
చెన్నైకి చెందిన ప్రతిగయా హరన్ జీవితం లాక్‌డౌన్‌కు ముందు లాక్‌డౌన్ తర్వాత వేరువేరుగా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు స్కూళ్లు, కాలేజీలకు వెళుతూ ఆమె కథలు చెప్పేది. లాక్‌డౌన్ తర్వాత అంతా ముగిసినట్టే అనుకుంది. కాని జూమ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కథలు చెప్పొచ్చు అని ఎప్పుడైతే ప్రయత్నించిందో అప్పటినుంచి ఒక్క చెన్నై ఏంటి ప్రపంచమంతా వినేవాళ్లే. డబ్బులూ వస్తున్నాయి. కథ కూడా ఒక ఉపాధే సుమా.
కథలన్నీ వెళ్లి కరోనా దగ్గరకు చేరే ఈ కాలంలో కూడా కథలు చెప్పి పిల్లలను కాసేపైనా మాయాలోకాలలో విచిత్ర మార్గాలలో సమయస్ఫూర్తి కలిగేలా నీతిని బోధిస్తూ విహరింప చేసే వారున్నారని తెలిస్తే సంతోషం కలుగుతుంది. ఇటీవల ప్రతిగయా హరన్ చెన్నై నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్కూల్ వారి కోసం ఒక ఆన్‌లైన్ కథా సమయం నిర్వహించారు. అయితే అందులో పాల్గొంది పిల్లలు కాదు. టీచర్లు. అవును... పిల్లలేనా కథల మజా చూసేది పెద్దలు ఎందుకు చూడకూడదు అంటారు ప్రతిగయా. నిజమే. పెద్దలు కథలు వింటేనే కదా పిల్లలకు చెప్పగలుగుతారు.
చెన్నై కథలమ్మ
చెన్నైకి చెందిన ప్రతిగయా హరన్ గత ఏడేళ్ల నుంచి ‘స్టోరీ టెల్లింగ్’ను ఒక ఉపాధిగా చేసుకున్నారు. ‘స్టోరీ శాక్’ అనే ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్నారు. తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దలకు కథలు చెప్పే తీరిక లేని ఈ రోజుల్లో పిల్లలకు కథలు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి కథలు చెబుతూ గుర్తింపు పొందారామె. అయితే లాక్‌డౌన్‌కు ముందు ఆమె నేరుగా పిల్లలను కలుస్తూ కథలు చెప్పారు. రెండేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు అన్నీ మూతపడితే తన కథల సంచి కూడా మూలన పడేశారు. అంతా అయిపోయినట్టే అనుకున్నారు కానీ, కాదు.
ఆన్‌లైన్ కథలు
మూడు నెలల క్రితం ఆమె ఇలా ఆన్‌లైన్‌లో కథలు చెబుదాం అని నిశ్చయించుకున్నారు. అయితే సందేహం. పిల్లలు ఎదురుగా ఉంటే వారిని ఆకర్షిస్తూ కథలు చెప్పడం సులువు. ఆన్‌లైన్‌లో అంత బాగా చెప్పగలమా అనుకున్నారు. కాని ఆమె చేసిన మొదటి సెషన్ పెద్ద హిట్ అయ్యింది. పిల్లలు ఆమె కథలు చెబుతుంటే ఎంజాయ్ చేశారు. అంతేనా ఆమె నేరుగా ఉంటే చెన్నైలోని పిల్లలనే కలిసి చెప్పగలదు.
ఆన్‌లైన్‌లో అడ్డంకి ఏముంది? ఎక్కడి వాళ్లకైనా చెప్పగలదు. ‘ఇంతకు ముందు నేను నాలుగు వారాలకు ఒక సెషన్ నిర్వహించేదాన్ని. ఇప్పుడు వారానికి ఒకటి. చాలామంది ఆన్‌లైన్ కథలను ఇష్టపడుతున్నారు’ అంటుంది ప్రతిగయా. జూమ్ ద్వారా ఆమె కథలు చెబుతుంది. ఆ ఒక్క సెషన్‌లో పాల్గొని కథలు వినాలంటే 150 నుంచి 250 వరకూ చెల్లించాలి. ‘అలా చెల్లించి అమెరికా, అరబ్ దేశాలలో నా కథలు వింటున్నారు’ అంది ప్రతిగయా.
కొత్త అనుభూతి
ప్రతిగయా చెన్నైలో పిల్లలకు ఇంగ్లిష్‌లో, తమిళంలో కథలు చెప్పేది. కాని ఆన్‌లైన్‌లో కథలు చెప్పడం మొదలెట్టాక తన మాతృభాషైన రాజస్తానీలో తన స్వరాష్ట్రం రాజస్థాన్ పిల్లలకు చెప్పే అవకాశం వచ్చింది. ‘ఇది ఊహించలేదు’ అంది ప్రతిగయా. ఒక పని చేయాలంటే ఇవాళ ప్రత్యేకంగా ప్రచారం అక్కర్లేదు. వాట్సప్, ఫేస్‌బుక్ చాలు.
మీలో ప్రతిభ ఉంటే మీరు ఇంట్లో కూచునే మంచి వ్యాపకాన్నీ, ఆ వ్యాపకం నుంచి డబ్బును కూడా సంపాదించవచ్చు అంటుంది ప్రతిగయా. ఆమె చేసిన ఇంకో విశేషమైన పని ఏమిటంటే పెద్దలకు కథలు చెప్పడం. పెద్దవాళ్లు వచ్చి కథలు వినండి... బాల్యం గుర్తొస్తుంది.. ఉల్లాసమూ కలుగుతుంది అంటుందామె. ఇప్పుడు ఆమె కథలను నిజంగానే ఆబాలగోపాలం వింటున్నారు.
చదవండి: పెట్రోలుపై రూ. 3 తగ్గింపు.. నష్టాన్ని భరిస్తామన్న ప్రభుత్వం!
Comments
Please login to add a commentAdd a comment