
కొటక్ యాడ్ నుంచి సేకరించిన ఫొటో(ప్రతీకాత్మకం)
మహిళలు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగలరు. ధైర్యంతో ముందడుగు వేసి అద్భుతాలు సృష్టించగలరు. పుణెకు చెందిన యోగిత సతవ్ ఇందుకు చక్కని ఉదాహరణ. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారామె. ఆమె ఆత్మవిశ్వాసం, ప్రదర్శించిన ధైర్య సాహసాలే ఓ కుటుంబాన్ని నిలబెట్టాయి.
జనవరి 7, 2022. 20 మంది మహిళలు కలిసి ఓ మినీ బస్సులో పిక్‌నిక్‌కు బయల్దేరారు. పుణె శివార్లలో సరదాగా గడపాలని భావించారు. కానీ ఇంతలో అనుకోని ఉపద్రవం ముంచుకువచ్చింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు అతడిని ఎలా కాపాడాలో అర్థంకాక బిక్కచచ్చిపోయారు.
42 ఏళ్ల యోగిత మాత్రం అలా చూస్తూ ఊరుకోలేకపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. గతంలో కారు నడిపిన అనుభవం ఉన్న ఆమె.. బస్సును ముందుకు పోనిచ్చారు. 35 కిలోమీటర్ల పాటు డ్రైవింగ్ చేసి సదరు డ్రైవర్‌ను ఆసుపత్రికి చేర్చారు. కథ సుఖాంతమైంది.
హాట్సాఫ్ యోగిత
కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ #DriveLikeALady క్యాంపెయిన్‌లో భాగంగా యోగిత ధైర్యసాహసాలపై ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించింది. ఆపత్కాలంలో ఆమె వ్యవహరించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడింది. మహిళా డ్రైవర్ల సేవల పట్ల సానుకూలతతో ముందుకు సాగేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో యోగితపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హ్యాట్సాఫ్ యోగిత అంటూ ఆమెను కొనియాడుతున్నారు. ఇక బస్సు నడపడం గురించి యోగిత గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత 20 ఏళ్లుగా మారుతి సెలరియో, అసెంట్, ఓమిని వ్యాన్ నడుపుతున్నాను. అయితే, బస్సు నడపడం ఇదే తొలిసారి. ఆ సమయంలో నాకు వేరే మార్గం కనిపించలేదు’’ అని పేర్కొన్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మనం కూడా యోగితకు ముందుగానే విషెస్ చెప్పేద్దాం!
Comments
Please login to add a commentAdd a comment