అక్క కూడా అమ్మే | Renu Singh Done Everything To Transplant Kidney To Her Sister | Sakshi
Sakshi News home page

అక్క కూడా అమ్మే

Published Wed, Aug 19 2020 12:02 AM | Last Updated on Wed, Aug 19 2020 12:02 AM

Renu Singh Done Everything To Transplant Kidney To Her Sister - Sakshi

చిన్న చెల్లెలికి కిడ్నీ సమస్య వచ్చింది. పెద్దక్కకు ప్రాణం విలవిలలాడింది. తల్లి కిడ్నీ మేచ్‌ కాకపోయేసరికి నేను కూడా తల్లిలాంటిదాన్నే నా కిడ్నీ తీసుకోండి అంది. నువ్వు ఇవ్వాలంటే 20 కేజీలు బరువు తగ్గాలి అన్నారు డాక్టర్లు. 20 కేజీలంటే మాటలు కాదు. కాని చెల్లెలి కోసం శ్రమించింది. అక్టోబర్‌లో మొదలుపెట్టి జూలై నాటికి 20 కేజీలు తగ్గింది. చెల్లి కోసం ఇంకా ఏం చేయాలో చెప్పండి అంటోంది.

అహ్మదాబాద్‌లో ప్రసిద్ధ కిడ్నీ పరిశోధక, చికిత్సా కేంద్రం– ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిడ్నీ డిసీజెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐ.కె.డి.ఆర్‌.సి) ఉంది. హాస్పిటల్‌లో ఉండే కిడ్నీ పేషెంట్లను అటెండ్‌ చేయడానికి వచ్చే వారి కోసం ఆ సెంటర్‌ బయట చిన్న చిన్న లాడ్జీలు ఉంటాయి. ఒక సింగిల్‌ రూమ్‌లు దొరుకుతాయి. అలాంటి ఒక సింగల్‌రూమ్‌లో 40 ఏళ్ల రేణు సింగ్‌ ఏడెనిమిది నెలలుగా ఉంటోంది. చెల్లెలి కోసం. చెల్లెలు హాస్పిటల్‌లో. అక్కడ బయట లాడ్జి గదిలో. వారిద్దరూ ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే చెల్లెలికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ జరగాలి. కాని అది వాయిదా పడుతూనే ఉంది.

మూడేళ్ల క్రితం
రేణు సింగ్‌ ముంబైలో భర్తతో కుమారుడితో ఉంటుంది. ఆమె చెల్లెలు రాణి సింగ్‌ (32) పెళ్లి చేసుకుని ఉత్తర ప్రదేశ్‌లో ఆజమ్‌ఘర్‌లో స్థిరపడింది. ఆమెకు మూడేళ్లుగా కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. భర్తతో కలిసి వారణాసిలో, ఆ తర్వాత లక్నోలో వైద్యం చేయించుకుంది. కాని వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేసుకుని స్థితికి చేరుకోవడంతో డాక్టర్లు అహ్మాదాబాద్‌లోని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు వెళ్లి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ వెంటనే చేయించుకోవలసిందిగా సూచించారు. తల్లి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. వారు అక్టోబర్‌ 2019లో అహ్మదాబాద్‌ చేరుకున్నాక డాక్టర్లు తల్లి కిడ్నీని పరీక్షలు చేసి ఆమె ఆరోగ్య, వయసు రీత్యా కిడ్నీ ఇవ్వడానికి సరిపోదు అని నిర్థారించారు. ఈ విషయం రేణుకు తెలిసింది. చెల్లెలిని కాపాడుకోవాలంటే తాను కిడ్నీ ఇవ్వాల్సిందే అని గ్రహించింది.
రేణు సింగ్‌ (ఎడమ నుంచి రెండో వ్యక్తి), రాణి సింగ్‌ (చివరి వ్యక్తి). తండ్రి మరొక చెల్లితో.

కూతురు ఒకింటి కోడలే
కిడ్నీ ఇవ్వడం మగవారికి కొంత సులువేమో కాని స్త్రీలకు అంత సులువు కాదు ఈ దేశంలో. ఎందుకంటే ఆమె ఒకింటి కోడలు అయి ఉంటుంది. భర్త అనుమతి, అత్తామామల అనుమతి అవసరమవుతాయి. పుట్టింటి కోసం మెట్టినింటి మనిషిని ప్రమాదంలో పడేయడానికి విముఖత ఎదురు కావచ్చు. అయితే అదృష్టవశాత్తు రేణు సింగ్‌ భర్త, అత్తామామలు అందుకు అంగీకరించారు. రేణు అత్తగారి తమ్ముడు మరొకరికి కిడ్నీ దానం ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో అవయవదానం పట్ల అవగాహన ఉంది. ఇక రేణు కొడుకైతే అన్ని వివరాలు గూగుల్‌ చేసి ‘అమ్మా... పిన్నికి కిడ్నీ ఇవ్వు. నిన్ను నేను సపోర్ట్‌ చేస్తాను’ అని సపోర్ట్‌ చేశాడు. ఇంకేం కావాలి... ఒక అక్కకు చెల్లెలిని కాపాడుకోవడానికి.

క్రాస్‌మేచ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌
అహ్మదాబాద్‌ కిడ్నీ సెంటర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం క్షుణ్ణంగా పరీక్షలు చేస్తారు. డి.ఎన్‌.ఏ టెస్ట్‌తో సహా ఈ పరీక్షలు ఉంటాయి. రేణుకు పరీక్షలు నిర్వహించారు. ఆమె కిడ్నీ పనికి వస్తుందికానీ నేరుగా చెల్లెలికి ఇవ్వడానికి మేచ్‌ కావడం లేదు. దీంతో డాక్టర్లు క్రాస్‌మేచ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం రేణు కిడ్నీ పరీక్షల వివరాలను కంప్యూటర్‌కు ఇచ్చారు. కంప్యూటర్‌ సెర్చ్‌ చేసి రాజస్థాన్‌లోని మున్నారామ్‌ అనే కిడ్నీ బాధితునికి రేణు కిడ్నీ సరిపోతుందని మున్నారామ్‌ తండ్రి కిడ్నీ రాణికి సరిపోతుందని తేల్చింది. అంటే రేణు కిడ్నీని ఆ కుర్రాడికి, ఆ కుర్రాడి తండ్రి కిడ్నీని రేణు చెల్లెలికి అమరుస్తారు.

బరువు సమస్య
అంతా సరిపోయింది అని సంతోషపడుతున్నంతలో రేణు బరువు ఒక సమస్య అయ్యింది. ఇంత బరువు ఉన్నవారు కిడ్నీ దానమిస్తే ఆ తర్వాత కాంప్లికేషన్స్‌ వస్తాయి అన్నారు డాక్టరు. రేణును 20 కేజీల బరువు తగ్గమన్నారు. ముంబైలో ఉంటూ ఇదంతా చేయాలంటే సాధ్యం కాదని అక్టోబర్‌ నుంచి రేణు కూడా అహ్మదాబాద్‌లో ఉండిపోయింది. హాస్పిటల్‌లోని చెల్లెలి బాగోగులు చూసుకుంటూ తాను బరువు తగ్గే పని పెట్టుకుంది. ఆహారంలో క్రమశిక్షణ, వ్యాయామం వీటన్నింటితో జూలై నాటికి 20 కేజీల బరువు తగ్గింది. ఇంత శ్రమ అవసరమా అంటే ‘నేను నా చిన్న చెల్లెల్ని అమ్మలా పెంచాను చిన్నప్పుడు. దాన్నెలా వదులుతాను’ అంటోంది.

ఊరుకాని ఊరులో చెల్లెలి కుటుంబం ఉండటం, చెల్లి కోసం తాను వచ్చి ఉండటం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. వారి దగ్గర డబ్బులు అయిపోయాయి. కాని అందరి మద్దతు వారికి దొరకుతోంది. ‘లాక్‌డౌన్‌ లేకపోతే ఈసరికి సర్జరీ అయిపోయేది. దాని కోసమే ఆశగా ఎదురు చూస్తున్నాం’ అని రేణు సింగ్‌ అంది. ‘కంటే కూతురిని కను’ అని మన దగ్గర అంటారు. ‘కంటే అక్కను కను. తర్వాత ఎవరినైనా కను’ అని రేణుని చూస్తే అనబుద్ధేస్తుంది. ఆ అక్కచెల్లెళ్లు త్వరలో చిరునవ్వులు చిందిస్తూ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటారని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement