దృశ్యం 2: కుటుంబం గెలిచింది | Mohan lAL Drishyam 2 Movie Review | Sakshi
Sakshi News home page

దృశ్యం 2: కుటుంబం గెలిచింది

Published Sun, Feb 21 2021 3:22 AM | Last Updated on Sun, Feb 21 2021 12:08 PM

Mohan lAL Drishyam 2 Movie Review - Sakshi

శిక్ష అంటే ఏమిటి?
నేరం చేసిన వారిని జైలులో బంధించి వారిని జీవితానికి దూరం చేసి బాధించడమేనా?

న్యాయం అంటే ఏమిటి?
తమకు జరిగిన అన్యాయానికి కొంతమందికి శిక్ష పడే వరకు వేటాడటమేనా?

‘క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌’ గురించి వందల సంవత్సరాలుగా మనిషి తాత్త్వికత రకరకాలుగా ఉంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ శిక్ష మానసికమైనదా? భౌతికమైనదా? పశ్చాత్తాపంతో నిండినదా? ప్రాయశ్చిత్తం చేసుకునేదా? శిక్షను కోరుకునే చోట క్షమకు వీలు లేదా? శిక్ష–క్షమ సమానం కాదా?

అయితే మనిషికి భావోద్వేగాలు ఉంటాయి.
చట్టానికి ఉండవు.

∙∙
‘నిజానికి ఆ ఇద్దరూ న్యాయం కోరుకుంటున్నారు. కాని ఇద్దరికీ న్యాయం చేయలేం’ అంటాడు ‘దృశ్యం2’లో ఒక పోలీసు ఉన్నతాధికారి. ‘మళ్లీ పోలీసులు ఎప్పుడొస్తారో అని ఆ కుటుంబం భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అది శిక్ష కదా?’ అంటాడు మరో పోలీసు అధికారి.

ఇది ఒక చిక్కుముడి కేసు.
ప్రేక్షకులు కూడా న్యాయం చెప్పలేని కేసు. నిజానికి న్యాయం సాపేక్షమైనది. ఇటు నుంచి చూస్తే ఇటు న్యాయం అనిపిస్తుంది. అటు నుంచి చూస్తే అటు న్యాయమనిపిస్తుంది.
‘దృశ్యం’ సినిమాలో ఒక కుర్రాడి హత్య జరుగుతుంది. ఆ హత్యను చేసింది తల్లీకూతుళ్ల జంట. అతను తప్పు చేశాడు. ఆ తల్లీకూతుళ్లు బతిమిలాడారు. అతను వినలేదు. తకరారు జరిగింది. అనుకోకుండా అతడు చనిపోయాడు. అమాయకులైన తల్లీకూతుళ్లు అతని వల్ల పెద్ద విపత్తులో పడ్డారు. ఆ విపత్తు నుంచి కాపాడుకోవడంలో భాగంగా అతను చనిపోయాడు.

క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌ జరిగిపోయింది. కాని చట్టం దానిని క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌ అనుకోదు. పనిష్‌ చేయాల్సింది తల్లికూతుళ్లను అని భావిస్తుంది తన నియమాల ప్రకారం. ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తారు చట్టం నుంచి. అయితే ఆ చట్టానికి ఆ తల్లికూతుళ్లకు మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ ఇంటి యజమాని. కుటుంబ పెద్ద. అతనికి కుటుంబం ముఖ్యం. తన ఇంటి ఆడవాళ్లు జైలుకు వెళ్లకుండా చూసుకోవడం అతడి విధి. అంటే అతడు శిక్షను నిరాకరిస్తున్నాడు. తన కుటుంబానికి శిక్ష పడటం న్యాయ సమ్మతం కాదనుకుంటున్నాడు. అక్కడి నుంచే గేమ్‌ మొదలవుతుంది.

‘దృశ్యం’ రిలీజ్‌ అయ్యింది. అనేక భాషల్లో రీమేక్‌ అయ్యింది. ‘దృశ్యం’ ఒరిజినల్‌లో చేసిన మోహన్‌లాల్‌ తన కుటుంబాన్ని తెలివితో కాపాడుకున్నాడు. ఆ సినిమాలో హత్యకు గురైన కుర్రాడి డెడ్‌బాడీ దొరకదు. శవం లేకపోతే నేరం నిరూపణ కాదు. కనుక శిక్ష లేదు. కనుక వారు శిక్ష నుంచి బయటపడతారు. కథ ముగిసింది అనుకుంటాం. కాని నిజంగా ముగిసిందా? పోలీసులు నిజంగానే కేసు మూసేస్తారా? ఏం మూసేయరు. వాళ్లు ఆ కేసును పట్టుకునే ఉంటారు. ఆ కేసును ఛేదించాలనే చూస్తుంటారు. మోహన్‌లాల్‌ కుటుంబానికి శిక్ష పడేలా చేయడం వారి విధి. కాని నిజంగానే మోహన్‌లాల్‌ కుటుంబం శిక్ష పొందడం లేదా? వారు శిక్షను అనుభవిస్తున్నారు.

కాకపోతే శిక్షగా అందరూ భావించే జైలులో కాదు. తమ జీవనంలో. పోలీసులు ఎప్పుడొస్తారో అని భయం. పెద్ద కూతురికి పీడకలలు. చిన్నకూతురికి ఆందోళన. ఇంటి యజమానికి ఎప్పుడూ పోలీసుల మీద నిఘా. ఆ డెడ్‌బాడీని ఎక్కడ దాచాడో అతడికి మాత్రమే తెలుసు. కాని ఆ బాడీ బయటపడితే? కేసు మొదటికొస్తే? అందరం జైలుకెళ్లాల్సిందే. ఆ మనోవేదనను ఆ కుటుంబం అనుభవిస్తూనే ఉంది. మరోవైపు ఆ చనిపోయిన కుర్రాడి తల్లిదండ్రులు ‘మా అబ్బాయి అస్తికలైనా ఇవ్వు. కర్మకాండలు జరుపుకుంటాం’ అని సెంటిమెంటల్‌గా అడుగుతూ ఉంటే అదొక వేదన. ఇదంతా శిక్ష కాదా? కాదు అంటుంది చట్టం. వారిని జైలులో వేసి బంధిస్తేనే అది శిక్ష అంటుంది. అలాంటి శిక్షకు ఆ ఇంటి పెద్ద సమ్మతంగా లేడు.

‘దృశ్యం 2’ తాజాగా మలయాళ భాషలో అమేజాన్‌లో రిలీజ్‌ అయ్యింది. ‘దృశ్యం’కు సీక్వెల్‌ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఆరేళ్ల తర్వాత ఆ కేసు గురించి మళ్లీ విచారణ మొదలవుతుంది. ఆ సమయానికి ఆ ఇంటి వాళ్లు కొంచెం ఆర్థికంగా బాగుపడి ఉన్నారు. పెద్దమ్మాయి పెళ్లికి రెడీ అయి ఉంది. రెండో అమ్మాయి కాలేజీకి వచ్చింది. కాని వారు మనశ్శాంతితో మాత్రం లేరు. ఊరు జరిగిన హత్యను మరిచిపోలేదు. పుకార్లను మానలేదు. ఆ కుర్రాడు కూతురి కోసం వచ్చాడని ఒకరంటే తల్లి కోసం వచ్చాడని ఒకరంటుంటారు. జనానికి కూడా వీళ్లిలా హాయిగా తిరిగడం నచ్చదు. బాధల్లో ఉండాలి. మరోవైపు పోలీసుల డేగ కళ్లు. ఏదో ఒక రోజు ఆ పోలీసులు శవాన్ని కనిపెడితే ఆ కుటుంబం పని సఫా అయిపోతుంది. కాని అలా సఫా కాకుండా ఉండటానికి ఆ కుటుంబ యజమాని అయిన మోహన్‌లాల్‌ సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నాడని సినిమా చూశాక తెలుస్తుంది. దృశ్యంలో కుటుంబం గెలిచింది. దృశ్యం 2లో కూడా కుటుంబమే గెలిచింది. చట్టం వారికి శిక్ష వేయలేకపోయింది. కానీ వారు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు.

క్రూరమృగం అనుకుని పొదల్లో ఉన్న రుషిని చంపి శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. జంట పక్షులలో ఒకదానిని చంపి ప్రాయశ్చిత్తం గా రుషిగా మారినవారూ ఉన్నారు. నేరం జరగడం, చేయడం మనిషి జీవనంలో అనూహ్యం గా ఉంది. పథకం ప్రకారమూ ఉంది. కాని ఒక్కసారి నేరం జరిగిపోయాక ఇరు పక్షాలు వల్లె వేసే ‘క్షమ’–‘శిక్ష’ అనే మాటలు విస్తారమైన చర్చకు పాత్రమవుతుంటాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న భార్య, అందుకు కారకుడేమోనని భర్తకు శిక్ష వేయించాలని చూసే పెద్దలు, పిల్లల కోసం తనకు శిక్ష పడకూడదని భావించే తండ్రి... ఎవరివైపు నుంచి చూస్తే వారిది ‘సరైన వాదనే’ అనిపిస్తూ ఉంటుంది.

ఇటీవల రాహుల్‌ గాంధీ ‘నా తండ్రిని చంపిన వారిపై నాకు కోపం లేదు’ అన్నాడు. అది భావోద్వేగం. కాని చట్టానికి విధి ఉంటుంది. ఈ భావోద్వేగాలు, చట్టం కర్తవ్యాలు ఎప్పటికీ ఉంటాయి. నడుమ వాటిని చర్చకు పెట్టే ‘దృశ్యం’ వంటి సినిమాలు నాలుగు డబ్బులు చేసుకుంటూ ఉంటాయి. దర్శకుడు జీతూ జోసెఫ్‌కు తిండికి ఢోకా లేదు. డైరెక్టర్‌ రేపెప్పుడైనా ఫెయిల్‌ అయినా డిటెక్టివ్‌ ఏజెన్సీ పెట్టుకొని బతికేయవచ్చు. అంత పకడ్బందీగా ఉందీ సినిమా. తెలుగు రీమేక్‌ కోసం ఎదురు చూడండి.

దర్శకుడు జీతూ జోసెఫ్‌

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement