వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్‌లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు.
ఇప్పటి వరకు బ్రష్ కట్టర్‌తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది.
ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం..
అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్‌మెంట్‌ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు.
పలమనేరు రైతుల సూచనలతో..
ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు.
నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్‌తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్.
పత్తి రైతులకూ ఉపయోగమే!
మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు!
మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది.
ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్‌కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్‌ను వెబ్‌సైట్‌లో పెట్టింది.
ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్‌తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26.
14 నుంచి విశాఖ ఆర్గానిక్
మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది.
విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466.
Comments
Please login to add a commentAdd a comment