రాణాల ప్రతాపానికి ప్రతీక | Raj Mahal Palace in Rajasthan | Sakshi
Sakshi News home page

రాణాల ప్రతాపానికి ప్రతీక

Published Mon, Sep 16 2024 10:34 AM | Last Updated on Mon, Sep 16 2024 10:34 AM

Raj Mahal Palace in Rajasthan

రాజ్‌ మహల్‌... తాజ్‌ మహల్‌ కాదు, రాజ్‌ మహలే. రాజస్థాన్‌లో చల్లటి నగరం ఉదయ్‌పూర్‌లో ఉందీ రాజ్‌మహల్‌. రాజస్థాన్‌ అనగానే విస్తారమైన ఎడారి, ఇసుక తిన్నెలు, ఎండకు మిలమిల మెరుస్తున్న ఇసుకలో సుదూర ప్రయాణం చేస్తున్న ఒంటె అడుగు జాడలు గుర్తొస్తాయి. దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఉదయ్‌పూర్‌. నగరంలో ఎటు వెళ్లినా ఒక వాటర్‌ బాడీ కనిపిస్తుంది. కనుచూపు మేరలో ఆరావళి పర్వతాలు పచ్చగా ఉంటాయి. ఆ పచ్చదనానికి దీటుగా నగరంలో కోటలోపల ప్యాలెస్‌ల మీద కూడా చెట్లు ఉంటాయి. వాటిని చెట్లు అనకూడదు, మహావృక్షాలవి. కొండ శిఖరం, వాలును ఆసరాగా చేసుకుని నిర్మించిన ప్యాలెస్‌లో చెట్ల మొదళ్లు మూడో అంతస్థులో ఉంటాయి. 

రాజ్‌మహల్‌ పేరుతో నిర్మించినప్పటికీ సిటీప్యాలెస్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ప్యాలెస్‌ గురించి చెప్పుకునే ముందు పద్మావత్‌ సినిమాలో చూసిన చిత్తోరగఢ్‌ను గుర్తు చేసుకోవాలి. మహారాణా ఉదయ్‌ సింగ్‌ (రాణాప్రతాప్‌ తండ్రి) పుట్టిన కోట అది. అది అన్యాక్రాంతమైన తర్వాత ఉదయ్‌సింగ్‌ ఈ నగరాన్ని నిర్మించి ఇక్కడి నుంచే పాలన కొనసాగించాడు. నగరం శత్రుదుర్భేద్యంగా ఉండాలి, అదే సమయంలో నీటికి ఇబ్బంది లేకుండానూ ఉండాలనే ఉద్దేశంతో కొండలు, సరస్సుల మధ్య నిర్మించాడు. అందుకే దీనిని లేక్‌ సిటీ, కశ్మీర్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ అంటారు.

వంట పాత్రలు... ఇనుప కవచాలు
సిటీ  ప్యాలెస్‌... పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. సిటీ ప్యాలెస్‌ ఎక్స్‌టీరియర్‌ వ్యూ అది కూడా ఒక వైపు కవర్‌ చేయాలంటే పిచోలా లేక్‌లో బోట్‌ షికారు చేయాలి. రాణి వంట గది ప్యాలెస్‌ లోపల ఉంటుంది. సిసోడియా రాజ వంశీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. రోజూ సూర్యుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. ప్యాలెస్‌లోపల అనేక చోట్ల సూర్యుడి లోహపు రూ΄ాలుంటాయి. శీతాకాలంలో మబ్బు పట్టి సూర్యుడు కనిపించని రోజుల్లో లేత కిరణాలు ఆ లోహపు సూర్యుడి ప్రతిమ మీద ప్రతిబింబిస్తాయి. ఆ ప్రతిబింబానికి నమస్కారం చేసి వంటకాలు నివేదన చేస్తారు. 

సూర్యుడికి నివేదించే వంటలను ప్యాలెస్‌ లోపలి వంటగదిలో రాణి స్వయంగా చేయడం ఆనవాయితీ. ప్యాలెస్‌ ద్వారాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయా అనిపిస్తాయి. తల పైకెత్తి చూడాలి. కొన్ని గదుల్లోకి మాత్రం నడుము వరకు వంగి వెళ్లాలి. శత్రువులు దాడి చేసినప్పుడు రక్షణ కోసం ఆ ఏర్పాటు. కొన్ని గదుల్లో యుద్ధ సామగ్రి ఉంటుంది. మహారాణా ప్రతాప్‌ భుజాల నుంచి మోకాళ్ల వరకు ధరించిన ఇనుప కవచం మన ఎత్తు ఉంటుంది. దానిని చూస్తూ ఆశ్చర్యపోయే లోపు గైడ్‌ పక్కనే ఉన్న గుర్రాన్ని చూపిస్తాడు. అది చేతక్‌ నమూనా. మహారాణా ప్రతాప్‌ సింగ్‌ గుర్రం పేరు చేతక్‌. తెల్లగా ఉంటుంది. 

ఆ గుర్రం నమూనా తయారు చేసి చేతక్‌ ధరించిన కవచాన్ని ధరింపచేశారు. రాజు ఒక్క ఉదుటున ఆ గుర్రం మీదకు ఎక్కాలంటే రాజు ఎత్తు ఎంత ఉంటుంది! అనే సందేహాన్ని ఎదురుగా ఉన్న కవచం నివృత్తి చేస్తుంది. ప్యాలెస్‌లో రాణి గది ఎదురుగా ΄ాలరాతి బెంచ్‌ ఉంటుంది. రాజు మందిరానికి వచ్చినప్పటికి రాణి అలంకరణ పూర్తి కాకపోతే, అలంకరణ పూర్తయ్యే వరకు రాజు ఆ ఆసనం మీద కూర్చుని ఎదురు చేసేవాడని గైడ్‌ చెప్పినప్పుడు పర్యాటకుల పెదవుల మీద ఓ చిరునవ్వు విరుస్తుంది. ప్యాలెస్‌ లోపల కొంత భాగంలో రాజకుటుంబం నివసిస్తోంది. కొంత భాగంలోనే పర్యాటకులను అనుమతిస్తారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement