ప్రపంచవ్యాప్తంగా భూతాపం ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా చాలాప్రాంతాల్లో వేసవులు మరింతగా నిప్పులు చెరుగుతున్నాయి. శీతకాలాలు నులివెచ్చగా మారుతున్నాయి. భూతాపం నియంత్రణ లేకుండా పెరుగుతూపోతే, భవిష్యత్తులో భూమ్మీద జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. పరిస్థితి ఆ స్థాయికి దిగజారిపోక ముందే భూతాపాన్ని అదుపులోకి తేవడానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా నిర్విరామంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎండ ధాటిని తగ్గించడానికి ఏకంగా పుడమికే గొడుగు పట్టడానికి సన్నాహాలు ప్రారంభించారు. శాస్త్రవేత్తలు పుడమికి గొడుగు పట్టగలిగితే, దాని ఫలితంగా భూమ్మీద వేడి తీవ్రత చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. వేసవి తీవ్రత భరించగలిగే స్థాయికి పరిమితమవుతుంది. పుడమికి గొడుగు పట్టడంతో పాటు భూతాపాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు మరికొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంత త్వరగా ఫలిస్తే, రానున్న వేసవులు అంత త్వరగా చల్లబడే అవకాశాలు ఉంటాయని ఆశించవచ్చు. భూతాపం తగ్గించడానికి ప్రస్తుతం శాస్త్రవేత్తలు సాగిస్తున్న వినూత్న, విలక్షణ ప్రయోగాలపై ఒక విహంగవీక్షణం...
భూతాపం పెరుగుదలకు గల కారణాలను శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకొస్తే భూతాపం అదుపులోకి వస్తుందని వారి అంచనా. అయితే, భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకురావడమే పెను సవాలుగా నిలుస్తోంది. విచ్చలవిడిగా వాతావరణంలోకి చేరుతున్న కర్బన ఉద్గారాలు, అడవుల నరికివేత, వాహనాల వినియోగంలో పెరుగుదల, వనరుల అతి వినియోగం వంటివి భూతాపం పెరుగుదలకు దారి తీస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యం కావడంలేదు సరికదా, ఇవన్నీ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఏకంగా పుడమికి గొడుగు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు.
మన తల మీద గొడుగు నీడ ఉంటే, ఎండ వేడి తీవ్రత నేరుగా నెత్తిమీద పడకుండా ఉన్నట్లే, అంతరిక్షం నుంచి భూమికి గొడుగు పడితే, దాని నీడ వల్ల భూమ్మీద వేడి తీవ్రత గణనీయంగా తగ్గి, మనుషులకు వేసవి కష్టాలు కొంతవరకైనా తీరగలవని అంచనా వేస్తున్నారు.గొడుగు నీడతో పుడమికి చల్లదనం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద ఒక చదరపు మైలు (2.589 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో నీడ కల్పించగలిగితే, రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 2.7 డిగ్రీల ఫారెన్‌హీట్ (–16.27 డిగ్రీల సెల్సియస్) మేరకు ఉష్ణోగ్రతను తగ్గించగలమని ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుడమికి గొడుగు పట్టే ప్రయత్నంలో తొలుత ప్రయోగాత్మకంగా వంద చదరపు అడుగుల నమూనాను అంతరిక్షంలోకి పంపాలని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దీనికి 20 మిలియన్ డాలర్లు (రూ.166.17) కోట్లు ఖర్చు కాగలవని, 2027 నాటికి వంద చదరపు అడుగుల నమూనా గొడుగును అంతరిక్షంలోకి పంపగలమని వారు చెబుతున్నారు.
ధరిత్రీ ఛత్రవిలాసం
ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ఈ గొడుగు వివరాలను మీడియాకు వెల్లడించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా భూమికి శాశ్వతమైన నీడ కల్పించాలని వారు భావిస్తున్నారు. ‘కూల్ ఎర్త్’ ప్రాజెక్ట్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో భాగంగా తొలుత చేపట్టనున్న వంద చదరపు అడుగుల నమూనా గొడుగు ప్రయోగం విజయవంతమైతే, ఆ తర్వాత త్వరలోనే దాదాపు అర్జెంటీనా దేశం విస్తీర్ణంతో సమానమైన (దాదాపు 27.8 లక్షల చదరపు కిలోమీటర్లు) అతిపెద్ద గొడుగును అంతరిక్షంలోకి పంపి, అక్కడి నుంచి భూమికి శాశ్వతంగా నీడ కల్పించాలనుకుంటున్నారు. దీనికయ్యే ఖర్చు కొన్ని లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉండవచ్చని వారి అంచనా.
‘అంతరిక్షంలో ఇలాంటి భారీ నిర్మాణాలను ఏర్పాటు చేయాలంటే, అందుకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి ప్రయోగాల కోసం రక్షణ శాఖ బడ్జెట్ నుంచి, అంతర్జాతీయ సహకారం నుంచి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోగానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 3 మిలియన్ డాలర్లు (రూ.24.92 కోట్లు) ఇప్పటికే ఇచ్చారు. భూమిపై సూర్యకాంతి తక్కువగా పడేలా చేసే ప్రయోగాలకు బాసటగా ఉంటామని గత ఏడాది అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించారు’ అని ఇజ్రాయెలీ శాస్త్రవేత్త అవీ లోయబ్ తెలిపారు.
అంతరిక్షంలోకి ఎలా చేరవేస్తారంటే..
ఈ గొడుగును సౌరశక్తితో పనిచేసే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి చేరవేస్తారు. తక్కువ బరువు కలిగిన ‘సోలార్ సెయిల్స్’తో రూపొందిన ఈ గొడుగును మొదటి ల్యాగ్‌రేంజ్ పాయింట్ (ఎల్1) వద్ద నిలిచేలా చేస్తారు. ఈ ప్రదేశంలో భూమి, సూర్యుడి ఆకర్షణ వికర్షణ శక్తులు గరిష్ఠ స్థాయిలో ప్రభావం చూపుతాయి. ఈ ప్రదేశంలో గొడుగును నిలిపి ఉంచడం ద్వారా భూమి ఉపరితలంపై ఎక్కువభాగంలో నీడ పడుతుంది. భూమి నుంచి ఈ ఎల్1 పాయింట్ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి భూమి ఉపరితలంపై ఎక్కువ ప్రదేశంలో నిరంతరాయంగా పలచని నీడ పడుతుండటం వల్ల భూతాపం గణనీయంగా తగ్గుతుంది. ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ప్రస్తుత అంచనాల మేరకు ఈ గొడుగును సకాలంలో అంతరిక్షంలోకి పంపకుంటే మాత్రం ఈ ప్రాజెక్టు ఖర్చు ఊహాతీతంగా పెరిగే ప్రమాదం ఉందని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ‘ఇప్పటికి అనుకుంటున్న సమయంలోగా ఈ భారీ గొడుగును అంతరిక్షంలోకి పంపకుంటే, ఈ ప్రాజెక్టు ఖర్చు చుక్కలను తాకే అవకాశం ఉంది.
ఇది ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంది’ అని ఫ్రాన్స్‌లోని యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్ సైంటిఫిక్ కంప్యూటింగ్‌కు చెందిన పరిశోధకురాలు సూజన్ బోయెర్ వ్యాఖ్యానించారు. ఈ భారీ ప్రయోగానికి జరిగే ఖర్చు గురించి మాత్రమే కాదు, ఈ అంశంలో శాస్త్రవేత్తలకు మరికొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఈ గొడుగును అంతరిక్షంలో ఎల్1 పాయింట్ వద్ద సుదీర్ఘకాలం స్థిర కక్ష్యలో నిలిపి ఉంచడం ఎంతవరకు సాధ్యమనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలో అదుపు తప్పే గ్రహశకలాలు తాకినా, సౌర తుఫానులు చెలరేగినా ఈ గొడుగు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని, అప్పుడు లక్షల కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రయోగం వృథా అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
సముద్రాల్లో నాచు పెంపకం..
భూతాపం పెరుగుదల భూభాగానికి మాత్రమే పరిమితం కావడం లేదు. భూతాపం ప్రభావానికి సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయి. సముద్రాలలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుదల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని గుర్తించిన శాస్త్రవేత్తలు సముద్రాలను చల్లబరచేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సముద్రాల ఉపరితల వాతావరణంలోకి మితిమీరి చేరిన కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడానికి ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ వంటి ప్రక్రియలను ప్రారంభించారు. ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ భారీ స్థాయిలో చేపట్టే జియోఇంజినీరింగ్ ప్రక్రియ. ఇందులో సముద్రాల ఉపరితలంపై సూర్యరశ్మి నేరుగా సోకే పొరలలో సముద్రపు నాచు పెరిగేలా చేస్తారు. సముద్రపు నాచు తన పోషకాల కోసం జరిపే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా పరిసరాల్లోని వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చేసుకుంటుంది. సముద్ర ఉపరితల పరిసరాల్లోని వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఈ పద్ధతిలో గణనీయంగా తగ్గుతుంది.
ఫలితంగా సముద్రాల ఉపరితలం చల్లబడి, సముద్రంలో బతికే చిన్నా పెద్దా జలచరాలు సురక్షితంగా మనుగడ సాగించగలుగుతాయి. సముద్రంలో నాచు త్వరగా పెరగడానికి నైట్రోజన్, ఐరన్ వంటి పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలను నేరుగా సముద్రం ఉపరితలంపై చల్లడం ద్వారా సముద్రపు నాచు త్వరగా, ఎక్కువగా పెరిగేలా చేస్తారు. ఇదంతా ఒకరకంగా మొక్కలకు ఎరువు వేసే ప్రక్రియలాంటిదే! కాబట్టి ఈ ప్రక్రియను ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ అని, ‘ఓషన్ నరిష్‌మెంట్’ అని అంటున్నారు. సముద్రాల ఉపరితలంలో నాచు పెంచడం ద్వారా భూతాపాన్ని తగ్గించే ఈ ప్రయత్నంలో కొన్ని లాభాలు ఉన్నా, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రాల ఉపరితలంపై నాచు పెంచడంలో ఎలాంటి రసాయనాల వినియోగం జరగదు. అందువల్ల ఇది చాలావరకు సురక్షితమైన పద్ధతి.
ఈ ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి లేదా సముద్రంలోకి కాలుష్యాలు విడుదలయ్యే సమస్య ఉండదు. దీని వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ గాఢత కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రక్రియ నేరుగా వాతావరణంపై తక్షణ ప్రభావం చూపదు. కాకుంటే, భూతాపం పెరుగుదలలో ఉధృతిని నిదానంగా తగ్గిస్తుంది. అయితే, సముద్రాల ఉపరితలంపై నాచును మోతాదుకు మించి పెంచినట్లయితే, సముద్రంలో జీవించే జలచరాల సహజమైన ఆహారచక్రం గతి తప్పి, కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో నాచు మితిమీరి పెరిగితే, కొన్ని రకాల చేపలు తదితర జలచరాల జనాభా గణనీయంగా క్షీణించే ప్రమాదం కూడా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఏళ్లనాటి ఆలోచన
ఆకాశం నుంచి భూమికి గొడుగు పట్టాలనే ఆలోచన ఈనాటిది కాదు. శాస్త్రవేత్తలు 1923 నుంచి ఈ దిశగా ఆలోచనలు చేస్తూ వస్తున్నారు. జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెర్మన్ ఓబెర్త్ ఈ దిశగా తన ప్రయోగాల్లో కొంత ముందంజ కూడా వేశారు. అంతరిక్ష కక్ష్యలోకి 100–300 కిలోమీటర్ల వ్యాసం పరిధిలో భారీ అద్దాలను పంపడం ద్వారా భూమ్మీద పడే సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని ఓబెర్త్ ప్రతిపాదించాడు. సూర్యకాంతిని నిరోధించడం ద్వారా భూతాపాన్ని తగ్గించే దిశగా ఆయన 1923 నుంచి 1978 వరకు విస్తృతంగా పరిశోధనలు సాగించాడు. భూమికి సూర్యడికి మధ్యన ఒక డిస్క్‌లాంటిది అంతరిక్షంలో ఏర్పాటు చేయడం ద్వారా భూమ్మీద పడే సూర్యరశ్మి వేడిని తగ్గించగలమని 1989లో మరికొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.
ఈ డిస్క్‌కు సౌర ఫలకాలను అమర్చినట్లయితే, వాటి నుంచి అపరిమితంగా సౌర విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచన చేశారు. అయితే, ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇవి జరిగిన చాలాకాలం తర్వాత రెండేళ్ల కిందట మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అలివీయా బోర్గ్, ఆండ్రూస్ హీన్‌లు ఈ దిశగా మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. స్పేస్‌ఎక్స్ షిప్ వంటి వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి అతిసన్నని పాలిమర్ నానో బుడగలతో కూడిన అతిపలుచని ఫిల్మ్‌ను పంపి, సూర్యడికి భూమికి మధ్య తెరలా ఏర్పాటు చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనకు కార్యాచరణ దిశగా అడుగులు ముందుకు పడలేదు.
కార్బన్ క్యాప్చరింగ్..
భూతాపం పెరుగుదలకు అతిపెద్ద కారణం కర్బన ఉద్గారాల పెరుగుదల. కార్బన్ కణాలు వాతావరణంలోకి మోతాదుకు మించి చేరడం వల్ల భూతాపం గణనీయంగా పెరుగుతోంది. వాతావరణంలో కలిసే కర్బన కణాలను యంత్రాల ద్వారా పీల్చేసి, సేకరించే పద్ధతికి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఈ సాంకేతికతను ‘కార్బన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ’ అంటున్నారు. పారిశ్రామిక కర్మాగారాలు ఎక్కువగా ఉండేచోట వాటి నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువుల నుంచి కార్బన్ కణాలను పీల్చివేయడానికి భారీ యంత్రాలను ఏర్పాటు చేస్తారు.
ఈ యంత్రాలు గాలిలోకి కార్బన్ కణాలు చేరకుండా నిరోధిస్తాయి. గాలి నుంచి పీల్చేసిన కార్బన్ కణాలను ఈ యంత్రాలు ఘనరూపంలో బంధించి ఉంచుతాయి. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి యంత్రాలను నెలకొల్పారు. ఇవి గాలిలో కలిసే కార్బన్ కణాలను దాదాపు 90 శాతం వరకు పీల్చుకోగలవు. వీటిని ‘పైరోజెనిక్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్’ గా వ్యవహరిస్తున్నారు. యంత్రాల ద్వారా పీల్చి సేకరించిన కార్బన్‌ను పైపులైన్ల ద్వారా కార్బన్‌ను నేరుగా ఉపయోగించుకునే పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో నెలకొల్పిన కార్బన్ క్యాప్చరింగ్ యంత్రాలు ఏడాది 5 కోట్ల టన్నుల కార్బన్‌ను గాలి నుంచి తొలగించగలుగుతున్నాయి.
పగడపు దిబ్బల పరిరక్షణ..
సముద్రాలు సైతం వేడెక్కేస్థాయికి భూతాపం చేరడం వల్ల విలువైన పగడపుదిబ్బలు వేగంగా క్షీణించే పరిస్థితి ఏర్పడింది. పగడపుదిబ్బలు అంతరించిపోయే పరిస్థితిని నివారించడానికి శాస్త్రవేత్తలు 1998 నుంచి ముమ్మరంగా ప్రయత్నాలను ప్రారంభించారు. పగడపుదిబ్బల పరిరక్షణ కోసం ఒకవైపు శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా, గడచిన పదిహేనేళ్లలో ముప్పయి శాతం పగడపుదిబ్బలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రానున్న రెండేళ్లలో మరో ఆరు శాతం పగడపుదిబ్బలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు గొప్ప జీవవైవిధ్యానికి నెలవులు. పగడపుదిబ్బలను ఆవాసంగా చేసుకుని, నాలుగువేలకు పైగా మత్స్యజాతులు, ఎనిమిదివందలకు పైగా పగడపుజీవులు, వాటితో పాటే ఎనబైలక్షలకు పైగా వృక్షజాతులు మనుగడ సాగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున మూడు కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరుతోంది.
మితిమీరిన కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరడం వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ జరిగి, పగడపుదిబ్బలు శరవేగంగా క్షీణించిపోతున్నాయి. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు నశిస్తే, మానవాళికి వాటిల్లే నష్టమేమిటనుకుంటే పొరపాటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగడపుదిబ్బలు అంతరించడం వల్ల జీవవైవిధ్యానికి, పర్యావరణానికి జరిగే నష్టం ఫలితంగా 2030 నాటికి పదికోట్ల మంది మనుషులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మానవాళికి వాటిల్లబోయే ఈ ముప్పును అరికట్టడానికే శాస్త్రవేత్తలు పగడపుదిబ్బలను చల్లబరచడానికి ‘సీ వాటర్ ఎయిర్‌కండిషనింగ్’ వంటి పద్ధతుల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
దీనికోసం భారీ యంత్రాలను ఉపయోగించి, వేడెక్కిన సముద్రజలాలను పైపుల ద్వారా పైకి తీసుకొచ్చి, ఆ నీటిని చల్లబరిచి తిరిగి సముద్రంలోకి పంపుతుండటం వల్ల కొంతవరకు పగడపుదిబ్బలను చల్లబరచగలుగుతున్నారు. పగడపుదిబ్బలను చల్లబరచిన ప్రదేశాల్లో అక్కడి పగడాల రంగులో గాఢత పెరగడం వంటి గుణాత్మకమైన మార్పులను సాధించగలుగుతున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా సాగితేనే పగడపుదిబ్బలు పదికాలాల పాటు సురక్షితంగా ఉండగలవు. వాటితో పాటే మనుషులు కూడా పదిలంగా మనుగడ సాగించగలరు.
(చదవండి: థింక్ ట్యూన్ అప్!)
Comments
Please login to add a commentAdd a comment