![Pesticide Spraying Robot For Precision Agriculture - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/12/Robo1.jpg.webp?itok=uVUL369Z)
పంటలపై చీడపీడీలను అదుపు చేయడానికి పొలాల్లో విష రసాయనిక పురుగుమందులను పిచికారీ చేస్తుంటాం. అయితే, డ్రోన్ల ద్వారా చల్లినా, స్ప్రేయర్లతో చల్లినా.. పంట మొక్కలపైనే కాకుండా పొలం అంతటా నేలపైన కూడా పురుగుమందు పడుతూ ఉంటుంది. దీని వల్ల పురుగుమందు వృథా అవ్వటమే కాకుండా, భూసారం కూడా నాశనమవుతుంది. ఈ సమస్యలకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ నైకో రోబోటిక్స్ చక్కటి పరిష్కారం కనుగొంది.
మొక్కలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిపైన మాత్రమే పురుగుమందును పిచికారీ చేసే అధునాతన రోబోను రూపొందించింది. కృత్రిమ మేధతో నడిచే ఈ స్పాట్ స్ప్రేయర్ రోబోలపై ఆ సంస్థ పేటెంట్ కూడా పొందింది. తమిళనాడులో పుట్టిన జైసింహ అమెరికాలో బీటెక్ ఈసీఈ చదివి కువైట్‌లో ఏడేళ్లు పనిచేసి, స్వదేశానికి వచ్చేశారు. పిచికారీ పద్ధతులను ఆధునీకరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బెంగళూరు కేంద్రంగా 2015లో నైకో రోబోటిక్స్‌ను నెలకొల్పారు.
ఈ రోబో ఎలా పనిచేస్తుందంటే..?
ఈ రోబో ప్రత్యేకతలు ఏమిటంటే.. దీనికి 5 మీటర్ల పొడవైన రెక్కలు రెండు వైపులా ఉంటాయి. ఏకకాలంలో పది మీటర్ల వెడల్పున ఇది పిచికారీ చేయగలదు. ఈ రెక్కలకు కృత్రిమ మేధతో కూడిన కళ్లను అమర్చారు. ఈ కళ్లు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి. మొక్కలు ఉన్న చోట రోబో రెక్కకు ఉన్న నాజిళ్లు తెరచుకొని పురుగుమందును పిచికారీ చేస్తాయి. మొక్క లేకుండా ఖాళీ నేల ఉన్న చోట రోబో రెక్కలకు ఉన్న నాజిళ్లు తెరచుకోవు. కాబట్టి అక్కడ పురుగుమందు పడదు.
60% పురుగుమందు ఆదా
ఈ రోబోతో పిచాకారీ చేస్తే.. 60% పురుగుమందు ఆదా కావటంతో పాటు.. భూ/వాయు కాలుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుందని సంస్థ చెబుతోంది. గత ఏడాది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పత్తి, సోయాబీన్స్, మిర్చి వంటి పంట పొలాల్లో పురుగుమందులు చల్లుతున్న ఈ ఏఐ రోబోలు అక్కడి రైతుల మనసులు చూరగొన్నాయని చెబుతున్నారు. ఎకరానికి రూ.350ల చొప్పున అద్దె చెల్లించి రైతులు తమ పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయించుకుంటున్నారు.
అకోలాకు చెందిన పత్తి, సోయా రైతు యోగేశ్ రౌత్ తన 30 ఎకరాల్లో ఈ రోబో ద్వారా పురుగుమందులు పిచికారీ చేయించుకున్నారు. కూలీలతో పిచికారీ చేయిస్తే ఎకరానికి రూ.1200 ఖర్చయ్యేదని, ఈ రోబో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 500 మంది రైతులు లక్ష ఎకరాల్లో అద్దె రోబోలు పిచికారీ చేశాయట. పురుగుమందులనే కాదు ద్రవరూప ఎరువులు, సేంద్రియ ద్రావణాల పిచికారీకి కూడా ఈ రోబోలు ఉపయోగకరమే.
(చదవండి: జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం)
Comments
Please login to add a commentAdd a comment