తమిళనాడులోని కమలాహ్యారిస్ పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో ఏర్పాటుచేసిన కమల పోస్టర్
‘లెట్స్ విన్ దిస్’ ఇది కమలా హ్యారిస్ నినాదం. గెలిచే శక్తి... గెలవగలిగే శక్తి తాను కాగలనని హ్యారిస్ ఆత్మవిశ్వాసం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి అభ్యర్థిగా జో బైడెన్ తప్పుకున్నాక ఇప్పుడు అమెరికాయే కాదు, ప్రపంచమంతా కమలా హ్యారిస్ వైపు చూస్తోంది. అధ్యక్ష పదవి అభ్యర్థిగా ఆమె ఎంపికైతే అది ఒక చరిత్రాత్మక సందర్భం... గెలిచి ప్రెసిడెంట్ అయితే చరిత్రే! భారతీయ మూలాల్లో తల్లి శక్తిస్వరూపిణి. స్త్రీ శక్తి స్వరూపిణి. స్త్రీగా... తల్లిగా... రాజకీయవేత్తగా కమలా హ్యారిస్ తన శక్తి ఏమిటో ఇప్పటికే నిరూపించారు. ఆమెలోని భారతీయత శక్తిని ఇస్తూనే ఉంటుంది.
కమలా హ్యారిస్ జీవితంలో ఆగస్టు 22కు ఒక ప్రత్యేకత ఉంది. 2014లో డగ్లస్ ఎంహాఫ్‌తో ఆమె పెళ్లి జరిగిన రోజు అది. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే ఆగస్టు 22 మళ్లీ ఇప్పుడు ఆమె కోసం మరొక చిరస్మరణీమైన సందర్భాన్ని సిద్ధం చేసి ఉంచినట్లే అనిపిస్తోంది! 2024 ఆగస్టు 19 నుంచి 22 వరకు షికాగోలో జరిగే పార్టీ సమావేశంలో చివరి రోజున డెమోక్రాట్‌లు తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు.
ఆ అభ్యర్థి కమలా హ్యారిస్ అయుండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరో మూడు నెలలో అధ్యక్ష ఎన్నికలు ఉండగా పోటీ నుంచి విరమించుకున్న జో బైడెన్.. వెళుతూ వెళుతూ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచి వెళ్లారు. ఆయన మాటపై కమలా హ్యారిస్‌కు మద్ధతుగా ఉన్న డెమోక్రాట్‌లతో పాటుగా, పార్టీలోని ఆమె వ్యతిరేకులు కూడా.. ఇప్పుడు ‘ట్రంప్‌ను ఓడించగల శక్తి’గా కమలా హ్యారిస్‌ను గుర్తించటం మొదలైంది.
→ ఎంతటి శక్తిమంతురాలు?
కమలా హ్యారిస్‌ను ఆమె పిల్లలు ‘మామ్‌లా’ (మామ్ + కమల) అని పిలుస్తారు. పిల్లలకు ఆమె సొంత తల్లి కాదు. విడిపోయిన డగ్లస్ ఎంహాఫ్ మొదటి భార్య పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కమలా డగ్లస్‌ల పెళ్లయ్యే నాటికి అబ్బాయికి 19 ఏళ్లు. అమ్మాయికి 15. ఆ వయసులోని పిల్లలు ఒక బయటి మనిషి తల్లిలా వచ్చి తమను చేరదీస్తానంటే వెళ్లి ఒడిలో వాలిపోతారా? కానీ అలాగే జరిగింది. వాళ్లను చక్కగా కలుపుకుపోయారు కమల. కొత్తమ్మ అమ్మ అయింది. ఫ్రెండ్ అయింది. అమ్మ, ఫ్రెండ్ కలిసి ‘మామ్‌లా’ అయింది. తల్లి స్థానంలో తల్లిగా వచ్చి, పిల్లల మనసు గెలుచుకోటానికి శక్తి కావాలి. అంతటి శక్తిమంతురాలు అయిన కమలకు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవటం, ఆపైన అధ్యక్షురాలిగా నెగ్గటం ఎంత పని?
‘‘అమెరికాను సకల జాతులకు సహజీవన యోగ్యమైన దేశంగా మార్చటమే నా ధ్యేయం’’ అని కమల అనడం ట్రంప్ వంటి కరడు గట్టిన జాతీయవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఆమె ఇప్పటికే అధికశాతం అమెరికన్‌లు, అమెరికాలోని ఇతర వలస దేశాల ప్రజల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు.
→ వ్యక్తిగా ఎలాంటి మనిషి?
నాలుగేళ్ల క్రితం బైడెన్ రన్నింగ్ మేట్‌గా (వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా) ఎంపికైనది మొదలు, అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే వరకు కమలా హ్యారిస్‌ను గురించిన ఏ చిన్న విషయాన్నీ వదలకుండా ప్రపంచం ఆసక్తిగా తెలుసుకుంది. ‘‘నా బిడ్డ’’ అని భారతదేశం గర్వించింది. అంతేకాదు, తన ఉపాధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ఆమె భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తలపిస్తూ చీరకట్టులో వేదికపైకి రావాలని ఇండియా కోరుకుంది. అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పెద్ద పెద్ద డిబేట్‌లు జరిగిన విధంగానే.. ‘‘కమల చీర కట్టులో కనిపిస్తారా లేదా?’’ అని రెండు దేశాల్లోనూ డిబేట్‌లు జరిగాయి.
చీర కట్టుకుంటే బావుంటుందన్న ఆకాంక్షలు వెల్లివిరిశాయి. ప్రమాణ స్వీకారానికి ఆమె చీర ధరిస్తే.. సంస్కృతుల సమైక్య భావనకు తనొక సంకేతం ఇచ్చినట్లు అవుతుంది’’ అని, ‘‘కమలా హ్యారిస్ చీర కట్టుకుని ప్రమాణం స్వీకారంలో కనిపిస్తే అమెరికాలోని దక్షిణాసియా సంతతి వారికి ఆమె తమ మనిషి అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది..’’ అని, ‘‘కమలా హ్యారిస్ కనుక చీరలో ప్రమాణ స్వీకారం చేస్తే అదొక దౌత్యపరమైన స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది’’ అని... ఇలా అనేక అభి్రపాయాలు వ్యక్తం అయ్యాయి.
చివరికేం జరిగింది? అచ్చమైన అమెరికన్ ΄ûరురాలిగా ΄్యాంట్ సూట్, బౌ బ్లవుజ్‌లో వచ్చి ప్రమాణం స్వీకారం చేశారు కమలా హ్యారిస్. ఇది దేనికి సంకేతం? కొత్తగా తను సంస్కృతుల సమైక్య భావనను, దౌత్యపరమైన స్నేహభావనను ప్రదర్శించనవసరం లేదని ఆమె బలంగా నమ్మారని. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో వెల్లడించే ఒక చిన్న సందర్భం ఇది.
→ ‘‘వాళ్లిద్దరు కూడా నాకు అమ్మలే’’
తన తల్లి శ్యామలా గోపాలన్ కాకుండా, మరో ఇద్దరు మహిⶠలు కూడా తనకు తల్లి వంటి వారని.. ఆనాటి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు కమల! ఆ ఇద్దరిలో ఒకరు: చిన్నప్పుడు తమ పక్కింట్లో ఉండే శ్రీమతి షెల్టన్. ఇంకొకరు : ఒకటో తరగతి టీచర్ శ్రీమతి విల్సన్. ‘‘సాయంత్రం అమ్మ డ్యూటీ నుండి రావటం లేటయితే నేను, చెల్లి మాయా నేరుగా షెల్టన్ వాళ్ల ఇంట్లోకి వెళ్లిపోయేవాళ్లం. అక్కడే తిని, అమ్మ వచ్చి మమ్మల్ని పిలుచుకెళ్లే వరకు అక్కడే పడుకునేవాళ్లం. షెల్టన్ మమ్మల్నెంతో ఆదరణగా చూశారు..’’ అని కమల గుర్తు చేసుకున్నారు.
ఇక శ్రీమతి విల్సన్ బర్కిలీలోని థౌజండ్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్లో ఒకటో తరగతి టీచర్. ‘‘బాల్యంలో నాలో ఆశల్ని, ధైర్యాన్ని నింపింది ఆవిడే. నేను పై చదువులకు వెళ్లి, ‘లా’ డి΄÷్లమా చేసి, ఆ సర్టిఫికెట్‌ను అందుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్లినప్పుడు కూడా విల్సన్ నా కోసం వచ్చి ఆడియెన్స్‌లో కూర్చొని ఉండటం దూరాన్నుంచి కనిపించింది! నన్ను సంతోష పెట్టటం కోసం ఆమె అలా చేయటం నాకెంతో అనందాన్నిచ్చింది’’ అని విల్సన్ గురించి రాశారు కమల.
అమెరికా తొలి ఉపాధ్యక్షురాలు అయ్యాక కూడా ఈ నాలుగేళ్లలో ఎక్కడా దర్పాన్ని ప్రదర్శించని కమల తన జీవితంలోని అమూల్యమైన వ్యక్తులను, ప్రదేశాలను, మరచిపోలేని సందర్భాలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. రేపు ఒకవేళ ఆమె అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైతే కనుక ఆమె షేర్ చేసే తొలి పోస్టు ఏదైనా గాని, తప్పకుండా ఆమె కన్నా కూడా అది అగ్రరాజ్యం అమెరికాకే చరిత్రాత్మక సందర్భం అవుతుంది.
‘‘అమెరికాను సకల జాతులకు సహజీవన యోగ్యమైన దేశంగా మార్చటమే నా ధ్యేయం’’ అని కమల అనడం ట్రంప్ వంటి కరడు గట్టిన జాతీయవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఆమె ఇప్పటికే అధికశాతం అమెరికన్‌లు, అమెరికాలోని ఇతర వలస దేశాల ప్రజల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment