయిస్తే బావుంటుందన్న ఆలోచన వచ్చింది అరుణకు.

పుట్టిల్లు, అత్తారింట్లో ఎక్కువమందికి వండిపెట్టిన అనుభవంతో రోజుకి మూడు గంటలపాటు రోడ్డు మీద రూ.500లకు బిర్యానీ మొమోలను విక్రయించేది. ఈ పనిచేయడం ఇష్టంలేని కుటుంబ సభ్యులు ఆమెకు సాయం చేయకపోగా, నిరుత్సాహపరిచేవారు. అయినా అరుణ తాను అనుకున్నది చేసుకుంటూ పోయేది. 

వెరీ టేస్టీ..
అరుణ బిర్యానీకి మంచి ఆదరణ లభించడంతో.. ‘అజం ఎంబా’ అనే పేరుతో ఐదువేల రూపాయల పెట్టుబడితో 2016లో రాంచీలో  రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఆదివాసీ భాషలో అజం ఎంబా అంటే ‘వెరీ టేస్టీ’ అని అర్థం.

ఎక్కువగా ఆదివాసీలు తినే ఆహార పదార్థాలను విక్రయించడంతో అతికొద్ది కాలంలోనే రెస్టారెంట్‌కు మంచిపేరు వచ్చింది. గిరిజనేతరులు సైతం ఇక్కడి ఆహార పదార్థాలను రుచి చూడడానికి ఆసక్తి చూపడంతో రెస్టారెంట్‌ బాగా నడుస్తోంది.         

సంప్రదాయ ఇంటి భోజనం
సంప్రదాయ వంటకాలు మదువ రోటి, దుస్కా, ఖుక్డీ, రుగాడ, బ్యాంబూ కర్రీ, పితా, ట్వీజర్‌ గ్రీన్స్, పుత్కల్‌ గ్రీన్స్, డాకాక్షాన్, సూప్‌ వంటి గిరిజన వంటకాలను ఆకు వేసి వడ్డించడం, ఇంట్లో తిన్నట్లుగా చాపమీద భోజనం చేయడం కస్టమర్లను బాగా ఆకర్షించాయి. వీటితోపాటు గిరిజన సంగీతం ఎంతో వినసొంపుగా వినిపించడం, కాలానికి తగ్గట్టుగా వంటకాలు అందించడం ఇక్కడి ప్రత్యేకం.

గిరిజనుల మార్కెట్‌ నుంచి కూరగాయల సేకరణ, రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగులంతా ఆదివాసీ మహిళలు కావడం విశేషం. నైపుణ్యం గల చెఫ్‌లు లేకపోయినప్పటికీ స్థానిక గిరిజన మహిళా ఉద్యోగులతో ఈ రెస్టారెంట్‌ నడుస్తోంది. నలభై మంది కూర్చుని తినగల అంజా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఆహారాన్ని ఆర్డర్ల మీద అందిస్తోంది. 

ఫాస్ట్‌ ఫుడ్‌ దొరకదు కాబట్టి..
‘‘ నేను చిన్నప్పటి నుంచి గిరిజన సంస్కృతి సంప్రదాయాలు చూసి పెరిగాను. చిన్నప్పుడు మా బామ్మల దగ్గర గిరిజన వంటకాలు చేయడం నేర్చుకున్నాను. హోటల్‌ పెట్టాలనుకున్నప్పుడు ఏమేం ఆహార పదార్థాలు విక్రయించాలని ఆలోచిస్తున్నప్పుడు... ‘ఇక్కడ ప్రస్తుతమంతా ఫాస్ట్‌ఫుడ్స్‌వైపే ఆకర్షితులవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని పెంపొందించే గిరిజన ఆహార పదార్థాలు విక్రయిస్తే బావుంటుంది’ అనిపించింది. నా కొడుకు ఆరోగ్య సమస్య కూడా ఈ ఆహార పదార్థాలతోనే నయం అయింది. అందుకే సంప్రదాయ ఆహారపదార్థాలను విక్రయించాలని నిర్ణయించుకున్నాను.

రొటీన్‌కు భిన్నంగా ఉండే చిరుతిళ్లకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుందన్న నమ్మకంతో ఈ వ్యాపారంలో దిగాను. అనుకున్నట్టుగానే రెస్టారెంట్‌ బాగా నడుస్తోంది. ఒకపక్క గిరిజన సంప్రదాయక వంటకాలను ప్రోత్సహిస్తూనే, స్థానిక ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ – అరుణా టిర్కీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement