బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (జూన్ 23, 2024న)న తన డ్రీమ్ బోయ్ జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ ప్రముఖులందరూ తరలి వచ్చారు. అలాగే వీరి వెడ్డింగ్, రిసెప్షన్ వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా సందడి చేసాయి.
రేఖ, కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్లతోపాటు ,సోనాక్షి తన అత్తమామలతో సన్నిహితంగా, ప్రేమగా మెలిగిన ఫోటోలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ క్రమంలో సోనాక్షి మెట్టినిల్లు, జహీర్ ఇక్బాల్ కుటుంబం, నేపథ్యం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
సోనాక్షి భర్త, నటుడు, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ జహీర్ ఇక్బాల్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ. అలాగే సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హాకు సన్నిహితుడైన ఇక్బాల్ రతాన్సీకి వ్యాపార పరిశ్రమలో మంచి పేరుంది. ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు చాలా సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే రతాన్నీ సల్మాన్‌కు 'పర్సనల్ బ్యాంకు' లాంటి వాడట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ వెల్లడించాడొక సందర్భంలో. 2011లో తీసుకున్న ఆయన అప్పు ఇంకా తీర్చలేదని, వడ్డీ కూడా లేదంటూ చెప్పుకొచ్చాడు.
ఎవరీ రతాన్సీ?
ముంబైకి చెందిన ఇక్బాల్ రతాన్సీ నగల వ్యాపారంతో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశం లేనప్పటికీ అనేక సినీరంగ ప్రముఖులతో సంబంధాలు మాత్రం ఉన్నాయి. 2005లో స్టెల్మాక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. 2011 వరకు ఈ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో మరింత విస్తరించేలా బ్లాక్‌స్టోన్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు. ప్రస్తుతం దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు రతాన్సీ.
ఇక్బాల్ రతాన్సీ సినిమా వ్యాపారం
2016లో సినిమా రంగంలోకూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఫిల్మ్ టూల్స్, లైట్స్ అండ్ గ్రిప్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కోవిడ్ సమయంలో జహీరో మీడియా అండ్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు.
ఇక్బాల్ రతాన్సీ కుటుంబం
రతాన్సీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు జహీర్ నటుడు కాగా మరో కుమారుడు, మొహమ్మద్ లోధా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఇక ఏకైక కుమార్తె సనమ్ రతాన్సీ. ఈమె స్టైలిస్ట్ , కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. సోనాక్షి వ్యక్తిగత స్టైలిస్ట్‌గా పేరొందింది.
సల్మాన్ ఖాన్‌తో ఇక్బాల్ రతాన్సీ బంధం
ఇక్బాల్ , సల్మాన్‌ల స్నేహం మూడు దశాబ్దాలకు పైబడి కొనసాగుతోంది. కష్ట సమయాల్లో సల్మాకు ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన వారిలో రతాన్సీ ఒకరు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ కుమారుడు జహీర్‌ను బాలీవుడ్‌లో నోట్‌బుక్ చిత్రంతో పరిచయం చేశాడు. అంతేకాదు ఇక్బాల్ రతాన్సీ వ్యాపారవేత్తగా రాణిస్తూనే, స్నేహితులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ప్రియమైన స్నేహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment