గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు.. అసలే ఇటీవలికాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూరగాయలకు, సరుకుల కోసం నగరంలో తిరిగి ఉండడంతో తనకు కరోనా ఏమన్నా సోకిందా అన్న మీమాంసలో పడిపోయాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ఎందుకయినా మంచిదని, ఇంట్లోనుంచి బయటకు రాకుండా మందులు వాడుతూ ఉండిపోయాడు. అతని ఆందోళనను గమనించిన స్నేహితుడు ఒకసారి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోమని ఫోన్‌లో సలహా ఇచ్చాడు. వెంటనే పరీక్ష కేంద్రానికి వెళ్లి నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాడు.. నెగెటివ్ అని తేలడంతో ఆందోళనతో పాటు జ్వరం కూడా తగ్గిపోయింది.
విజయవాడకు చెందిన ఒక మహిళ తనకు గతకొన్ని రోజులుగా విపరీతమైన జ్వరం వస్తున్నా.. ఇరుగుపొరుగు వారికి భయపడి పరీక్షలు చేయించుకోలేదు. తెలిసిన మందులు వాడుతోంది. పక్కింటివారు ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇచ్చినా, నాకు మామూలు జ్వరమే అంటూ, వచ్చిన వారిని, పక్కింటివారిని గదమాయించింది. రెండు రోజులు గడిచాక ఒకరోజు రాత్రి ఆయాసం ఎక్కువై ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో భర్త ఒక అంబులెన్స్‌లో కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చి, ఐసీయూలో ఉంచి, ఆక్సిజన్ పెట్టారు. పదిరోజులు అబ్జర్వేషన్‌లో ఉంచితే కానీ ఆమె మామూలు స్థితికి రాలేదు. ఆమె భర్త, పిల్లలు సైతం కోవిడ్ బారిన పడ్డారు.
సాక్షి, గుంటూరు: ప్రపంప వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాల ప్రజలు అల్లాడిపోతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మార్చి నెల నుంచి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఏది కరోనా? ఏది సీజనల్ ? అనే విషయాన్ని తెలుసుకోలేక కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలో వస్తున్న కరోనా సమాచారం చదివి ముందస్తుగానే మాత్రలు తీసుకుంటూ... వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటున్నామని తమకు ఏమీ కాదనే నిర్లక్ష్య ధోరణితో ఉండి సకాలంలో వైద్యం చేయించుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కేసులు, సీజనల్ వ్యాధుల కేసులు రెండు కూడా నేడు నమోదు అవుతున్నా దష్ట్యా ప్రజలు వ్యాధులపై అవగాహన కల్గి ఉండి అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సీజనల్ వ్యాధుల కాలంతో తికమక...
కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్న సమయంలోనే మరోపక్క వర్షాకాలం కూడా ప్రారంభం అవ్వటంతో అక్కడక్కడ సీజనల్ వ్యాధులు సైతం వస్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 27 మలేరియా కేసులు, 57 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. మరో నాలుగు నెలలపాటు సీజనల్ వ్యాధుల కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. జ్వరం వచ్చినా, దగ్గినా, తుమ్మినా, జలుబు వచ్చినా కరోనా జ్వరమా లేక సీజనల్ జ్వరమా అనే అనుమానం ప్రజల్లో విస్తృతంగా తలెత్తుతోంది. ఏది కరోనా, ఏది సీజనల్ అనే విషయం తెలియక త్రీవంగా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి దగ్గు వచ్చినా గుండెల్లో దడ పుడుతుంది. జ్వరం వస్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఒంటి నొప్పులు, తలనొప్పి వస్తే భయం వెంటాడుతుంది.
తీవ్ర జ్వరమైతే పరీక్ష తప్పనిసరి..
వానాకాలం కొనసాగుతూ ఉంది కాబట్టి దోమల బెడద కూడా ఉంటుంది. వర్షాలతోపాటే సీజనల్ వ్యాధులైన వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు సహజంగానే వస్తాయి. కరోనా తీవ్రంగా విజృంభిస్తూ ఉండటంతోపాటుగా సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉండటం రెండింటిలోనూ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండటంతో జనం గజగజ వణికి పోతున్నారు. ఈ రెండింటిని వేరు చూసి చూడటం అంత సులువు కాదని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. అలాగని చిన్నపాటి జ్వరం, దగ్గును కరోనాగా భావించి ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని జనరల్ మెడిసిన్ వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కంచర్ల సుధాకర్ తెలిపారు.
కొన్ని లక్షణాలతో కరోనానా? సీజనల్ వ్యాధా? అనే విషయం తెలుసుకోవచ్చని వెల్లడించారు. లక్షణాలు ఏవైనా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిస్తే కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారు పరీక్షలు చేయించకోవాలి. ఇళ్లలోనే ఉండే వాళ్లు తమకు ఉన్న లక్షణాలను క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. సీజనల్ లేదా సాధారణ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే మూడు రోజుల్లో తగ్గుతుంది. అలా తగ్గకుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. గుండె, కిడ్నీ, క్యాన్సర్, హెచ్‌ఐవీ, బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు...
వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాలి. చాలా మంది అవగాహన లేక ఆలస్యంగా ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇళ్ల వద్దకు ఆశా వర్కర్లు, వలంటీర్లు వచ్చి అడిగినప్పుడు ఏ లక్షణాలు లేవని చెబుతున్నారు. చివరి నిమిషం వరకు ఇంట్లో ఉండి ఊపిరి ఆడని పరిస్థితిలో ఆస్పత్రికి వస్తున్నారు. అప్పటికే ఆక్సిజన్ తగ్గిపోవటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రజలు కరోనాపై అవగాహన పెంచుకోవాలి. కరోనా ప్రారంభంలో జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన తెలియకపోవటం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ఉంటాయి. నాలుగు, ఐదో రోజు నుంచి దగ్గు ఎక్కువై ఆయాసం వస్తే వెంటనే ఆస్పత్రికి రావాలి.
– డాక్టర్ కంచర్ల సుధాకర్, గుంటూరు, ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment