హాట్సాఫ్‌ ఎస్పీ శ్వేత: రక్తదానంలో మగువలూ ముందడుగు | Kamareddy SP Swetha Give Awareness To Women For Blood Donation | Sakshi
Sakshi News home page

హాట్సాఫ్‌ ఎస్పీ శ్వేత: రక్తదానంలో మగువలూ ముందడుగు

May 15 2021 11:21 AM | Updated on May 15 2021 11:52 AM

Kamareddy SP Swetha Give Awareness To Women For Blood Donation - Sakshi

ఎన్‌.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి

ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. చాలా మందికి రక్తం, ప్లాస్మా అవసరం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం అవసరం గుర్తించిన మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. 

రక్తదానం అంటే ఇప్పటికీ ఎన్నో అపోహలు సమాజంలో ఉన్నాయి. రక్తం ఇస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా చాలామందిని వీడడం లేదు. మహిళల్లో రక్తదాన విషయంలో ఇంకా ఎన్నో అనుమానాలుంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నెలసరి ఒత్తిళ్లు, ప్రసవానంతర సమస్యలు, రక్తహీనత... వంటివి వారిని ఈ విషయం లో వెనకడుగు వేయిస్తున్నాయి. వాటినన్నింటినీ దాటుకుంటూ నేటితరం యువతులు ‘మేము సైతం’ అంటూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. 

ఆరు నెలలకు ఒకసారి...
సాధారణంగా చాలామంది మహిళల్లో రక్తహీనత అనేది ఒక సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం అంటే గొప్ప విషయంగానే భావించాలి. కామారెడ్డి జిల్లాలో రక్తదానం ఒక ఉద్యమంగా సాగుతున్న సందర్భంలో రక్తదానం చేస్తూ పలువురు మహిళలు కూడా రక్తదాతలుగా వెలుగొందుతున్నారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భవించి నాలుగేళ్లు గడచింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఎన్‌.శ్వేత ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆమె తొమ్మిదిసార్లు రక్తదానం చేశారు. ఏటా రెండుసార్లు రక్తం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నానని, ఇది నిరాటంకం గా కొనసాగిస్తానంటున్నారు. ఎస్పీ స్ఫూర్తితో పలువురు యువతులు మేము కూడా... అంటూ ముందుకు వస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు రక్తదానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ఒకరి రక్తదానంతో మరొకరి ప్రాణం కాపాడొచ్చని చెబుతున్నారు.

అపోహలు వీడాలి
మహిళలు రక్తదానం విషయంలో ఉన్న అపోహలు వీడాల్సిన అవసరం ఉంది. మగవారే కాదు మగువలూ రక్తం ఇవ్వొచ్చు. రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేనైతే ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నాను. ఇప్పటికీ తొమ్మిది సార్లు ఇచ్చాను. రాబోయే రోజుల్లోనూ ఇస్తూనే ఉంటా. మహిళలకు రక్తదాన విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. రక్తదానంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి. –ఎన్‌.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి

రక్తదానం చేస్తున్న జిల్లా ఎస్పీ శ్వేతను అభినందిస్తున్న ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణ (ఫైల్‌)

ఇబ్బందులేవీ రావు
రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడామన్న సంతోషం కలుగుతోంది. 
– శోభ, కామారెడ్డి

గొప్ప అనుభూతి
మొదటిసారి రక్తదానం చేశాను. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. ఒకరికైనా సాయపడుతున్నాను అనే ఆలోచనతో గొప్ప అనుభూతిని పొందాను. రక్తదాతల సమూహం ద్వారా అవసరం ఉన్న వారికి రక్తదానం చేయడానికి ఎప్పుడైనా నేను సిద్ధం.
నవ్య, మద్దికుంట, రామారెడ్డి మండలం

ఎనిమిది సార్లు రక్తదానం చేశాను
రక్తదానం విషయంలో ఎలాంటి అపోహలకూ లోను కావొద్దు. నేను ఇప్పటికీ ఎనిమిది సార్లు రక్తదానం చేశాను. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్క ఆడపిల్ల రక్తదానానికి ముందుకు రావాలి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు దూసుకుపోతున్నారు. రక్తదానంలోనూ బాధ్యతను నెరవేర్చాలి. 
–వెన్నెల, కామారెడ్డి పట్టణం

ప్రాణదాతలు కావాలి
నా బ్లడ్‌ గ్రూప్‌ ఓ నెగటివ్‌. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం ఉందని తెలిస్తే వెళ్లి ఇస్తున్నాను. ఇప్పటికి ఐదు సార్లు రక్తదానం చేశాను. అపోహలు వీడితే రక్తదానం చేయడానికి ఎవరికి వారే ముందుకు వస్తారు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని. 
 –లావణ్య, రాంరెడ్డిపల్లి, బీబీపేట మండలం

యువతులు ముందడుగు
రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని తెలుసుకుని రక్తం చేయడానికి ముందుకు వచ్చాను. ముఖ్యంగా యువత రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలి. రక్తదానం చేయడానికి ముందుకు రావాలి.  
– హర్ష, కామారెడ్డి
– ఎస్‌.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement