ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం.
ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్‌కు ట్వీట్‌ల ద్వారా మద్దతు లభిస్తోంది.
స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్‌బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు.
∙∙
నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్‌ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్‌బుక్ వాల్‌పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు.
చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్‌లో ఉన్న కామెంట్స్‌నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్‌లో మీ కోసం ప్రత్యేకంగా షవర్‌మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు.
నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్‌కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి.
రిహాన్నా, గ్రెటా థన్‌బర్గ్
Comments
Please login to add a commentAdd a comment